సంగారెడ్డి జిల్లా ‘పోక్సో’కోర్టు సంచలన తీర్పు
11 నెలల వ్యవధిలోనే శిక్ష విధించిన కోర్టు
సంగారెడ్డి జోన్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్ (61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్ 16న ఆదిత్రి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.
11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్‌డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్‌షీటు దాఖలు చేశారు.
కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు.
27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment