వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ | Bail for YS Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌

Published Sat, May 4 2024 4:53 AM | Last Updated on Sat, May 4 2024 12:11 PM

Bail for YS Bhaskar Reddy

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

పలు షరతుల విధింపు

హియర్‌ సే ఎవిడెన్స్‌ సాక్ష్యంగా చెల్లదు

గూగుల్‌ టేకవుట్‌ ప్రామాణికం కాదని ఆ సంస్థే చెబుతుంది

వాదనలు వినిపించిన పిటిషనర్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి

కావాలనే సీబీఐ విచారణను జాప్యం చేస్తోంది

ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్‌కు అంగీకారం

ఇదే కేసులో గజ్జల ఉదయ్‌శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హై­కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించొద్దని ఆదేశిస్తూ కోర్టుకు పాస్‌­పోర్టు, రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరు ష్యూరిటీలు ఇ­వ్వా­లని సూచించింది. ప్రతి మంగళవారం ఉద­యం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హైదరాబాద్‌ సీసీఎస్‌లో హాజరు కావాలని  ఆదే­శించింది. విచారణలో జోక్యం చేసుకో­వద్దని, సాక్షులను బెదిరించొద్దని ఆదేశించింది. 

వైఎస్‌ వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌­కుమార్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరి­కించారని త­మకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని.. బె­యిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌­కుమార్‌రెడ్డితో పాటు సునీల్‌ యాదవ్‌ హైకో­ర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయ­మూ­ర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పారు. 

అరెస్టు సమర్థనీయం కాదు 
నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం (హియర్‌ సే ఎవిడెన్స్‌) చట్టప్రకారం సాక్ష్యంగా చెల్లదని వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్‌ టేక­వుట్‌ ప్రామాణికమని ఆ సంస్థే ధృవీకరణ ఇవ్వద­న్నారు. ఇలాంటి సాక్ష్యా­లతో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి అరె­స్టు సమర్థనీయం కాద­న్నారు. ‘మూడో చార్జిషీట్‌ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్‌) దాఖలు చే­సే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లే­వు. ఆ తర్వాత నిందితు­లుగా చేర్చడంలో కుట్ర కో­ణం దాగి ఉంది.

వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కో­రుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినవారు కిరా­యి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగ­డా­ని­కి మాత్రం సహకరిస్తున్నారు. హత్య వెనుక వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌­కుమార్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా గంగి­రెడ్డి తాను అలా చెప్పలేదని పేర్కొ­న్నారు. దస్తగిరి చెప్పిన విషయానికి అంత ప్రా«­దా­న్యమిస్తున్న సీబీఐ ఇతరుల వాంగ్మూలా­లను మాత్రం పట్టించుకోవడంలేదు’ అని నిరంజన్‌ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. 

తండ్రి తన కుమారుడికి ఫోన్‌ చేయడం కూడా కుట్రేనా?
‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నా­నని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఈయనపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయనను తప్పించి.. మరొకరిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

హత్య జరిగిన రోజు వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఫోన్‌ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి తన కుమారుడికి ఫోన్‌ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్‌ కోర్టులో సీబీఐ విచారణను సాగదీస్తోంది’ అని నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తికి నివేదించారు. 

వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ ఇవ్వాలి.. 
‘‘పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే సాక్ష్యాలు లేవు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి వయసు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ట్రయల్‌ కోర్టు పలుమార్లు మధ్యంతర బె­యిల్‌ మంజూరు చేసింది. అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల వద్దకు చేర్చా­ల్సి ఉంటుంది. జైలులో ఉంటే అదెలా సాధ్యం? ఆయ­నకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ఏడాదిగా జైలులో ఉంటు­న్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భా­స్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌రెడ్డికి బె­యి­ల్‌ మంజూరు చేయాలి. 

ఇదే హైకోర్టు శివశంకర్‌­రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. వీరికి కూడా అదే వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితులను జైలులో ఉంచడం వారి హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి గత నెలలో తీర్పును రిజర్వ్‌ చేసి శుక్రవారం  తీర్పు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement