రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన రైతు దీక్ష సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్. చిత్రంలో కౌశిక్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్, శ్రీనివాస్‌గౌడ్, సబిత తదితరులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు తప్పవు
ప్రతి రైతుకు రేవంత్ ప్రభుత్వం ఎకరానికి రూ.17,500 బాకీ
ఒక్కో మహిళకు ఇప్పటికే రూ.30 వేలు బకాయి పడ్డ సర్కారు
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను వీటి కోసం నిలదీయండి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్‌ఎస్ రైతు దీక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్: బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 26 నుంచి రైతులందరికీ ఎకరానికి రూ.17,500, కౌలు రైతులకు రూ.15,000, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 ఇవ్వాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేవెళ్ల సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ పది నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.
అప్పట్లో కాంగ్రెస్ తరఫున వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఈ ఉప ఎన్నికలపై కూడా వాదిస్తున్నారు. కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు ఆ స్థానాల్లో పోటీకి బీఆర్‌ఎస్‌లో అనేక మంది సిద్ధంగా ఉన్నారు’అని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లాపట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ సహా సీఎం రేవంత్‌రెడ్డిపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు ఢిల్లీలో సీఎం గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తామంటుండు
కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ‘నాడు కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడు పైసలు ఇస్తే.. నేడు రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా అంటుండు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేక పోయిండు. 1.60 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.30 వేలు బాకీ పడింది.
ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ముందు తమ బాకీ తీర్చాలని అడగండి’అని పిలుపునిచ్చారు. 21న నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ ఈ దీక్షలు కొనసాగుతాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ రైతు దీక్షలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment