దేశంలో మహిళలు ఇప్పటికీ అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, లింగ వివక్ష వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ఈ పరిస్థితి మారాలి. మహిళతో పాటు నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత కూడా జీవన సంక్షోభంలో ఉన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద భావనలు కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించగలిగే నూత్న భారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలి.
భారతదేశం లౌకిక దేశం. భారతాన్ని వర్ణ భారతంగా మార్చాలన్నది పెద్ద వ్యూహం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగంగా రూపుదిద్దారు. దాని పునాదులను కదపటం ఎవరి వల్లా కాదు. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఫ్రెంచి విప్లవంలోని వాల్టేర్, రూసో భావాలను తీసు కున్నారు. నిజానికి ఆయన రాజ్యాంగం పునాదుల పునర్నిర్మాణం నుండి ప్రారంభమైంది. రాజ్యాంగం ప్రకారం, ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలి.
14 సంవత్సరాల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పాలి. అయితే ఈనాటికీ బాల బాలికలకు పౌష్టిక ఆహారం పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము. పసిపిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. పిల్ల లకు పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య పరిరక్షణ కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. పురిటిలోనే శిశువులు చనిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒక శిశువుని పెంచి పోషించాలంటే పేదరాలైన తల్లి వల్ల కాదు. దానికి ప్రభుత్వపు, సమాజపు బాధ్యత కూడా కావాలి.
నిజానికి ఒక శిశువు మరణిస్తే ఆ దేశానికి భవిష్యత్తు మరణించినట్టే. రాను రాను భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దానికి కారణం విపరీతంగా రేట్లు పెరిగిపోవడమే. 2019 జనవరి నుండి 2022 మే వరకు కూరగాయలు, పాలు, బెల్లం,దుంపలు, వంటనూనె, గుడ్లు, పంచదార ఉత్పత్తి, సరఫరా తగ్గు ముఖం పట్టాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుక్కోలేని స్థితికి సామాన్యులు నెట్టబడుతున్నారు. కారణం కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, విత్తనాల ధరలు ఎక్కువవు తున్నాయి. అకాల వర్షాలకు రైతు కుదేలవుతున్నాడు. కాళ్ళు సన్నగా, కడుపులు బోలుగా, భుజాన కండలేక 40 కోట్ల మంది ఈసురోమంటున్నారు.
ఇంక స్త్రీల విషయానికి వస్తే పురుషులు తినినంత కూడా తినలేక పోతున్నారు. వాళ్లు అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. వారితో ఆరు గాలం పనిచేయించుకుంటున్నారు. మహిళల్లో సగం మంది కూడా ఉద్యోగినులు లేరు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, అల్ప విద్యాస్థాయి, తగు ఆస్తులు లేకపోవడం, లింగ వివక్ష, మహిళలపై నేరాలు, ఘోరాలు అత్యధికంగా ఉండడం వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలుగా చెప్పక తప్పదు. ఎన్‌సీ ఆర్‌బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక (డిసెంబర్ 2023) ప్రకారం, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు 2021లో కంటే, 2022లో 4 శాతం అధికంగా సంభవించాయి.
2022లో మహిళలకు వ్యతిరేకంగా 4,45,000 నేర ఘటనలు జరిగాయి. కుటుంబ సభ్యుల క్రూరత్వం, దౌర్జన్యాలు ఈ నేరాలలో అత్యధికం. ప్రతీ జీవన వ్యవ హారంలోనూ, మరీ ముఖ్యంగా ఆదాయంలో లింగ వ్యత్యాసం, వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పట్టణ మహిళల భాగస్వామ్యం 24.0 శాతం కాగా, పురుషుల శాతం 73.8 శాతంగా ఉన్నది. 2004–2005, 2011–2012 సంవత్సరాల మధ్య కార్మిక శ్రేణుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వైదొలిగారని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడించాయి.
ఈ అంతరాలను విస్మరించడమంటే, మహిళలు ఇంకా పలు దశా బ్దాల పాటు అణచివేతకు గురికావడమే అని నిష్కర్షగా చెప్పక తప్పదు. భారతదేశం పితృస్వామ్య వ్యవస్థా నిర్మాణంతో ఉంది.అంటే ప్రతీ అంశంలోనూ పురుషుడిదే ఆధిపత్యం. అందుకే ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా చాలామంది పురు షులకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలికలు, యువతులను అపహరించడం, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపడం ఎక్కువవుతోంది.
స్త్రీలను అవమానించడం, అను మానించడం, అపహాస్యం చేయడం, అత్యాచారం చేయడం, అణచి వేయడం నిత్యాచారమైంది. భారతదేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ముందుగా స్త్రీకి మనం పౌష్టికాహారం పెట్టగలగాలి. స్త్రీల పేరు మీద భూములకు పట్టా లివ్వాలి. బస్సుల్లోనే కాక రైళ్ళల్లోనూ, విమానాల్లోనూ ఉచిత సేవలు అందించాలి. అప్పుడు అన్ని చోట్లకీ ఆమె ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మూడు శవర్లు బంగారం ప్రతీ స్త్రీకి ఇవ్వాలి.
ఇకపోతే నిరుద్యోగుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోంది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక 2023 ప్రకారం, 25 సంవ త్సరాల లోపు వయసు పట్టభద్రులలో నిరుద్యోగితా రేటు 42.3 శాతం. 30 నుంచి 34 సంవత్సరాల వయసు పట్టభద్రులలో ఇది 9.8 శాతం. ఈ నిరుద్యోగిత పరిస్థితులు సమాజంపై విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్గత వలసలు, అంతకంతకూ పెచ్చరిల్లుతోన్న నేరాలు, హింసాకాండ, మాదకద్రవ్యాల వినియోగం నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకపక్షం హామీ కేవలం ఒక ఎన్నికల జుమ్లా (వంచన) అని తేలిపోయింది.
నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎంఏ, ఎంఎడ్, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీఎడ్‌లు చేసి కూడా ఉపాధి పనులకు వెళ్తున్నారు. సింగపూర్‌లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ ప్రతిభా పోటీతత్వ సూచీ(జీటీసీఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జీటీసీఐ’ని రూపొంది స్తాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడింది. అయినా, ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మా గారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి.
ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. శిశువు, స్త్రీ, నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత జీవన సంక్షోభంలో ఉన్నారు. భారత రాజ్యాంగం సమర్పించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమత, మమత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామ్యవాదం కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు సామర్థ్యాన్ని పెంచుకొని, చైతన్యవంతంగా ఉత్పత్తిని పెంచుకోవాలి. సామరస్యతను పెంచుకొని ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. అంబేడ్కర్, ఫూలే, బుద్ధుని ఆశయా లతో సంపద అందరికి పంపిణీ అయ్యే విధానంతో సాగాలి.
మొత్తం భారతదేశం 2025 జనవరి 1 కల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. పారిశ్రామిక విప్లవంలో ముందడుగు వేయాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించ గలిగే నూత్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. నదులను అనుసంధానం చేసుకొని ఎక్కువ ఎగుమతులు చేయగలిగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞా నాన్ని మరింతగా పెంచుకోవాలి.
చంద్రుడినే కాదు, అనేక గ్రహాలను అధీనం చేసుకునే స్థాయికి ఎదగాలి. భౌతిక, రసాయన శాస్త్ర అధ్యయన విస్తృతి పెరగాలి. నోబెల్ బహుమతి పొందగలిగే స్థాయిలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పెంచాలి. అన్ని దిశలా అన్ని రంగాల్లో భారతీయులందరం భాగస్వాములై భారత భాగ్యోదయా నికి కృషి చేద్దాం. చరిత్రను పాలకులు కాదు, ప్రజలే మారుస్తారు. చరిత్ర నిర్మాణానికి ముందుకు నడుద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment