ప్రతీకాత్మక చిత్రం
జాతీయ బాలికా దినోత్సవం ఏటా జనవరి 24న జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశాలు... బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, అత్యాచారాలపై అవగాహన కల్పించడం,; విద్య, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి బాలికా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని భారత్ 2008 నుండీ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
భారత రాజ్యాంగం ఆడ, మగ – ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్షతో గర్భంలో ఉండగానే స్కానింగ్‌లతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇప్పటికీ గర్భస్రావం చేయిస్తున్నారు. మన సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని ఆడ శిశువుల అంతానికి ఉపయోగించడం దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు ఉన్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని దుఃస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. 2015 లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘షాదీ ముబారక్’ వంటి పథకాలు బాల్య వివాహాలను కొంతవరకు తగ్గించాయి.
స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యా వంతులు అవుతారని భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. ఆనాటి నుండి నేటి వరకూ బాలికల విద్య నిర్లక్ష్యానికి గురి అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 82 శాతం మగవారు, 65 శాతం బాలికలు అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతా 35 శాతం బాలికలు బడికి దూరంగానే ఉన్నారు.
2009 విద్యాహక్కు చట్టం ఫలితంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో వెనుకబడిన తరగతుల బాలికలు చదువుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. అయినప్పటికీ పల్లెటూర్లలో బాలికల అక్షరాస్యత తక్కువగానే ఉంది. ఏ లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నామో... వాటిని సాకారం చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలకూ బాధ్యత ఉంది. (క్లిక్ చేయండి: మన క్రీడాకారిణులకు బాసట ఏది?)
– సయ్యద్ షఫీ, హనుమకొండ
(జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment