ప్రతీకాత్మక చిత్రం
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రంలో దళిత సంక్షేమం కోసం ఎంతో చేశామని చెప్పే నాయకులకూ... దళిత కులాలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల కొనసాగింపు ఇక అనవసరమని వాదించే మేధావులకూ కొదవ లేదు. కానీ నిలువెల్లా అసమానతలు నిండిన ఈ సమాజంలో కులం ఎలాంటి పాత్ర పోషిస్తున్నదో, ఏ పర్యవసానాలకు దారితీస్తున్నదో ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.
భారత్‌లో దళిత కులాల్లో పుట్టడం, అందునా ఆడపిల్లగా పుట్టడం ప్రాణాంతకమవుతున్నదని గణాంక సహితంగా నిరూపించింది. ఆధిపత్య కులాల్లో పుట్టిన సగటు మహిళతో పోలిస్తే దళిత కులాల్లోని మహిళల ఆయుఃప్రమాణం 14.6 సంవత్సరాలు తక్కు వని ఆ నివేదిక చెబుతోంది. ఆధిపత్య కులాల్లోని మహిళల సగటు ఆయః ప్రమాణం 54.1 సంవత్సరాలైతే దళిత మహిళల ఆయుః ప్రమాణం 39.5 సంవ త్సరాలని తేల్చింది.
రెండున్నరేళ్ల క్రితం అంటే... 2015 సెప్టెంబర్‌లో ప్రపంచ దేశాధినేతలందరూ సమావేశమై 2030 నాటికల్లా సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. పదిహేను సంవత్సరాల వ్యవధిలో ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాలు సాధించాలన్నది సమితి సమావేశం ధ్యేయం. పేదరిక నిర్మూలన అందులో మొదటి లక్ష్యమైతే, ఆకలిని అంతమొందించడం, మంచి ఆరోగ్యం, ప్రామాణిక విద్య, లింగ వివక్ష అంతం, అసమానతల తగ్గింపు తదితరాలు ఇతర లక్ష్యాలు. వాటి సాధనకు వివిధ దేశాలు నిర్ణయించుకున్న కార్యాచరణ ఏమిటో, అది ఇంతవరకూ ఎలాంటి ఫలితాలనిచ్చిందో తెలుసుకోవడం...లోటుపాట్లను వెల్లడించి దిద్దుబాటు చర్య లకు సూచనలీయడం తాజా నివేదిక ఉద్దేశం.
సమితి నిర్దేశించిన కాల వ్యవధిలో ఇప్పటికే రెండున్నరేళ్లు ముగిశాయి. ఇక మిగిలింది పన్నెండున్నర సంవత్సరాలు. దురదృష్టకరమైన విషయమేమంటే ఈ నివేదికను గమనించినా, మన దేశంలోని వర్తమాన స్థితిగతులను అర్ధం చేసుకున్నా 2030 కాదుగదా... 3030కి కూడా ఈ లక్ష్యాల సాధన అసాధ్యమనిపిస్తుంది. ఆడ శిశువుల్ని చిదిమేసే నరమేథం మన దేశంలో యధేచ్ఛగా సాగుతోంది. బాలిక పుడితే భారమని భావించి రోజుకు 1,370మంది ఆడశిశువుల్ని హతమారు స్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వాలున్నాయి. అయినా ఈ దుర్మార్గం ఎక్కడా తగ్గిన దాఖలాలు కనబడటం లేదు. పుట్టాక ఇంట్లోనూ, చదువు కోసం చేరింది మొద లుకొని సమాజంలోనూ ఎదుర్కొంటున్న వివక్షకు అంతూ పొంతూ ఉండటం లేదు. పుట్టిన కులాన్నిబట్టి ఈ వివక్షలో సైతం హెచ్చుతగ్గులుంటున్నాయని సమితి నివేదిక చెబుతోంది.
దళిత కులాల మహిళలు ఎక్కువ వివక్ష చవిచూడవలసి వస్తున్నదని వివరిస్తోంది. ఆహారం, ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, మంచినీరు వంటి సదుపాయాల లభ్యతలో ఉన్న తేడా వల్ల ఈ రెండు వర్గాల్లోని మహిళల ఆయుః ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయన్నది నివేదిక సారాంశం. అడుగు ముందుకే పడినట్టు కనిపిస్తుంది. ఆధునికత విస్తరిస్తోంది. అభివృద్ధి కొత్త అంచుల్ని తాకుతోంది. కానీ ఆడపిల్లపై వివక్ష మాత్రం ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని స్థిరంగా ఉంది. పైగా పుట్టిన కులాన్నిబట్టి దాని తీవ్రతలో తేడా ఉంటున్నది.
చదువుకోవడం మొదలుకొని అన్ని విషయాల్లోనూ దళిత, పేద కులాల మహిళలకూ, ఆధిపత్య కులాల్లోని మహిళలకూ వ్యత్యాసం ఉన్నదని నివే దిక వెల్లడించింది. ఆడపిల్ల చదువు, పెళ్లి, ఆర్థిక స్వాతంత్య్రం వగైరాలన్నీ పుట్టుకే నిర్ణయిస్తున్నదని నివేదికలోని గణాంకాలు చెబుతున్నాయి. పద్దెనిమిదేళ్లలోపునే పెళ్ల యిన మహిళలు ఆధిపత్య కులాలతో పోలిస్తే దళిత కులాల్లో అయిదు రెట్లు ఎక్కువ. బడికెళ్లడం విషయంలో ఈ తేడా మరిన్ని రెట్లు ఎక్కువ.
నిజానికి ఈ నివేదిక ఇక్కడి సామాజిక వివక్షను దాని లోతుల్లోకి పోయి పరిశీలించినట్టు కనబడదు. ఆ పని చేసినట్టయితే ఇది మరింతగా తేట తెల్లమయ్యేది. రెండు రోజులక్రితం బడి పిల్లల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చానెళ్ల ద్వారా ‘పరీక్షా పర్ చర్చా’ నిర్వహించినప్పుడు దాన్ని వీక్షించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక పాఠశాల కమిటీ అధ్యక్షుడి ఇంట్లో గ్రామ పంచాయతీ టెలివిజన్ ఏర్పాటు చేస్తే ఆధిపత్య కులాల పిల్లల్ని లోపలా, దళిత కులాల పిల్లల్ని వెలుపల దూరంగా గుర్రాలు కట్టే స్థలంలో కూర్చోబెట్టారని మీడియాలో కథనాలొచ్చాయి.
గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో తమకు దక్కాల్సిన భూమికి పట్టాల్విడంలో జిల్లా యంత్రాంగం జాప్యం చేస్తున్నదని విసిగి ఒక దళిత కార్యకర్త ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 2011నాటి జనాభా గణనలో వెల్లడైన సాంఘికార్థిక స్థితిగతుల ప్రకారం దేశంలో 67 శాతం దళిత కుటుంబాలకు సొంతంగా భూమి లేదు. ఆదివాసీల్లో ఈ శాతం మరింత అధికం. భూమి మీద హక్కు లేనప్పుడు ఇతర హక్కులు కూడా వారికి దక్కవు. కనుకనే ఆ వర్గాలు కనీస సదుపాయాలకు సైతం దూరంగా ఉంటున్నాయి.
ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రారంభించే పథకాలు వారికి సక్రమంగా చేరడం లేదు. ఈ అసమానత ప్రభావం ఆ కులాల్లోని బాలికలు, మహిళల విషయంలో మరింత ఎక్కువగా ఉంటున్నది. ఐక్యరాజ్యసమితి నిర్దే శించిన లక్ష్యాల సాధనలో కాస్తయినా పురోగతి కనబడకపోవడానికి కారణం ప్రభుత్వాలన్నీ భూ పంపిణీని నిర్లక్ష్యం చేయడమే. నీరవ్ మోదీ లాంటి వాడు పరిశ్రమ పెడతామంటే ఎకరాలకు ఎకరాలు సంతర్పణ చేయడానికి సిద్ధపడే ప్రభు త్వాలు దళిత కుటుంబాలకు ఒకటి రెండెకరాల భూమిని ఇవ్వలేకపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కాయకష్టం తప్ప మరేమీ లేని ఆ కులాల సామాజికాభివృద్ధి సాధ్యపడేదెలా? ఐక్యరాజ్యసమితి లక్ష్య నిర్దేశం చేయడం, వాటిని సాధిస్తామని పాలకులు ప్రతినబూనడం చూడటానికి బాగానే ఉండొచ్చు. కానీ మౌలిక సమస్యల జోలికి పోనంతకాలమూ ఫలితాలు వెక్కిరిస్తూనే ఉంటాయి. మిగిలిన వ్యవధి లోనైనా ఎంతో కొంత సాధించాలంటే అందుకు నిర్దిష్ట కార్యాచరణ అవసరమని పాలకులు గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment