ఒలింపిక్స్‌లో నిలకడగా భారత రెజ్లర్ల ప్రదర్శన
2008 నుంచి పతకాలతో తిరిగి వస్తున్న కుస్తీ వీరులు
ఆశలు రేకెత్తిస్తున్న భారత మహిళా రెజ్లర్లు
అంతిమ్, వినేశ్‌లపై భారీ అంచనాలు
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశాల్లో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన క్రీడ రెజ్లింగ్. ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో భారత్‌కు ఏడు పతకాలు లభించాయి. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఖాషాబా జాధవ్ కాంస్య పతకాన్ని అందించాడు. ఆ తర్వాత 56 ఏళ్లపాటు ఒలింపిక్స్ నుంచి మన కుస్తీ వీరులు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. 2008లో సుశీల్ కుమార్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంస్య పతకాన్ని సాధించాడు.
సుశీల్ పతకంతో అంతర్జాతీయ స్థాయిలో భారత రెజ్లింగ్ ముఖచిత్రం మారిపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మరోసారి పట్టు సడలించకుండా పోరాడి రజత పతకాన్ని సొంతం చేసుకోగా... యోగేశ్వర్ దత్ కాంస్య పతకం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకంతో ప్రతిష్టను పెంచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజత పతకంతో, బజరంగ్ పూనియా కాంస్య పతకంతో మెరిశారు.
గత నాలుగు ఒలింపిక్స్ క్రీడల నుంచి వరుçసగా పతకాలు తెస్తున్న భారత రెజ్లర్లు ఇదే ఆనవాయితీని పారిస్ లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. భారత్ నుంచి పారిస్ గేమ్స్‌లో ఆరుగురు రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమన్ సెహ్రావత్ (57 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. రెజ్లింగ్ పోటీలు ఆగస్టు 5 నుంచి 11 వరకు జరుగుతాయి.
రవి దహియాను ఓడించి...
గత టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంలో భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు రవికుమార్, బజరంగ్, దీపక్ పూనియా పోటీపడ్డారు. అయితే ఈసారి ఈ ముగ్గురూ పారిస్ బెర్త్‌లు దక్కించుకోలేకపోయారు. పారిస్ గేమ్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల కోసం భారత రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో రవి, బజరంగ్ ఓడిపోగా... దీపక్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో గట్టెక్కలేకపోయాడు.
జాతీయ ట్రయల్స్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవి దహియాను ఓడించిన అమన్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరడంద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ పారిస్ నుంచి పతకంతో రావాలంటే పక్కా ప్రణాళికలతో, భిన్నమైన వ్యూహాలతో సిద్ధంకావాలి.
సుశీల్, యోగేశ్వర్ సరసన...
మహిళల విభాగంలో అందరి దృష్టి వినేశ్ ఫొగాట్ పైనే ఉండనుంది. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తడబడ్డ వినేశ్ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. తద్వారా సుశీల్, యోగేశ్వర్ దత్ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న తొలి మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా మూడో భారతీయ రెజ్లర్‌గా వినేశ్ గుర్తింపు పొందనుంది. అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న వినేశ్ ఖాతాలో కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది.
జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అంతిమ్ పంఘాల్ ప్రపంచ సీనియర్ చాంపియన్íÙప్‌లో కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ గత ఏడాది ఆసియా క్రీడల తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. అయినప్పటికీ అనుకూలమైన ‘డ్రా’ లభించడంతో అంతిమ్ కీలక బౌట్‌లలో రాణిస్తే తప్పకుండా ఒలింపిక్ పతకంతో తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒలింపిక్స్ మినహా మిగతా పెద్ద ఈవెంట్స్‌లో పతకాలు నెగ్గిన అన్షు మలిక్ రెండోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుంటే అన్షు మలిక్ పారిస్‌లో సంచలన ఫలితాలు నమోదు చేసే చాన్స్ ఉంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న నిషా దహియా, రీతిక హుడాలకు చివరి సెకన్లలో పాయింట్లు కోల్పోయే బలహీనత ఉంది. తీవ్రమైన పోటీతత్వం ఉండే ఒలింపిక్స్‌లో వారు ఈ బలహీనతను అధిగమిస్తే అద్భుతం చేసే అవకాశముంది.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment