wrestlers
-
‘పట్టు’ కొనసాగించాలి.. అంతిమ్, వినేశ్‌లపై భారీ అంచనాలు
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశాల్లో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన క్రీడ రెజ్లింగ్. ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో భారత్‌కు ఏడు పతకాలు లభించాయి. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఖాషాబా జాధవ్ కాంస్య పతకాన్ని అందించాడు. ఆ తర్వాత 56 ఏళ్లపాటు ఒలింపిక్స్ నుంచి మన కుస్తీ వీరులు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. 2008లో సుశీల్ కుమార్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంస్య పతకాన్ని సాధించాడు. సుశీల్ పతకంతో అంతర్జాతీయ స్థాయిలో భారత రెజ్లింగ్ ముఖచిత్రం మారిపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మరోసారి పట్టు సడలించకుండా పోరాడి రజత పతకాన్ని సొంతం చేసుకోగా... యోగేశ్వర్ దత్ కాంస్య పతకం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకంతో ప్రతిష్టను పెంచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజత పతకంతో, బజరంగ్ పూనియా కాంస్య పతకంతో మెరిశారు. గత నాలుగు ఒలింపిక్స్ క్రీడల నుంచి వరుçసగా పతకాలు తెస్తున్న భారత రెజ్లర్లు ఇదే ఆనవాయితీని పారిస్ లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. భారత్ నుంచి పారిస్ గేమ్స్‌లో ఆరుగురు రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమన్ సెహ్రావత్ (57 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. రెజ్లింగ్ పోటీలు ఆగస్టు 5 నుంచి 11 వరకు జరుగుతాయి. రవి దహియాను ఓడించి... గత టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంలో భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు రవికుమార్, బజరంగ్, దీపక్ పూనియా పోటీపడ్డారు. అయితే ఈసారి ఈ ముగ్గురూ పారిస్ బెర్త్‌లు దక్కించుకోలేకపోయారు. పారిస్ గేమ్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల కోసం భారత రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో రవి, బజరంగ్ ఓడిపోగా... దీపక్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో గట్టెక్కలేకపోయాడు. జాతీయ ట్రయల్స్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవి దహియాను ఓడించిన అమన్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరడంద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ప్రస్తుత ఆసియా చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ పారిస్ నుంచి పతకంతో రావాలంటే పక్కా ప్రణాళికలతో, భిన్నమైన వ్యూహాలతో సిద్ధంకావాలి.సుశీల్, యోగేశ్వర్ సరసన... మహిళల విభాగంలో అందరి దృష్టి వినేశ్ ఫొగాట్ పైనే ఉండనుంది. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తడబడ్డ వినేశ్ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. తద్వారా సుశీల్, యోగేశ్వర్ దత్ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న తొలి మహిళా రెజ్లర్‌గా, ఓవరాల్‌గా మూడో భారతీయ రెజ్లర్‌గా వినేశ్ గుర్తింపు పొందనుంది. అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న వినేశ్ ఖాతాలో కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది.జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అంతిమ్ పంఘాల్ ప్రపంచ సీనియర్ చాంపియన్íÙప్లో కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ గత ఏడాది ఆసియా క్రీడల తర్వాత మరే టోర్నీలోనూ ఆడలేదు. అయినప్పటికీ అనుకూలమైన ‘డ్రా’ లభించడంతో అంతిమ్ కీలక బౌట్లలో రాణిస్తే తప్పకుండా ఒలింపిక్ పతకంతో తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒలింపిక్స్ మినహా మిగతా పెద్ద ఈవెంట్స్‌లో పతకాలు నెగ్గిన అన్షు మలిక్ రెండోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుంటే అన్షు మలిక్ పారిస్‌లో సంచలన ఫలితాలు నమోదు చేసే చాన్స్ ఉంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న నిషా దహియా, రీతిక హుడాలకు చివరి సెకన్లలో పాయింట్లు కోల్పోయే బలహీనత ఉంది. తీవ్రమైన పోటీతత్వం ఉండే ఒలింపిక్స్‌లో వారు ఈ బలహీనతను అధిగమిస్తే అద్భుతం చేసే అవకాశముంది. –సాక్షి క్రీడా విభాగం -
భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లకు నిరాశ
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో తొలి రోజు భారత పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. అందుబాటులో ఉన్న ఆరు వెయిట్ కేటగిరీల (57, 65, 74, 86, 97, 125 కేజీలు) నుంచి ఒక్క విభాగంలోనూ భారత రెజ్లర్‌కు ఒలింపిక్ బెర్త్ ఖరారు కాలేదు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్ చేరిన ఇద్దరికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్‌కు త్రుటిలో ఒలింపిక్ బెర్త్ చేజారింది. సెమీఫైనల్లో అమన్ 0–10తో గులోమ్జన్ అబ్దుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు అమన్ తొలి రౌండ్లో 10–0తో యెరాసిల్ ముఖాతరూలీ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–1తో కిమ్ సంగ్వన్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత ఇతర రెజ్లర్లు జైదీప్ (74 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో... దీపక్ (97 కేజీలు) తొలి రౌండ్లో... సుమిత్ మలిక్ (125 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. దీపక్, సుజీత్ ఆలస్యంగా... టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం బౌట్లో ఓడిపోయిన దీపక్ పూనియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఎంట్రీలు పంపించినా దురదృష్టం వారిని వెంటాడింది. రష్యాలో ఈనెల 2 నుంచి 15 వరకు శిక్షణ పొందిన దీపక్, సుజీత్ 16న దుబాయ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిషె్కక్ చేరుకోవాలనుకున్నారు. అయితే దుబాయ్‌లో అనూహ్య వరదల కారణంగా వీరిద్దరు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. పలు విమానాలు రద్దు కావడం... మరికొన్ని ఆలస్యంగా నడవడంతో దీపక్, సుజీత్ శుక్రవారం తప్పనిసరిగా హాజరుకావాల్సిన వెయింగ్ కార్యక్రమానికి సమ యా నికి చేరుకోలేకపోయారు. దాంతో దీపక్, సుజీత్ ఈ టోర్నీలో బరిలోకి దిగలేకపోయారు. మే నెలలో టర్కీలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో భారత రెజ్లర్లకు పారిస్ బెర్త్‌లు సంపాదించే అవకాశం మిగిలి ఉంది. శనివారం మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అన్షు (57 కేజీలు), మాన్సి (62 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక (76 కేజీలు) బరిలో ఉన్నారు. -
యువ రెజ్లర్ల నిరసన
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), సీనియర్ రెజ్లర్ల మధ్య గొడవలతో తమ భవిష్యత్తు నాశనం అవుతోందని యువ రెజ్లర్లు నిరసనకు దిగారు. ఏడాది కాలంగా డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో కూరుకుపోవడంతో శిబిరాలు, జాతీయ జూనియర్, సబ్–జూనియర్ టోర్నీలు లేక యువ రెజ్లర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీనిపై ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలకు చెందిన సుమారు 300 మంది వర్ధమాన రెజ్లర్లు బస్సుల్లో వచ్చి జంతర్‌మంతర్ వద్ద మూడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్, కామన్వెల్త్ చాంపియన్ వినేశ్ ఫొగాట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ ముగ్గురి బారి నుంచి మమ్మల్ని కాపాడండి’ అనే బ్యానర్లతో పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. 10 రోజుల్లోగా సమాఖ్యపై నిషేధాన్ని ఎత్తేయాలని, వెంటనే టోర్నీల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా అవార్డుల్ని వెనక్కిస్తామని ప్రకటించారు. మరో వైపు దీనిపై అడ్‌హక్ కమిటీ అవసరమైన చర్యలు చేపట్టింది. ఆరు వారాల్లోనే అండర్–15, అండర్–20 కేటగిరీలో జాతీయ చాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. రెజ్లర్ల కెరీర్‌కు సంబంధించిన వ్యవహారాలను తీవ్రంగా పరిశిలిస్తామని, ఇకపై సమాఖ్య బాధ్యతల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై రియో ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి స్పందించారు. వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ విధేయుడు సంజయ్ సింగ్‌ను అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తే కొత్త కార్యవర్గంతో తమకు ఏ ఇబ్బందీ లేదని ఆమె ప్రకటించింది. -
'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి -
రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక అఆరోపణలు చేస్తూ కన్నాట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేసిన ఇద్దరు మహిళా రెజ్లర్లకు సమన్లు పంపించారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఆరోపణలు చేసినదాని ప్రకారం వీడియోలు, ఆడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోటోలు, బెదిరింపు సందేశాలు వంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే స్టేషన్లో పొందుపరచాలని కోరింది. ఫిర్యాదు ప్రకారమే సమన్లు.. ఏప్రిల్ 21న భారత మహిళా రెజ్లర్లు ఇద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, ఊపిరి చెక్ చేస్తానంటూ ఇష్టానుసారంగా మీద చేతులు వేస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కన్నాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు తర్వాత ఈ కేసులో సత్వర విచారణ చేసి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని భారత్ ప్రఖ్యాత రెజ్లర్లు నిరసన తెలుపుతోన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది. సాక్ష్యాలున్నాయా? తాజాగా కన్నాట్ పోలీసులు కంప్లైంట్లో వారు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తమపై చేతులు వేసినట్టుగా కానీ, తమను ముట్టుకుంటున్నట్టుగా కానీ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ సందేశాలు ఏమైనా ఉంటే తమకివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతకాలు చేసిన నోటీసులను పంపించారు. ఇది కూడా చదవండి: ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్ -
కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. ఐదు డిమాండ్లు ఇవే..!
ఢిల్లీ:రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఐదు డిమాండ్లను కోరినట్లు సమాచారం. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించలేదు. దీంతో రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు అర్థరాత్రి ట్వీట్ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు సమావేశమవడం ఇది రెండోసారి. రెజ్లర్ల ఐదు డిమాండ్లు ఇవే.. 1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి. 2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు. 3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. 4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలి. 5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి. ఇదీ చదవండి:రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి.. -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్‌తోపాటు వినోద్ తోమర్‌పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
Wrestlers Protest: ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు సంబంధించి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు. ‘మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల విషయంలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పినట్లుగా బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. దాంతో కాస్త గందరగోళం నెలకొంది. దాంతో పోలీసులు ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ‘ఆ వార్తలు పూర్తిగా తప్పు. చాలా సున్నితమైన ఈ కేసు విషయంలో అంతే జాగ్రత్తగా విచారణ జరుపుతున్నాం. తాజా పరిస్థితిపై కోర్టుకు సమాచారం ఇస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కాబట్టి నివేదిక కోర్టుకు సమర్పించక ముందు బహిరంగంగా వెల్లడి చేయడం సరైంది కాదు’ అని పోలీసులు స్పష్టం చేశారు. తాజా పరిణామాల్లో దేశంలోని వేర్వేరు రాజకీయ పార్టీలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ స్వయంగా ప్లకార్డ్ పట్టి ర్యాలీలో పాల్గొనగా... బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బేటీ బచావా, బేటీ పడావో మాత్రమే కాదు...ఇకపై బీజేపీ నాయకుల నుంచి ఆడబిడ్డలను కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ‘బేటీ బీజేపీ కే నేతావోంసే బచావో’ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చింది. మరోవైపు మంగళవారం హరిద్వార్‌లో గంగలో పతకాలు వేయాలని సంకల్పించిన ఆ తర్వాత మనసు మార్చుకున్న రెజ్లర్లు స్వస్థలం హరియాణా చేరుకోగా, సాక్షి మలిక్ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. తీవ్ర బాధలో ఉండటంతో పాటు మౌనంగా ఉండాలని ఒట్టేసుకోవడం వల్లే మంగళవారం వారు ఎవరితో మాట్లాడలేదని సన్నిహితులు వెల్లడించారు. తీవ్ర చర్యలకు పాల్పడవద్దు: ఠాకూర్ క్రీడల గొప్పతనాన్ని తగ్గించే ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లకు సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టమని ఆయన కోరారు. మరోవైపు ఆదివారం భారత రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలిచివేసే విధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా’ కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని బ్రిజ్‌భూషణ్ సింగ్ మరోసారి చెప్పారు. ‘వారు నాపై ఆరోణలు చేసి నాలుగు నెలలైంది. ఒక్కదానినీ రుజువు చేయలేకపోయారు. నాకు ఉరిశిక్ష విధించాలని వారు కోరారు. గంగలో పతకాలు వేయడం ద్వారా నన్ను శిక్షించలేరు. సాక్ష్యాలుంటే కోర్టుకు ఇచ్చి నాకు ఉరిశిక్ష వేయించండి. నా బిడ్డల్లాంటివారైన రెజ్లర్లపై నాకు ఇప్పటికీ కోపం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేసిన మైనర్ రెజ్లర్ వివరాలు బహిర్గతం చేసిన ఆమె బంధువు ఒకరిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ పోలీసులకు సూచించింది. -
పతకాలు ‘గంగ’పాలు కాలేదు!
హరిద్వార్: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్‌లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్‌షి ప్లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు. రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
కొత్త పార్లమెంట్ భవనం వద్ద రెజ్లర్లు నిరసనకు ప్లాన్..కానీ అనూహ్యంగా..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్టే చేయాల్సిందే అంటూ జంతర్‌మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగుతున్నందున్న ఒలింపియన్లు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్లతో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్లంతా అక్కడే నిరసనలు చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరసనను ఆపించేశారు. ఈ నేపథ్యంలో కొందరు రెజ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్వహిస్తున్న మహిళా మహా పంచాయత్ కోసం వేలాదిగా భద్రతా సిబ్బంది మోహరించారు. అదీగాక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కోసం అదనపు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వెంబడి మెహరింపు తోపాటు బహుళ బారికేడ్లు, కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసేలా డిల్లీ మెట్రోలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ భవన్ స్టేషన్లలోని అన్ని ప్రవేశ మార్గాలను అదికారులు మూసేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar. Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl — ANI (@ANI) May 28, 2023 ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ..వారంతా కొత్త భవనం సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని పట్టుబట్టారు. ఐతే తాము అథ్లెట్లను గౌరవిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించే పనులకు అనుమతివ్వం. అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రానివ్వం అని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు తరలివస్తారని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికైత్ ప్రకటించారు. ఈ రైతులు వివిధ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో భద్రత బలగాలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిఘా ఉంచడమే గాక తనిఖీలు నిర్వహించకుండా ఎవ్వరినీ అనుమతించకుండా గట్టి పహారా నిర్వహించారు. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను 21లోగా అరెస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు. ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు. -
రెజ్లర్లకు అండగా రైతు సంఘాలు.. భారీగా పోలీసులు మోహరింపు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత పది రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అనూహ్యంగా రైతు సంఘాల మద్దతు లభించింది. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతుగా పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో ఆదివారం దేశ రాజధానిలో వేలాదిమంది రైతులు ఆ రెజ్లర్ల నిరసనకు సంఘీభాం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న రైతుల బృందాన్ని టిక్రి సరిహద్దుల వద్దే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించడమే గాక భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేగాదు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు, పెట్రోలింగ్‌ను పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా, పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా భారీగా బలగాలు మోహరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా భారత రెజ్లర్లు తమకు న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేదే లేదని తెగేసి చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా తొలగించి కటకటాల వెనక్కినెట్టే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి భారీగా రైతు సంఘాల నుంచి ఊహించని రీతీలో మద్దతు లభించింది. కాగా, వారంతా కేంద్రం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాలు కావడం గమనార్హం. VIDEO | A group of farmers trying to enter Delhi to join wrestlers' protest at Jantar Mantar stopped by police at Tikri Border. pic.twitter.com/3L8WyKWgQu — Press Trust of India (@PTI_News) May 7, 2023 (చదవండి: పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..అర్థాంతరంగా పెళ్లిని ఆపేసిన వరుడు) -
రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్ర బిందువైంది. రెజ్లర్లు, వారికి మద్దతుగా వచ్చిన ఆప్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దీక్షా శిబిరం వద్ద వర్షాలతో రెజ్లర్లు వినియోగిస్తున్న పరుపులు తడిసి ముద్దయ్యాయి. వారికి సాయపడేందుకు కొన్ని చెక్క మంచాలను ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తన కార్యకర్తలతో తెప్పించారు. వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు అనుమతించేది లేదని, జంతర్‌మంతర్‌ను శాశ్వత దీక్షాశిబిరంగా మార్చేందుకు అనుమతులు లేవని అక్కడే మొహరించిన పోలీసులు తెగేసి చెప్పారు. అయినా సరే కొన్ని మంచాలను రెజ్లర్లకు కార్యకర్తలు ఇవ్వడం, వాటిని రెజ్లర్లు శిబిరంలోకి తీసుకెళ్తుండటంతో పోలీసులు, ఆప్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తమకు సాయపడేందుకు వచ్చిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రెజ్లర్లు వారితో వాదనకు దిగారు. దీంతో రెజ్లర్లు, కార్యకర్తలను నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలప్రయోగం చేశారు. ఇరువర్గాల వాదనలు చివరకు తోపులాటలు, ఘర్షణకు దారితీశాయి. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్‌సహా పలువురు రెజ్లర్లకు గాయాలయ్యాయి. వినేశ్ ఫొగాట్ కంటతడి నన్ను తిట్టారు. నేలకు పడేశారు. పురుష పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారు. ఒక్క మహిళా పోలీసు అయినా ఉన్నారా ఇక్కడ?. మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారా? చంపేయండి. ఇలాంటి రోజు కోసమేనా మేం దేశం కోసం పతకాలు సాధించింది? అంటూ ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ కన్నీరు పెట్టుకున్నారు. తాము సాధించిన పతకాలు, కేంద్రం ఇచ్చిన అవార్డులు, పద్మశ్రీ అన్నీ వెనక్కి ఇస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. విపక్షాల తీవ్ర ఆగ్రహం రెజ్లర్లపై పోలీసుల దాడి దారుణమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘ఆటగాళ్లపై పోలీసుల దాడి సిగ్గు చేటు. సమాఖ్య చీఫ్ శరణ్‌ను ఆ పదవి నుంచి మోదీ తొలగించాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘కోర్టు పర్యవేక్షణలో ఘటనపై దర్యాప్తు జరగాలి. కనీసం ఘటనాస్థలికి వెళ్లి మోదీ రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర నేతలూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. -
'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్
జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల ప్రవర్తన దిగ్బ్రాంతి చెందేలా ఉంది. లైంగిక వేధింపులతో మానసికంగా నలిగిపోయిన వారు నేరస్తులు కాదని, ఛాంపియన్ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇది చాలా అమానుషం, విచారకరం, సిగ్గుచేటు అంటూ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులు (బీజేపీ) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకపై బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఢిల్లీ పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తిన సంగతి తెలిసిందే. చంపాలనుకుంటే చంపేయండి..! ఈ నేపథ్యంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఉద్వేగభరితంగా మీడియా ముందు.. 'మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి' అంటూ మాట్లాడారు. ఈ రోజులు చూసేందుకేనా మేము పతకాలు గెలిచింది అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి మగవాడికి ఆడవాళ్లను తిట్టే హక్కు ఉందా!.. అని నిలదీశారు. తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపేయండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి చేరుకున్న డీసీడబ్ల్యూ చీఫ్: కాగా, ఈ మేరకు జంతర్‌మంతర్ వద్దకు వచ్చిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తనను నిరసన ప్రదేశంలోకి అనుమతించడం లేదని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి, మాలిక్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మాకు చెప్పారని అన్నారు. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయినా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ఢిల్లీ పోలీసులపై పైర్ అయ్యారు స్వాతి మలివాల్ . (చదవండి: శరద్ పవార్ ఆత్మకథ పుస్తకంలో ఆసక్తికర అంశం..మోదీకి అప్పుడే స్పష్టం చేశా!) -
మోదీ జీ "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!"
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే సుప్రీం కోర్టు జోక్యంతోనే బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ భారత రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ..న్యాయం మీ అంగీకారం కోసం ఎదురుచూస్తోందని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ.. శరణ్ సింగ్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ కోరితే తాను రాజీనమా చేస్తానని శరణ్ సింగ్ చెప్పారు. కాబట్టి మోదీ ఇప్పుడైన ఆ ఎంపీని రాజీనామా చేయాలని ఆదేశించండి అని ప్రియాంక్ గాంధీ అన్నారు. మీరు అందుకు అంగీకారం తెలిపండి అని ప్రియాంక్ గాంధీ మోదీని కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ జంతర్‌మంతర్ నుంచి నిరసనలు చేసిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు న్యాయం పొందలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కావాలంటే కోర్టు తలుపులు తట్టాలని అన్నారు. 90% మంది అథ్లెట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని విశ్వసిస్తున్నారు. హర్యానాలోని కొన్ని కుటుంబాలకు చెందినవారు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా ఒకే ప్రాంతానికి(హర్యానాకి) చెందని వారని అన్నారు. హర్యానా నియోజకవర్గం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా దీనికి కారణమని ఆయనే వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో ముందుకు వస్తున్నారంటూ విమర్శించారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తర్వాత పదవికి రాజీనామా, జైలుకి పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తాను పదవికి రాజీనామ చేస్తే రెజ్లర్లు చేసిన ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందన్నారు. అందువల్ల తానను చేయనని కరాకండీగా చెప్పారు. అయినా తాను ప్రజల వల్ల తన నియోజకవర్గానికి ఎంపీ అయ్యానని, వినేష్ ఫోగట్ వల్లకాదని అన్నారు. కేవలం ఆ ఒక్క రాష్టానికి చెందిన కొన్ని కుటుంబాల అమ్మాయిలు మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారని నిలదీశారు. మిగతా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్యానాకు చెందిన 90 శాతం మంది ఆటగాళ్లు తనతోనే ఉన్నారని శరణ్ సింగ్ చెప్పారు. కాగా, రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత శరణ్‌సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం) -
Wrestlers Protest: మోదీ జీ.. మా ‘మన్‌కీ బాత్’ వినండి..!
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో నిరసన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లు ఇప్పుడు ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాము విజయం సాధించినప్పుడు ఫోటోలు దిగి ఉత్సాహపరచిన ప్రధాని తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ (మనసులో మాట)ను ఉద్దేశించి రెజ్లర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడుతారు. చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున.. అందరి మనసులో మాటను వింటారు. కానీ మా ‘మన్‌కీ బాత్’ను ఆయన వినలేరా. మేం విజయాలు సాధించినప్పుడు ఇంటికి పిలిచి గౌరవించడంతో పాటు మమ్మల్ని తన బిడ్డలంటూ చెప్పుకున్నారు. ఈ రోజు మా బాధ వినాలని ఆయనను అభ్యర్థిస్తున్నాం’ అని 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ వ్యాఖ్యానించింది. నాలుగు రోజులుగా తాము రోడ్లపై పడుకుంటున్నా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనీసం పట్టించుకోవడం లేదని సాక్షి విమర్శించింది. ‘బహుశా నిజం ఏమిటో ప్రధానికి తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తిగతంగా కలిసి సమస్యను చెప్పాలని కోరుకుంటున్నాం. అయితే ఆయనను కలిసే మార్గం ఏమిటో మాకు తెలియడం లేదు’ అని వినేశ్ ఫొగాట్ చెప్పింది. నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లు బుధవారం రోడ్డు పైనే తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. కోచ్ సుజీత్ మాన్ నేతృత్వంలో అక్కడే సాధన చేసిన వారు... తమకు మరో గత్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సోషల్ మీడియా ద్వారా రెజ్లర్లకు తన మద్దతు ప్రకటించాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో కష్టపడే ఆటగాళ్లు ఇలా రోడ్లపై రావాల్సి రావడం చాలా బాధగా ఉందని అతను అన్నాడు. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం -
న్యాయం కావాలి!
చట్టం ముందు అందరూ సమానులే అంటాం. కానీ, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువ సమానమని పదేపదే రుజువవుతుంటే ఏమనాలి? వ్యవస్థపై ఇక నమ్మకమేం మిగుల్తుంది? లైంగిక వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డాడంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడూ, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు నెలలుగా మొత్తుకుంటున్నా క్రీడాశాఖకూ, పాలకులకూ పట్టనితనం చూస్తే ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి. అంతర్జాతీయ పత కాలు తెచ్చిన ఆడపిల్లలు తమ గోడు వెళ్ళబోసుకుంటూ, బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలంటూ జనవరిలో వీధికెక్కిన దృశ్యాలు దేశమంతా చూసినవే. మూడు నెలలు గడిచినా అతీగతీ లేక చివరకు మళ్ళీ ఆ అగ్రశ్రేణి మహిళా మల్లయోధులు మరోసారి నిరసనకు దిగాల్సి రావడం శోచనీయం. తాజాగా ఏప్రిల్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసినా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాని పరిస్థితుల్లో అసహాయులైన అమ్మాయిలు ఆఖరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాల్సి రావడం మనం ఏ కాలంలో, ఎలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామో నగ్నంగా నిరూపిస్తున్నాయి. అన్నిటికీ అత్యుత్సాహంతో కేసులు కట్టే పోలీసులు తాజా ఫిర్యాదు తర్వాత 5 రోజులైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఆదివారం నుంచి 4 రోజులుగా జంతర్ మంతర్ వద్ద రెండోసారి నిరసన దీక్ష కొనసాగిస్తున్నా బాధిత మహిళా రెజ్లర్లను సంబంధిత అధికారులెవరూ పలకరించనైనా లేదు. మహిళా సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకొనే జాతీయ మహిళా కమిషన్ సైతం అయిపూ అజా లేదు. ఇక దేశంలో సగటు స్త్రీకి మనం ఏం భరోసా కల్పిస్తున్నట్టు? అసలైతే మహిళలెవరైనా లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే – తక్షణమే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం. ఢిల్లీ పోలీసులు మాత్రం ఏడుగురు మహిళలు లిఖిత పూర్వక ఫిర్యాదులిచ్చినా ప్రాథమిక విచారణ చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణం. ‘పోక్సో’ చట్టం సైతం వర్తించే మైనర్ బాలికపై వేధింపుల తీవ్రాతితీవ్ర అంశమున్నా, సోకాల్డ్ విచారణేదో ఇన్నిరోజులుగా పూర్తి కాకపోవడం మరీ విడ్డూరం. పైపెచ్చు, లైంగిక బాధితులమంటూ ఫిర్యాదు చేసిన స్త్రీల పేర్లను పోలీసులే లీకు చేయడం ఘోరం, నేరం. నిందితుడు అధికార పార్టీకీ, అందునా సీట్లు, ఓట్లలో కీలక యూపీకీ చెందిన వ్యక్తి గనక చట్టాలన్నీ చుట్టాలయ్యాయంటే తప్పు పట్టగలమా? జనవరిలో బాధితులు నిరసన దీక్షకు దిగినప్పుడే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. వినేశ్ ఫోగట్, సాక్షీ మలిక్ లాంటి తోటి క్రీడాకారిణులకు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియా లాంటి పురుషులూ తోడుగా నిలిచి, విషయం మీడియాలో పెద్దదయ్యే సరికి తప్పక క్రీడాశాఖ రంగంలోకి దిగింది. నిందితుడైన బీజేపీ ఎంపీని తాత్కాలికంగా సమాఖ్యకు దూరం జరిపింది. విచారణకు కంటితుడుపు కమిటీ వేసింది. బాక్సర్ మేరీ కోమ్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి. ఇప్పటికి 3 నెలలైనా ఆ కమిటీ, దాని నివేదిక అతీగతీ దేవరహస్యమే. నివేదికను బయటపెట్టాలనీ, నిందితుణ్ణి అరెస్ట్ చేయాలనీ కోరుతూ రెజ్లర్లు ఇప్పుడు ఢిల్లీ నడిబొడ్డున, నేపథ్యంలో హనుమాన్ చాలీసా వినిపిస్తూ, దీక్షకు కూర్చున్నారు. రోడ్ల మీదే రెజ్లింగ్ సాధన చేస్తున్నారు. పతకాలు తెచ్చినప్పుడల్లా వారితో ఫోటోలకు పోజులిచ్చి, న్యాయం కోసం రోడ్డెక్కినప్పుడు మౌనం పాటిస్తున్న కమలనాథులకు మాత్రం కనికరం కలగట్లేదు. భారత ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన మరో కమిటీ వేస్తున్నట్టు క్రీడా శాఖ ప్రకటించింది కానీ, మరోసారి కమిటీల పేర మోసపోవడానికి రెజ్లర్లు సిద్ధంగా లేరు. బాధిత మహిళలతో పాటు పౌర సమాజం డిమాండ్ చేస్తున్నట్టు... ఆరుసార్లు ఎంపీ, ఒకప్పుడు తీవ్రవాద కేసులో నిందితుడూ, స్థానిక డాన్‌గా అపరిమిత పలుకుబడి గల వ్యక్తి అయిన బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ దాఖలుకు నిరాకరించిన పోలీసులపై కేసు నమోదు చేయాలి. పతకాలు పండిస్తున్న భారత రెజ్లింగ్ ఇప్పటికే ఈ వివాదాలతో కుదేలైంది. నిరసనగా గత నెల అంతర్జాతీయ శిక్షణ శిబి రాల నుంచి పునియా, ఫోగట్ పక్కకు తప్పుకున్నారు. వచ్చే ఎటి ప్యారిస్ ఒలింపిక్స్‌లో విజయా లకూ ఇది గండి కొట్టే ప్రమాదం ఉంది. సుప్రీంలో కేసు ఈ 28న తదుపరి విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పరువు పోయిన క్రీడాశాఖ కళ్ళకూ, చెవులకూ గంతలు తొలగించుకోవాలి. నిజానికి, మన క్రీడా వ్యవస్థ అనేక లోపాల పుట్ట. క్రీడాసంస్థలు కొందరి జేబుసంస్థలుగా కొనసాగడం, రాజకీయ ప్రాబల్యానికి అడ్డా కావడం దశాబ్దాలుగా ఉన్నదే. కోరింది ఇస్తేనే ఆటలో అవకాశాలొస్తాయనే వాతావరణం కల్పించడం, అర్హుల కన్నా అయినవాళ్ళను అందలం ఎక్కించడం పదే పదే చూస్తున్నదే. అందుకే, అప్రతిష్ఠ మూటగట్టుకున్న రెజ్లింగ్ సమాఖ్య, దాన్ని సొంత జాగీరులా నడుపుతున్న బ్రిజ్భూషణ్ల వ్యవహారం ఆశ్చర్యం కాకపోవచ్చు కానీ, ఇన్ని ఆరోపణల తర్వాతైనా కళ్ళు తెరిచి, చర్యలు తీసుకోవాల్సిన అంశం. కేసు ఇప్పుడు సుప్రీం దాకా వచ్చింది గనక బాధితులకు న్యాయం జరగవచ్చు. కానీ దేశప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులు, అందులోనూ ఆడ పిల్లలు ఆరోపణలు చేస్తుంటే అధికార, పాలనా వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోవడమే దుర్మార్గం. ఇకనైనా స్వపర భేదాలు వదిలి, క్రీడా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళించాలి. బ్రిజ్ భూషణ్ కథ అందుకు నాంది కావాలి. సాధారణ న్యాయం సైతం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేనే సాధ్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే, అది పాలకులకు కాదు... మొత్తం వ్యవస్థకే తలవంపులు. -
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది. లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్‌లు ఉన్నా, ఏడుగురు మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు పోలీసులను సైతం ప్రాసిక్యూట్ చేయాలని సూచించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్‌పై లైంగిక ఆరోపణలు.. రోడ్డెక్కిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ మళ్లీ ధర్నాకు దిగారు. మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ‘జంతర్ మంతర్’ వద్ద చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులపాటు ధర్నాకు దిగారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ జరిపింది. ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు సమర్పించినా దీన్ని బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. -
మన క్రీడాకారిణులకు బాసట ఏది?
బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి భారతీయ మహిళా రెజ్లర్లు... భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నారనీ, నిరంకుశంగా వ్యవ హరిస్తున్నారనేవి వారి ఆరోపణలు. ఈ ఉదంతం భారత క్రీడారంగంలోని మురికిని మరోసారి ఎత్తిచూపింది. క్రీడా సంస్థల నాయకత్వంలో ఉన్న పురుషాధిపత్యం, రాజకీయాలతో వారికున్న అవినాభావ సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య హరియాణా క్రీడా మంత్రి, భారత హాకీ మాజీ క్రీడాకారుడు అయిన సందీప్ సింగ్‌పై మరో ప్రముఖ అథ్లెట్, మహిళా కోచ్ చండీగఢ్‌లో చేసిన ఆరోపణలూ దాదాపూ ఇటువంటివే. క్రీడాకారిణులకు మద్దతు ఇవ్వడమే తమ విధిగా ఉండాల్సిన మన క్రీడాధికారులు వాస్తవానికి తమ రాజకీయ బలాన్ని వారిని వేధించడానికి అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ వేధింపులను ఎదిరించినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కుటుంబపరమైన మద్దతు ఏమాత్రం లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతూ... రక్తం, చెమట, కన్నీళ్లను పణంగా పెడుతున్న మహిళలు వీరు. వీరికి మరో వృత్తిని ఎంచుకునే అవకాశమూ ఉండదు. అవినీతి పరులైన అధికారుల చేతుల్లో వీరు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, క్రీడల్లో మహిళలపై వేధింపునకు సంబంధించి ఇటీవల వెలికివస్తున్న కేసులు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మహిళా రెజ్లర్లు తమ ప్రెస్ కాన్ఫ రెన్సులో ఎత్తి చూపినట్లుగా ఈ ప్రత్యేక సమస్యకు సంబంధించిన నిజమైన రూపం చాలా భారీ స్థాయిలో, అంత్యంత సంక్లిష్టంగా ఉంటోంది. క్రీడాకారిణులు చేస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంతవరకు నెలకొల్పిన సమస్యా పరిష్కార నిబంధనలు ఏమాత్రం తమ ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. పైగా తమను వేధింపులకు గురి చేస్తున్న వారి గురించి బయటపడి ఫిర్యాదు చేయడానికి ఇవి మహిళల్లో ఏమాత్రం విశ్వాసం కలిగించలేదని కూడా స్పష్టమవుతోంది. వందలాది క్రీడాకారిణులు మౌనంగా ఉంటూ అధికారులకు లోబడి ఉండటానికి ప్రధాన కారణం వారు క్రీడల నుంచి బయటపడటానికి మరొక అవకాశం లేకపోవడమేనని చెప్పాలి. శక్తిమంతులైన రాజకీయ నియామకాల ద్వారా పదవుల్లోకి వచ్చి రాజకీయ సంరక్షణలో ఉంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులభం కాదని మహిళా అథ్లెట్లు, వారి కుటుంబాలకు బాగా తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది. మన అంతర్జాతీయ క్రీడాకారిణులలో చాలామంది తమను సపోర్టు చేయడానికి తమ కుటుంబాలు తమ వనరులను మొత్తంగా వెచ్చిస్తున్నారని చెబుతూ వచ్చారు. అధికారిక ప్రవేశ ద్వారాలను వారి ముఖాలమీదే మూసివేసిన సమయంలో, జంతర్ మంతర్ వద్ద మన మహిళా రెజ్లర్ల ప్రెస్ కాన్ఫరెన్స్ని చూస్తున్నప్పుడు... కీలకమైన ప్రాక్టీస్ సీజన్లో ఇలా బయటికి వచ్చారంటే వారు ఎంత నిస్పృహకు గురై ఉంటారో కదా అని చూసేవారికి బాధ, ఆగ్రహం కలుగుతాయి. హరియాణాలో సైతం ఆ జూనియర్ మహిళా కోచ్ రాష్ట్ర క్రీడా మంత్రికి వ్యతిరేకంగా న్యాయం పొందడానికి ఒకచోటు నుంచి మరొక చోటుకి పరుగులు తీశారు. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం నిందితుడి పక్షానే నిలిచింది. ఆ రకంగా మహిళా క్రీడా కమ్యూ నిటీ మొత్తానికి అది ప్రతికూల సందేశాన్ని అందించింది. ఆరోపణలకు గురైనవారు, వారి రాజకీయ ప్రభుత్వ యంత్రాంగానికి చెందినవారు బాధితురాలినే అవమానిస్తున్నారు. పైగా లైంగిక వేధింపు కేసుల వల్ల ఆపాదించబడే సామాజిక కళంకాన్ని భరిస్తూ... తమ కెరీర్‌నే నిలిపివేయగలిగిన విధ్వంసకరమైన అధికారాన్ని చలాయిస్తున్న మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒంటరి బాధితురాలు ఎదురించి నిలబడటం చాలా కష్టం కూడా. 1990లలో నాటి టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు, హరియాణా పోలీస్ ఐజీ ఎస్పీఎస్ రాథోడ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన టెన్నిస్ క్రీడాకారిణి రుచికా గిర్హోత్రాకు చెందిన ముఖ్యమైన ఉదంతాన్ని మననం చేసు కోవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగానూ, అనేక కుల ప్రాతిపదిక సంస్థలు ఆనాడు నిందితుడి పక్షానే నిలబడ్డాయి. ఆరోపణకు గురైన రాథోడ్ నిజానికి ప్రమోషన్ పొంది హరియాణా డీజీపీ అయ్యారు. తీవ్రమైన శత్రుపూరిత వాతావరణంలో రుచిక తన జీవి తాన్నే ముగించుకున్నారు. న్యాయం కోసం కుటుంబం సాగించిన పోరా టంలో ఆమె తండ్రి కూడా మరణించారు. ఆమె సోదరుడు జనం కంట పడకుండా ఎంతో దూరంలో జీవితం గడపాల్సి వచ్చింది. ఆమె సన్ని హిత మిత్రుడి కుటుంబం, ఇతర మహిళా సంస్థలు ఎంతో శ్రమ కోర్చి ఈ కేసును ప్రతి స్థాయిలోనూ ముందుకు తీసుకెళుతూ 19 ఏళ్ల పాటు పోరాడారు. అయినప్పటికీ నిందితుడైన రాథోడ్ ఆరునెలల జైలు శిక్షను, వెయ్యి రూపాయలు జరిమానాను మాత్రమే పొందాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నాటి నుంచి నేటివరకు మన క్రీడాకారిణుల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిస్పృహతో కూడిన ఆలోచనల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వినేశ్ ఫోగాట్ దీన వదనం చూసి దేశ ప్రజలు, ముఖ్యంగా క్రీడా సమాజం దిగ్భ్రాంతి చెంది ఉండాలి. ఈ రెండు కేసు ల్లోనూ ప్రసుతం అధికారంలో ఉన్న బీజేపీని, క్రీడాధికారులను తప్పక కఠిన ప్రశ్నలు వేసితీరాలి. క్రీడాకారిణులు పతకాలు తీసుక వస్తున్నప్పుడు వారు సాధించిన ఉజ్వల కీర్తిని తమ సొంతం చేసుకుని మురిసిపోవడంలో రాజకీయ నేతలు, క్రీడా సమాఖ్య అధిపతులు ముందు ఉంటున్నారు. కానీ మరోవైపున తమకు జరుగుతున్న అన్యా యానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి క్రీడాకారిణులు ప్రయత్నించిన ప్రతిసారీ ఏమాత్రం సిగ్గూ శరమూ లేకుండా నిందితులనే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. క్రీడాకారిణులను వేధించిన కేసుల్లో అవసరమైన సమర్థ న్యాయ ప్రక్రియను తక్షణం ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయు ల్లోని క్రీడా విభాగాలు, సమాఖ్యలు, ప్రభుత్వ క్రీడా విభాగాలు అన్నింటిలో లైంగిక వేధింపులకు వ్యతిరేక కమిటీలను తప్పక ఏర్పర్చాలి. ఈ ప్రక్రియను అనుసరించనప్పుడు, సంబంధిత అధికారులనే జవాబుదారీగా చేయాలి. మైదానంలో అత్యున్నతంగా పోరాడుతూనే తమకు న్యాయం జరగాలని గట్టిగా పోరాడుతున్న మన క్రీడాకారిణులకు సంఘీ భావం పలకడం ఈ దేశంలో క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత. - జగ్మతి సాంగ్వాన్ వాలీబాల్ క్రీడాకారిణి, ‘ఐద్వా’ జాతీయ ఉపాధ్యక్షురాలు (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పట్టు విడువని రెజ్లర్లు.. చర్యలు చేపట్టిన కేంద్రం.. నిరసన విరమణ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను తొలగించడం సహా డిమాండ్లన్నీ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజర్లు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ ధర్నాను విరమించారు. ‘‘రెజ్లర్ల ఆరోపణలపై ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. ‘దంగల్’లో దిగితే ప్రత్యర్థుల పట్టుపట్టే రెజ్లర్లు అదే జోరుతో ధర్నాతో హడలెత్తించి.. డిమాండ్లు సాధించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో ఏళ్ల తరబడి తిష్టవేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను గద్దె దించేదాకా ధర్నా విరమించబోమని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, రవి దహియా, బజరంగ్ పూనియా, దీపక్ పూనియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పున్నా వెరువమని, అన్నింటికి సిద్ధపడే న్యాయ పోరాటానికి దిగామని చెప్పారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని వారంతా పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలన్న రెజ్లర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వ్యవహరించారు. అత్యవసర భేటీ నిర్వహించి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని ఉష హామీ ఇచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ... లైంగిక ఆరోపణల వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న స్టార్ రెజ్లర్ల డిమాండ్‌పై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) స్పందించింది. అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష నేతృత్వంలోని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు ఈసీ సభ్యులైన మాజీ షూటర్ అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్, సంయుక్త కార్యదర్శి కల్యాణ్ చౌబే, ప్రత్యేక ఆహ్వానితులుగా శివ కేశవన్ ఈ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు కావడంతో వీటిపై నిగ్గు తేల్చేందుకు దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఏజీఎం తర్వాతే బ్రిజ్‌భూషణ్ స్పందన గోండా (ఉత్తర ప్రదేశ్): తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూ ఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ త్వరలోనే ఈ వ్యవహారంపై స్పందిస్తారని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతీక్ భూషణ్ సింగ్ శుక్రవారం మీడియాతో అన్నారు. ‘ఈ నెల 22న డబ్ల్యూఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇది ముగియగానే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు’ అని అన్నారు. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?!
ఢిల్లీ: అథ్లెట్లకు షాక్ ఇచ్చేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ను తొలగించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. వాళ్లపై పోలీస్ ఫిర్యాదుకు డబ్ల్యూఎఫ్ఐ సిద్ధమైంది. అయితే అందుకు ఈ నిరసనలతో సంబంధం లేకపోవడం గమనార్హం!. ఒక ఈవెంట్లో రెజ్లర్లను పాల్గొనకుండా ఆపేందుకు.. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన రెజ్లర్లకు.. ఆ ఈవెంట్ రద్దు అయ్యిందని నిరసనలో పాల్గొంటున్న కొందరు అథ్లెట్లు చెప్పి మోసం చేశారని, తద్వారా వాళ్లను పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించారని రెజ్లింగ్ ఫెడరేషన్ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్లపై కేసు నమోదు చేయాలని భావిస్తోందట.! రెజ్లర్ల మీటూ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ.. నాలుగు డిమాండ్లతో ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్‌కు రెజ్లర్లు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలో.. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో భేటీ సాగింది. మరోవైపు ఆరోపణలను ఖండించిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం ఉత్కంఠకు తెర తీసింది. అయితే.. మీడియా ముందుకు రావొద్దని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఫోన్ ద్వారా సూచించినట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. ఇంకోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు మరోసారి మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
జూనియర్ రెజ్లర్లపై లైంగిక వేధింపులు
-
‘సాయ్’ స్పందన సరిగా లేదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు. రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు. ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం. -
ఇది న్యాయం కోసం దంగల్
ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల లాంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాలు సాధించి వార్తల్లో వ్యక్తులుగా నిలవడం ఆ కుస్తీ ప్రవీణులకు అలవాటు. కానీ, ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో వారు, వారి ఆట వార్తల్లోకి ఎక్కాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య పైన, దాని అధ్యక్షుడైన పాలక బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వికృత వ్యవహారశైలి పైన ధ్వజమెత్తుతూ ఢిల్లీ నడిబొడ్డున బుధవారం నుంచి రెండు రోజులుగా 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు నిరసనకు దిగేలా చేశాయి. అంతా కలిపి 200 మందికి పైగా అథ్లెట్లు నిరసనకు దిగడం, అనేక సంగతులు బయటపెట్టడం భారత క్రీడా చరిత్రలో మునుపెన్నడూ చూడని దృశ్యం. ముక్కున వేలేసుకొనేలా సందర్భం. కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మూడుసార్లు స్వర్ణాలు సాధించిన వినేశ్ ఫోగాట్ కన్నీరు పెట్టుకుంటూ మహిళా అథ్లెట్లు ఎదుర్కొంటున్న దారుణాల్ని వివరిస్తుంటే గుండె మండిపోతుంది. అన్షూ మలిక్ లాంటి వారు బయటపెట్టిన సంగతులు ఆవేదన రేపుతాయి. సాక్షీ మలిక్, బజ్రంగ్ పునియా – ఇలా స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ జరుగుతున్న అన్యాయాలను కెమెరాల సాక్షిగా ఏకరవు పెట్టాల్సి వచ్చింది. మహిళా రెజ్లర్లుండే హోటల్లోనే బస చేయడం, వారు గది దాటి స్వేచ్ఛగా బయటకు రావడానికైనా వీల్లేకుండా తన గది తలుపులు సదా తీసి ఉంచి, తన రోజువారీ పనులు చేసుకోవడం– ఇదీ సమాఖ్య అధ్యక్షుడి తీరు. ఇది నియమానుసారమే కాదు నైతికంగానూ సరికాదు. బ్రిజ్ గత చరిత్రా గొప్పదేమీ కాదు. గతంలో ఆయన నేరసామ్రాజ్య నేత దావూద్ ఇబ్రహీమ్ బృందానికి సాయపడ్డారట. ఆ కేసులో తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టయ్యారు. దౌర్జన్యానికి మారుపేరై, ఇప్పటికి 6 సార్లు ఎంపీగా గెలిచారు. 2011 నుంచి పుష్కర కాలానికి పైగా కుర్చీలో ఉంటూ, కుస్తీ సమాఖ్యను సొంత జాగీరుగా మార్చుకొన్నారు. ఆటను అడ్డంపెట్టుకొని అవి నీతి, అక్రమాలు, వేదికపై ఆటగాళ్ళను చెంపదెబ్బ కొట్టిన దౌర్జన్యాలు, అథ్లెట్లతో అనుచితవర్తనలు... ఇలా ఈ రాజకీయవాది ఘనతల చిట్టా సుదీర్ఘమైనది. సొంత ఊరు లక్నోలో, స్వగృహానికి దగ్గర లోనే సదా మహిళా అథ్లెట్ల శిబిరం పెట్టి, తానూ హాజరయ్యే మనోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీడావ్యవస్థలో ఇలాంటి దుష్టసంస్కృతి చిరకాలంగా ఉన్నదే. ఇటీవల ఏడు నెలల క్రితం కూడా అగ్రశ్రేణి భారత సైక్లింగ్ క్రీడాకారిణి ఒకరు తమ నేషనల్ టీమ్ కోచ్ నుంచి ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నారు. స్లొవేనియాలో క్రీడా శిక్షణా శిబిరంలో కోచ్ అనుచిత ప్రవర్తనపై ఆమె ఏకంగా ‘భారత క్రీడా ప్రాధికార సంస్థ’ (శాయ్)కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇటీవలే హర్యానాలో ఓ మహిళా కోచ్ స్వయానా ఆ రాష్ట్ర క్రీడా మంత్రి లైంగిక అత్యాచార పర్వాన్ని బట్టబయలు చేయడం గమనార్హం. ఇంకెన్నో వెలుగులోకి రాని ఫిర్యాదులున్నాయి. ఓ సినీ నటుడి అనుచిత ప్రవర్తనను ఒక హిందీ నటి బయటపెట్టే సరికి, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమస్థాయికి చేరిన సంగతి 2018లో చూశాం. ఇప్పుడు కుస్తీ సమాఖ్య సారథి సహా కోచ్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణ ఆట వెనుక దాగిన చీకటి కోణాన్ని బయటపెట్టింది. నాలుగు పర్యాయాలు ఒలింపిక్ పతకాలు తెచ్చిపెట్టిన కుస్తీలోనే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే, ఇతర క్రీడల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. 72 గంటల్లో సమాధానం చెప్పాలంటూ కుస్తీ సమాఖ్యకు క్రీడాశాఖ తాఖీదు ఇచ్చింది. కానీ, బ్రిజ్‌ను తొలగించాలి, అథ్లెట్లతో మర్యాదగా ప్రవర్తించాలి, సమాఖ్యను సమూలంగా మార్చాలి లాంటి ఆటగాళ్ళ కనీస డిమాండ్లు తీర్చలేనివేమీ కావు. ఆ మాటకొస్తే సమాఖ్యలో ఇష్టారాజ్యంగా నియమాలు మారుస్తున్నారనీ, తమపై అనవసరమైన అధిక నిఘా ఉంచుతున్నారనీ అథ్లెట్లు చేస్తున్న ఆరోపణలకు బ్రిజ్ బృందం జవాబివ్వాల్సి ఉంది. కానీ, వేధింపుల బాధితులు బాహాటంగా చెప్పాలనీ, సాక్ష్యాలతో నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమనీ ఆయన అనడం చట్టం ముందూ నిలవని బుకాయింపే. ఇదంతా కాంగ్రెస్ నిర్వాకమనే ఆరోపణ, యూపీ వర్సెస్ హర్యానా వాదన అలాంటివే. ఆరోపణలు హోరెత్తుతున్నా బ్రిజ్ రాజీనామా చేయకపోవడం విడ్డూరం. ఇక స్వయంగా క్రికెట రైన క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోరోజు రాత్రి దాకా నోరెందుకు విప్పలేకపోయారో అర్థం కాదు. ఇన్నేళ్ళుగా కుస్తీ సమాఖ్య సహా అనేక చోట్ల లైంగిక వేధింపుల విచారణ కమిటీలు పెట్టకున్నా ఎలా చూస్తూ కూర్చున్నారో తెలీదు. పాలకులు పతకాల విజేతలతో ఫోన్లో మాట్లాడుతూ, ఫోటోలకు పోజులిస్తే చాలదు. బేటీ బచావో... మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. దేశవ్యాప్తంగా బ్రిజ్ కనుసన్నల్లో సాగుతున్న సమాఖ్య కార్యవర్గాలన్నిటినీ రద్దు చేయాలి. నిపుణులు సారథ్యం వహించాల్సిన క్రీడాసంస్థల్ని ఇకనైనా రాజకీయాలకూ, ఇలాంటి రాజకీయవాదులకూ దూరంగా ఉంచాలి. అథ్లెట్ల నిరసనకు తలొగ్గి, సమాఖ్యలో అక్రమాలను విచారించడానికి క్రీడాశాఖ త్రిసభ్య సంఘం వేసిందట. అయితే, అది చాలదు. వేధింపులతో వ్యవహారం బరి దాటి నేరాల గిరిలోకి చేరింది. దీనిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరపించాల్సిందే, వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే. ధర్మం కోసం, న్యాయం కోసం... కడకు కనీసపాటి గౌరవం కోసం మహిళలు ఇవాళ్టికీ వీధికెక్కాల్సి వస్తోందంటే అది మన దేశానికే అవమానం. అంతర్జాతీయ బరిలో విజేతలైన ఈ వీరాంగనలు ఈ ఆత్మగౌరవ దంగల్లోనూ విజయం సాధించాలి. సమాజంలో పురుషోన్మాద దృక్పథాన్ని మార్చాలి. ఆటల గద్దెపై రాజకీయ గద్దలకు పని లేకుండా క్రీడాసంస్థలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రావాలి. నిజా యతీ ఉంటే... ఎప్పుడో కాదు, ఇప్పుడే ఆ విధానపరమైన మార్పులకు పాలకులు నడుం బిగించాలి. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్ చీఫ్‌ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్ భూషణ్) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని రెజర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR — ANI (@ANI) January 19, 2023 ఇక జంతర్ మంతర్ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్ అయిన బబితా ఫోగట్ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు. వినేశ్ ఫోగట్(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్ క్యాంప్‌లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ సైక్లింగ్ టీం కోచ్‌ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. హాలీవుడ్ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. -
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
UWW Ranking Series: అమన్ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు!
కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ అమన్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్ 10–9తో మెరెయ్ బజర్బయెవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్ 7–0తో రిఫత్ సైబొతలొవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్లో భారత్ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ పంపిన నోటీసుపై ఆమె స్పందిస్తూ ఆదివారం క్షమాపణ కోరారు. కాగా, టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమెపై నిషేధంపై త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది. నిన్న(శనివారం) ఆమె స్పందిస్తూ.. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. -
Wrestler Sushil Kumar: సుశీల్ హాకీ స్టిక్‌తో...
న్యూఢిల్లీ: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను దోషిగా చూపిస్తున్న దృశ్యం ఇదేనా! పోలీసులు సాక్ష్యంగా చెబుతున్న వీడియోలో సుశీల్ చేతిలో స్టిక్ ఉండగా, ఇద్దరు వ్యక్తులు నేలపై పడి దెబ్బలు తింటున్నట్లుగా కనిపిస్తోంది. సుశీల్ పక్కనే ఉన్న కొందరు వారిని చావబాదుతున్నట్లుగా పూర్తి వీడియోలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులనుంచి ఇంకా అధికారికంగా స్పష్టత రాకున్నా... ఢిల్లీ రెజ్లింగ్ వర్గాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మే 4న సాగర్ రాణా అనే యువ రెజ్లర్ చనిపోయిన ఈ ఘటనలో సుశీల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక ఈ హత్య కేసులో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది సుశీల్‌కుమార్‌ను ఇరికించారని, దీనంతటి వెనుక పెద్ద కుట్ర ఉందని అతడి తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదని, కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారని పేర్కొన్నారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఈ దృశ్యాలు బయటపడటం గమనార్హం. చదవండి: భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం -
షాకింగ్ : కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్‌లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్‌గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
రెజ్లర్లు... పట్టు పడుతున్నారు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు రవి దహియా, దీపక్ పూనియా శిక్షణ మొదలుపెట్టారు. ఇక్కడి ఛత్రశాల స్టేడియంలో ఇద్దరు పట్టుపట్టే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ప్రాక్టీస్ వీడియోను కోచ్, రెజ్లింగ్ దిగ్గజం సత్పాల్ సింగ్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైన ముందు జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ శిక్షణ మొదలు పెట్టామని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ (కజకిస్తాన్)లో పతకాలు సాధించడం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన దీపక్ (86 కేజీలు), రవి (57 కేజీలు) ఇన్నాళ్లు కోవిడ్ మహమ్మారి వల్ల శిక్షణకు దూరమయ్యారు. -
‘త్రిస్వర్ణ’ కాంతులు...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా రెజ్లర్లు స్వర్ణ కాంతులీనారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ పోటీల్లో భారత్‌కు ఒకే రోజు మూడు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. దివ్య కాక్రాన్ (68 కేజీలు), సరితా మోర్ (59 కేజీలు), పింకీ (55 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా... నిర్మలా దేవి (50 కేజీలు) రజతం దక్కించుకుంది. కిరణ్ (76 కేజీలు) మాత్రం విఫలమైంది. ఫైనల్స్‌లో సరిత 3–2తో బాట్‌సెట్‌సెగ్ అల్టాంట్‌సెగ్ (మంగోలియా)పై... పింకీ 2–1తో డల్గున్ బొలోర్మా (మంగోలియా)పై గెలిచారు. నిర్మలా దేవి 2–3తో మిహో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగంలో ఐదుగురు రెజ్లర్లు మాత్రమే ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. దివ్య బరిలోకి దిగిన నాలుగు బౌట్లలోనూ గెలిచి విజేతగా అవతరించింది. దివ్య వరుసగా 6–0తో అల్బీనా (కజకిస్తాన్)పై, 11–2తో డెల్‌గెరామా (మంగోలియా)పై, 8–0తో అజోదా (ఉజ్బెకిస్తాన్)పై, 6–4తో నరువా మత్సుయుకి (జపాన్)పై గెలిచి అజేయం గా నిలిచింది. ఇంతకుముందు ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఏకైక స్వర్ణం 2018లో నవ్‌జ్యోత్ కౌర్ (65 కేజీలు) రూపంలో లభించింది. ఈసారి మాత్రం ఒకేరోజు మూడు పసిడి పతకాలు లభించడం విశేషం. -
పాక్ రెజ్లర్లకు వీసాలు మంజూరు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ రెజ్లర్లు భారత్‌కు రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ రెజ్లర్లు అయిన ముహమ్మద్ బిలాల్, అబ్దుల్ రెహ్మాన్, తయబ్ రాజా, జమాన్ అన్వర్‌లకు భారత ప్రభుత్వం శనివారం వీసాలను జారీ చేసినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్‌లో భారత్, భారత్‌లో పాక్ పర్యటించలేదు. గత ఏడాది డేవిస్ కప్‌లో భాగంగా పాకిస్తాన్లో భారత్ పర్యటించాల్సి ఉన్నా... భద్రతా కారణాలతో ఆ పోరు తటస్థ వేదికపై జరిగింది. కోవిడ్–19 వైరస్ కారణంగా చైనా రెజ్లర్లకు ఇంకా వీసాలను జారీ చేయలేదు. వీరి విషయంపై నేడు స్పష్టత రానుంది. -
బజరంగ్ పసిడి పట్టు
జియాన్ (చైనా): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోనూ సత్తా చాటుకున్నాడు. రెండోసారి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలి రోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బజరంగ్ తన ర్యాంక్‌కు న్యాయం చేస్తూ ఆసియా చాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. సయాత్‌బెక్ ఒకాసోవ్ (కజకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 12–7 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఒకదశలో 2–7తో వెనుకబడిన ఈ హరియాణా రెజ్లర్ ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి ఒకాసోవ్ పని పట్టాడు. రెండో విరామంలో పూర్తిగా దూకుడుగా వ్యవహరించిన బజరంగ్ తన ప్రత్యర్థిపై పట్టు సంపాదించి వరుసగా పది పాయింట్లు సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు బజరంగ్ సెమీఫైనల్లో 12–1తో సిరాజుద్దీన్ ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–0తో పీమన్ బియాబాని (ఇరాన్)పై, తొలి రౌండ్లో 10–0తో దివోషాన్ చార్లెస్ ఫెర్నాండో (శ్రీలంక)పై గెలుపొందాడు. సీజన్లో రెండో స్వర్ణం... గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన బజరంగ్... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో డాన్ కొలోవ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం నెగ్గి సీజన్లో శుభారంభం చేసిన అతను ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి పట్టుతో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది రెండో స్వర్ణం. 2017లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. అంతేకాకుండా ఈ టోర్నీ చరిత్రలో రెండు కాంస్యాలు (2018లో 65 కేజీలు; 2013లో 60 కేజీలు), ఒక రజతం (2014లో 61 కేజీలు) కూడా సాధించాడు. మరోవైపు పురుషుల 79 కేజీల విభాగంలో ప్రవీణ్ రాణా రజతం, 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 0–3తో బామన్ మొహమ్మద్ తెమూరి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో సత్యవర్త్ 8–2తో హావోబిన్ గావో (చైనా)పై గెలుపొందాడు. 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవి కుమార్ 3–5తో ప్రపంచ మాజీ చాంపియన్ యూకీ తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 70 కేజీల విభాగంలో రజనీశ్ తొలి రౌండ్లో 0–11తో యూనస్ అలీఅక్బర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. -
టాప్ ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో బజరంగ్ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గాడు. గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ టోర్నీలోనూ స్వర్ణం నెగ్గిన బజరంగ్ ఈనెల 23 నుంచి చైనాలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు. -
డబ్ల్యూడబ్ల్యూఈకి అమితాదరణ
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్‌కు అభిమానుల నుంచి గొప్ప స్పందన లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు ట్రిఫుల్ హెచ్, బటిస్టా బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్, రోమన్ రైన్స్, రొండా రౌసీ, షార్లెట్ ఫ్లెయిర్‌లు తలపడిన ఈ పోటీలను పెద్దసంఖ్యలో అభిమానులు వీక్షించారు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్‌నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ హిందీ, ఇంగ్లిష్, తమిళ్ చానళ్ల ద్వారా భారతదేశంలోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్ మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది. ఇందులో భాగంలో షార్లెట్ పెయిర్‌పై బెకీ లించ్ విజయం సాధించింది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్ టైటిల్ మ్యాచ్‌లో కోపీ కింగ్స్టన్ తీవ్రంగా శ్రమంచాడు. 11 సంవత్సరాల తర్వాత తలపడిన అతను స్ఫూర్తిదాయక విజయాన్ని నమోదు చేశాడు. యూనివర్సల్ చాంపియన్ టైటిల్ కోసం బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్ పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సేథ్ రోలిన్స్ గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్‌లో దిగ్గజాలు బటిస్టా, ట్రిఫుల్ హెచ్ తలపడ్డారు. రిక్ ప్లెయిర్ ఈ మ్యాచ్‌లో సహాయం అందించడంతో బటిస్టాపై ట్రిపుల్ హెచ్ గెలుపొందాడు. క్యాన్సర్‌తో పోరాడి గెలుపొందిన రోమన్‌రైన్స్ తన స్ఫూర్తిదాయక పోరాటంతో డ్య్రూ మెకిన్‌టైర్‌ను ఓడించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లంతా తమ శక్తియుక్తులు ప్రదర్శించడంతో పోరాటాలు వీక్షకులకు కనువిందు చేశాయి. -
‘టాప్స్’ నుంచి రెజ్లర్ రీతూ ఫొగాట్ ఔట్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) యువ రెజ్లర్ రీతూ ఫొగాట్‌ను టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించింది. గతేడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గిన రీతూ ఇటీవల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మారింది. టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు తాను అందుబాటులో ఉండనని... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు చెప్పింది. ఒలింపిక్స్ పతకాల కోసమే టాప్స్లోని క్రీడాకారులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నారు. అలాంటపుడు ఒలింపిక్స్ ఆడని క్రీడాకారులను అందులో ఉంచడం తగదని భావించిన ‘సాయ్’ వెంటనే రీతు ఫొగాట్‌ను తప్పించింది. -
పసిడి పతక పోరుకు రవి కుమార్ అర్హత
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. రొమేనియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రవి 10–8తో తురొబోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే స్వర్ణ పతక పోరులో జపాన్‌కు చెందిన తొషిహిరోతో రవి తలపడతాడు. ఒకవేళ రవి గెలిస్తే ఈ ఈవెంట్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందుతాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
మహిళా రెజ్లర్లకు నిరాశ
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు నిరాశపరిచారు. ఆరు వెయిట్ కేటగిరీల్లో ఒక్కరు కూడా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయారు. సీమ (55 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రజని (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సరిత (59 కేజీలు), రీతూ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సీమ 0–11తో దావాచిమెగ్ (మంగోలియా) చేతిలో... నవ్‌జ్యోత్ 0–4తో కుంబా ఫాంటా సెలెన్ (ఫ్రాన్స్) చేతిలో... రజని 0–2తో మార్టినా క్యునెజ్ (ఆస్ట్రియా) చేతిలో... కిరణ్ 2–12తో ఎల్మీరా సిజ్దికోవా (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. షూవ్‌డోర్ బతర్జావ్ (మంగో లియా) 10–0తో సరితపై, పెట్రా మారిట్ (ఫిన్లాండ్) 6–2తో రీతూపై గెలిచారు. నవ్‌జ్యోత్ కౌర్‌పై గెలిచిన సెలెన్... రీతూపై నెగ్గిన పెట్రా మారిట్ ఫైనల్‌కు చేరుకోవడం తో వీరిద్దరికి బుధవారం కాంస్యం గెలిచేందుకు రెప్‌చేజ్ బౌట్లలో అవకాశం దక్కింది. -
ఎయిర్‌పోర్ట్‌లో స్టార్‌ప్లేయర్ ఎంగేజ్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఏషియన్‌గేమ్స్‌లో సత్తా చాటి భారత్‌కు స్వర్ణం అందించిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఎంగేజ్‌మెంట్‌ను వినూత్నంగా జరుపుకున్నారు. రెజ్లింగ్‌లో పసిడి కొట్టి తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం జకార్త నుంచి భారత్‌కు తిరుగు వచ్చే క్రమంలో ఆమె ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన వివాహ నిశ్చితార్థం జరుపుకున్నారు. తన ప్రియుడు సోమ్‌వీర్ రతితో ఇరుకుటుంబాల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. గ్రీకో-రోమన్ రెజ్లర్ అయిన సోమ్‌వీర్‌తో వినేశ్ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగ్స్ మార్చుకుని కేకు కట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్లో జపాన్ రెజ్లర్ యుకి ఇరీని 6-2తో ఓడించారు. ఇక తన లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సేనని, దీని కోసం అన్ని పోటీల్లో పాల్గొంటున్నాని వినేశ్ ఫొగాట్ స్పష్టం చేశారు.(చదవండి: ‘పసిడి’ కాంత) The best decision I ever made! Glad you pinned me for life 😍❤️ A post shared by Vinesh Phogat (@vineshphogat) on Aug 22, 2018 at 12:12am PDT ప్రియుడు సోమ్‌వీర్‌తో వినేశ్ ఫొగాట్ -
నెవర్ స్టాప్
వినేష్ పోగత్. రెజ్లింగ్‌లో కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ రెండింట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఒకే ఒక్క రెజ్లర్. వినేష్ పెదనాన్న పేరున్న రెజ్లర్ మహవీర్ సింగ్ పోగత్. ఆయన తన నలుగురు కూతుళ్లతో పాటు తన తమ్ముడి కూతుళ్లయిన ప్రియాంక, వినేష్లకూ కలిపి ఇంట్లోనే రెజ్లింగ్‌లో తిరుగులేని ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన కథను ‘దంగల్’ పేరుతో బాలీవుడ్ సినిమాగా కూడా తీసింది. ఇప్పుడు ఈ ఆరుగురూ పెద్ద రెజ్లర్స్. గీతా, బబితా, వినేష్ ఇప్పటికే కామన్వెల్త్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే, వీళ్లలో వినేష్ తాజాగా ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించారు. ఇది ఇండియన్ వుమన్ రెజ్లింగ్ చరిత్రలోనే రికార్డు. ఈ అవార్డు అందుకున్న వినేష్, తన ఆనందాన్ని తెలుపుతూ, ‘ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ అందుకోవడం అద్భుతంగా ఉంది. ఈ మెడల్ ఇండియాది. అన్ని సందర్భాల్లో నా వెన్నంటి ఉన్న వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ సక్సెస్తోనూ ఎప్పుడూ ఆగిపోవద్దు. నెవర్ స్టాప్.’ అంటున్నారు వినేష్! -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్!
భారత పట్టుకు మరోసారి ‘పసిడి’ చిక్కింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. తొలి రోజు పురుషుల రెజ్లింగ్‌లో బజరంగ్ పూనియా బంగారు పతకం నెగ్గగా... ఈసారి మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ భారత సత్తా చాటి పసిడి కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలో 23 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు భారత షూటర్ల గురికి రెండు రజత పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్... పురుషుల ట్రాప్ విభాగంలో లక్షయ్ షెరాన్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మూడు పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ ఐదు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. జకార్తా: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత ‘పసిడి పట్టు’ పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. యావత్ జాతి గర్వపడేలా చేసింది. ఫైనల్లో వినేశ్ 6–2 పాయింట్ల తేడాతో యుకి ఇరీ (జపాన్)ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వినేశ్ తొలి రౌండ్లో 8–2తో సన్ యానన్ (చైనా)పై... క్వార్టర్ ఫైనల్లో 4 నిమిషాల 37 సెకన్లలో 11–0తో కిమ్ హ్యుంగ్జూ (దక్షిణ కొరియా)పై, సెమీఫైనల్లో 75 సెకన్లలో 10–0తో దౌలత్బైక్ యక్షిమురతోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సన్ యానన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ మోకాలి గాయంతో అర్ధంతరంగా వైదొలిగింది. ఆరు నెలల విశ్రాంతి తర్వాత కోలుకున్న ఆమె ఈసారి మాత్రం సన్ యానన్పై పూర్తి ఆధిపత్యం చలాయించింది. గతంలో ఆమెతో పోటీపడ్డ మూడుసార్లూ ఓడిన వినేశ్ నాలుగో ప్రయత్నంలో గెలిచింది. జపాన్ రెజ్లర్ యుకి ఇరీతో జరిగిన ఫైనల్లో వినేశ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రౌండ్లో జపాన్ రెజ్లర్ కోలుకునేందుకు ప్రయత్నించినా వినేశ్ తన పట్టు సడలించకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. సాక్షి మలిక్ చేజేతులా... భారత్‌కే చెందిన సాక్షి మలిక్ (62 కేజీలు), పూజా ధాండ (57 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయారు. ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో సాక్షి 7–9తో ఓడింది. 10 సెకన్ల సమయం ఉందనగా సాక్షి 7–6తో ఆధిక్యంలో ఉంది. అయితే చివరి 10 సెకన్లలో ఆమె రక్షణాత్మకంగా వ్యవహరించడం... టినిబెకోవా దూకుడుగా ఆడి సాక్షి మలిక్‌ను మ్యాట్ బయటకు పంపించి రెండు పాయింట్లు సంపాదించి 8–7తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే రిఫరీ 2 పాయింట్ల నిర్ణయాన్ని సాక్షి సమీక్ష కోరడం... రిఫరీ నిర్ణయం సరైనదేనని తేలడంతో ఆమె అదనంగా మరో పాయింట్ కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. కాంస్య పతక బౌట్లలో సాక్షి 2–12తో హాంగ్ జంగ్వన్ (ఉత్తర కొరియా) చేతిలో... పూజా 1–6తో సాకగామి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మరో భారత మహిళా రెజ్లర్ పింకీ (53 కేజీలు) తొలి రౌండ్లో 0–10తో సుమియా (మంగోలియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 125 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సుమీత్ 0–2తో దావిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. వైఎస్ జగన్ అభినందన... స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను... రజత పతకాలు గెలిచిన షూటర్లు దీపక్ కుమార్, లక్షయ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఏషియాడ్‌లో భారత క్రీడాకారుల బృందానికి అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగా. ఆసియాస్థాయిలో మూడుసార్లు రజతం గెలిచా. అందుకే ఈసారి ఎలాగైనా పసిడి గెలవాలనుకున్నా. పూర్తి ఫిట్నెస్తో ఉండటం... కఠోర శ్రమ ఫలించడం... అన్ని పరిస్థితులు అనుకూలించడం... దేవుడు కూడా సహకరించడంతో పసిడి కల నెరవేరింది. –వినేశ్ 2 ఆసియా క్రీడల్లో వినేశ్‌కు ఇది రెండో పతకం. 2014 ఇంచియోన్ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో రజతం గెలిచింది. 2 ఆసియా క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో గీతిక జఖర్ (2006; 63 కేజీల్లో కాంస్యం; 2014; 63 కేజీల్లో రజతం) ఈ ఘనత సాధించింది. -
‘దంగల్’ తరహా సీన్ రిపీట్..
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘దంగల్’లో హీరో అమీర్ ఖాన్‌ను తన కూతురు ఫైనల్ బౌట్ చూడకుండా జట్టు కోచ్ ఆయనను ఓ గదిలో బంధిస్తారు. నిజంగా ఇది జరగనప్పటికీ సినీడ్రామా కోసం అలా చేశారు. స్టార్ రెజ్లర్లు గీత, బబిత ఫొగాట్ తండ్రి మహావీర్ ఫొగాట్ జీవితచరిత్ర ఆధారంగా ఆ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బంధించడం జరగలేదు కానీ... స్టేడియం వెలుపల మహావీర్ నిరీక్షించిన ఘటన గోల్ట్కోస్ట్లో జరిగింది. తన కుమార్తె తలపడుతున్న 53 కేజీల స్వర్ణ పతక బౌట్‌ను చూసేందుకు స్టేడియానికి వెళ్లిన మహావీర్ టికెట్ లేక ఆగిపోయారు. తొలి మూడు బౌట్లలో బబిత గెలిచినా... అది చూసే అవకాశం మాత్రం మహావీర్‌కు దక్కలేదు. చివరకు ఆస్ట్రేలియా రెజ్లర్లకు వచ్చిన టికెట్లతో ప్రవేశం పొందిన ఆయన... తన కుమార్తె ఫైనల్ ‘పట్టు’ చూడగలిగారు. టికెట్ల వ్యవహారంపై చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా మాట్లాడుతూ రెజ్లింగ్ కోచ్ తోమర్‌కు ఐదు టికెట్లిచ్చామని... అమెకు ఎందుకు అందలేదో తెలియదన్నారు. రాత్రి దాకా ప్రయత్నించా: బబిత ‘అథ్లెట్‌కు రెండు టికెట్లిస్తారు. కానీ అవి నాకు అందలేదు. నా తండ్రికి టికెట్ ఇవ్వండని ఐఓఏ అధికారుల్ని, భారత చెఫ్ డి మిషన్‌ను అడిగా. బుధవారం రాత్రి పది గంటలదాకా నాకు ఇదే పనైంది. ఎంత చేసినా టికెట్లు అందలేదు. దీంతో స్టేడియం వెలుపలే మా నాన్న ఉండిపోయాడు. చివరకు ఆస్ట్రేలియన్ల చొరవతో ఆఖరి పోరు చూడగలిగారు. నేను చాలా నిరాశ చెందాను’ అని బబిత వాపోయింది. -
ఓవరాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లా రెజ్లింగ్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జిల్లా జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. 79 పాయింట్లతో హైదరాబాద్ జట్టు మొదటి స్థానంలో నిలవగా... 51 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా జట్టు రెండో స్థానం దక్కించుకుంది. బాలికల 50 కేజీల విభాగం ఫైనల్లో సీహెచ్.మౌనిక (వరంగల్)పై ఎన్.శిరీష యాదవ్ (హైదరాబాద్) గెలుపొందింది. 53 కేజీల విభాగంలో వైష్ణవి యాదవ్ (హైదరాబాద్)పై ఎన్.మౌనిక (కరీంనగర్) విజయం సాధించింది. 55 కేజీల విభాగంలో ఎం.నవ్య (మెదక్)పై వి.నయని (రంగారెడ్డి) గెలిచింది. 59 కేజీల విభాగంలో వీణ (నిజామాబాద్)పై టి.సంధ్యారాణి (మెదక్); 62 కేజీల విభాగంలో పి.నిహారిక (కరీంనగర్)పై రోహిణి (రంగారెడ్డి) గెలుపొందారు. బాలుర 55 కేజీల విభాగంలో కె.మధుకర్ (వరంగల్)పై తుకారామ్ సింగ్ (హైదరాబాద్); 60 కేజీల విభాగంలో ఎం.శ్రీకాంత్ (నిజామాబాద్)పై సాయి కుమార్ యాదవ్ (అదిలాబాద్); 63 కేజీల విభాగంలో మోనూ యాదవ్ (రంగారెడ్డి)పై అబూబకర్ బిన్ అలీ (హైదరాబాద్); 67 కేజీల విభాగంలో జి.నరేందర్ (రంగారెడ్డి)పై అబ్రార్ (హైదరాబాద్); 72 కేజీ ల విభాగంలో నవాజ్ అహ్మద్ (హైదరాబాద్)పై కె.శివ (మహబూబ్‌నగర్); 77 కేజీల విభాగంలో ఎం.బాలాజీ (వరంగల్)పై సి.నితిన్ (హైదరాబాద్); 82 కేజీల విభాగంలో కళ్యాణ్‌రామ్ (వరంగల్)పై కె.యశ్విన్ సింగ్ (హైదరాబాద్); 87 కేజీల విభాగంలో వివేక్ (వరంగల్)పై ధీరన్ యాదవ్ (హైదరాబాద్) గెలుపొందారు. -
ఘోర రోడ్డు ప్రమాదాలు..14మంది దుర్మరణం
సాక్షి, పుణె: రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని కడెగావ్ సమీపంలోని సంగ్లీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్ల్లోకి వెళితే...రెజలర్స్ పోటీలో పాల్గొని పుణె నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్న ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రెజలర్స్‌తో పాటు డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నీటికుంటలో బస్తు బోల్తా.. 8మంది మృతి బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లా కరెకెరెలో శనివారం ఉదయం బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నీటికుంటలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి 43మంది ప్రయాణికులతో కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదెరింది. ధర్మస్థలా సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
అభిమానుల అతి.. చిక్కుల్లో రెజ్లర్ సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : అభిమానులు అతిగా ప్రవర్తించడంతో రెండుసార్లు ఒలింపిక్ విజేతైన రెజ్లర్ సుశీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. సుశీల్ అనుచరులు తమపై దాడి చేశారని ప్రత్యర్థీ రెజ్లర్ ప్రవీణ్ రాణా సోదరుడు.. నవీన్రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఢిల్లీ పోలీసులు సుశీల్‌పై కేసు నమోదు చేశారు. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి రెజ్లర్ల అనుచరుల మధ్య రచ్చ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ సుశీల్ అనచురులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు. కేసుపై స్పందించిన సుశీల్ కుమార్.. ‘ఇలాంటి ఘటనలు క్రీడల్లో చోటుచేసుకోకూడదు. ఓటమి, గెలుపు మంచిగానే తీసుకోవాలి. ఆ విషయంలో ప్రవీణ్ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అక్కడ క్రమశిక్షణతో నడుచుకోవాల్సింది, ఏ ఒక్కరు రఫ్‌గా ఆడలేదు. మనం దేశం తరుపున రెజ్లింగ్ ఆడుతున్నామని’ కేసునమోదవ్వడంపై సుశీల్ స్పందించాడు. -
మ్యాట్ బయట ముష్టిఘాతాలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం! వివరాల్లోకెళితే... వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్‌లో సుశీల్‌తో తలపడక ముందే అతనిపై ‘గౌరవం’తో వాకోవర్ ఇచ్చిన ముగ్గురు రెజ్లర్లలో ప్రవీణ్ రాణా కూడా ఒకడు కావడం విశేషం! -
రాజధానిలో.. దంగల్
మన మల్లయోధులకు హరియాణా నిపుణుల శిక్షణ - ఆ రాష్ట్ర యువతకు కబడ్డీలో తెలంగాణ శిక్షణ - ఘుమర్, లంబాడా నృత్యాల్లో పరస్పర తర్ఫీదు - ఇరు రాష్ట్రాల సంయుక్త ‘పురావస్తు’ తవ్వకాలు - ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పథకంలో భాగం సాక్షి, హైదరాబాద్: దంగల్ (కుస్తీ). హరియాణా మల్లయోధుడు మహవీర్‌సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా రూపొంది రికార్డులు నెలకొల్పిన హిందీ సినిమా. ఇప్పుడీ క్రీడ హరియాణా, తెలంగాణ మధ్య వారధి కాబోతోంది. మల్లయోధుల శిక్షణకు హరియాణా మారుపేరు కాగా, కుస్తీకి హైదరాబాద్‌లోనూ అనాదిగా ప్రత్యేక స్థానముంది. ఈ నేపథ్యంలో మన వర్ధమాన రెజ్లర్లకు హరియాణా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేక అఖాడా (రెజ్లింగ్ శిక్షణ కేంద్రం)లు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమంరూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని మెరుగైన అఖాడాలను, ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేసేందుకు ముగ్గురు కోచ్‌లతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వారికి హరియాణా నిపుణులు త్వరలో శిక్షణ మొదలు పెడతారు. అలాగే కబడ్డీ, ఖోఖోల్లో హరియాణా క్రీడాకారులకు తెలంగాణ నిపుణులు తర్ఫీదునిస్తారు. ఈ క్రీడల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌బాబు తెలిపారు. ఇది రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచటంతో పాటు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిపెట్టగలదని ఆశాభావం వెలిబుచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకం అమలులో తెలంగాణ–హరియాణా జోడీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. పథకం అమలులో పురోగతిని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా విభాగాల అధికారులు గురువారం సచివాలయంలో మీడియాకు వివరించారు. వారి ఘుమర్..మన లంబాడా నృత్యాలు.. సాంస్కృతిక అనుబంధాన్ని పెంచుకోవడంలో భాగంగా హరియాణా కళాకారులు ఇటీవల నగరానికి వచ్చి 15 మంది యువతులకు అక్కడి ప్రసిద్ధ ఘుమర్ నృత్యాన్ని నేర్పారు. తెలంగాణ సంప్రదాయ లంబాడా నృత్యాన్ని స్థానిక కళాకారుల నుంచి నేర్చుకున్నారు. ఇటీవల హరియాణాలో తీజ్ పండుగ సందర్భంగా అక్కడి రాజ్‌భవన్‌లో తెలంగాణ కళాకారులు ఘుమర్, హరియాణా కళాకారులు లంబాడా నృత్యాలతో స్థానికులను అలరించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం నాడు రవీంద్రభారతిలో హరియాణా కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెంకటేశం తెలిపారు. త్వరలో హరియాణాలో తెలంగాణ సంబురాలు, హైదరాబాద్‌లో హరియాణా దివస్ నిర్వహిస్తామని వెల్లడించారు. హరప్పా నాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటైన హరియాణాలోని కునాల్లో పురావస్తు తవ్వకాల్లో తెలంగాణ సిబ్బంది పాలుపంచుకోనున్నారు. తెలంగాణలో శాతవాహనుల జాడలున్న కర్ణమామిడి, బౌద్ధజాడలున్న పెద్దబంకూరుల్లో తవ్వకాల్లో హరియాణా నిపుణులు పాల్గొంటారని పురావస్తు సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. 100 తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు, 100 తెలుగు జాతీయాలు, ప్రముఖ తెలుగు కవుల మూడు రచనలను హిందీలోకి అనువదించి హరియాణాకు అందజేస్తారు. అలాగే వారి పుస్తకాలనూ తెలుగులోకి అనువదిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. -
కలలు కనండి... సాకారం చేసుకోండి
కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై: తాము అనుకున్న లక్ష్యాల వైపు అకుంఠిత దీక్షతో ముందుకెళితే తప్పకుండా విజయం అందుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 49వ ఆలిండియా సెంట్రల్ రెవిన్యూ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో అతను పాల్గొన్నాడు. ‘మీ మీద మీకు నమ్మకముంటే ఏమైనా సాధించగలరు. ఇదే సూత్రంపై నేను ముందుకు సాగుతుంటాను. ఎంత పెద్ద కలలైనా కనండి.. వాటిని అందుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఇటీవలే ఇద్దరు సిస్టర్స్ (రెజ్లర్లు బబిత, గీతా ఫోగట్)ల జీవిత చరిత్ర చూశాను. నా హృదయాన్ని కదిలించింది. దేశం గర్వించే స్థాయిలో వారు ఎదిగారు. జీవితంలో అయినా క్రీడల్లో అయినా దేశానికి పేరు తెచ్చే విధంగా మెలగాలి’ అని క్రీడాకారులకు కోహ్లి సూచించాడు. రెజ్లర్ బబితా, మహారాష్ట్ర మంత్రి వినోద్, గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
నేను బలంగా నమ్ముతున్నా: నర్సింగ్
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అంశంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కు తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమైన నర్సింగ్.. తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నాడు. 'డోపింగ్ వివాదంలో నా ప్రమేయం లేదు. కుట్ర పూరితంగానే జరిగిందని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నాడాకు తెలియజేశాం. డోపింగ్ వ్యవహారంలో జరిగిన వాస్తవాన్ని నాడాకు వివరించా. ఇక వారి నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నా. నాకు నమ్మకం ఉంది. ప్యానల్ నుంచి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నా'అని నర్సింగ్ పేర్కొన్నాడు. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే నర్సింగ్ యాదవ్ ఏదైతే వాదిస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేదని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ తెలిపారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవైపు నర్సింగ్ తన రియో ఆశలపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనల ప్రకారం ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. -
మరో భారత రెజ్లర్ అనర్హత
న్యూఢిల్లీ: ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్ నుంచి మరో భారత రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. రియో ఒలింపిక్స్‌కు చివరి అర్హత పోటీలైన రెండో ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో గుర్ప్రీత్ సింగ్ గ్రీకో రోమన్ 75కేజీ విభాగంలో పాల్గొనాల్సి ఉంది. అయితే తను ఉండాల్సిన దానికన్నా 500 గ్రాముల బరువు అధికంగా తూగాడు. దీంతో తనను బరిలోంచి తప్పించారు. గత నెల ఇదే కారణంగా వినేశ్ ఫోగట్ తప్పుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ల నిరాశాప్రదర్శన ఇస్తాంబుల్: ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు చెందిన నలుగురు రెజ్లర్లు తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. 85కేజీ విభాగంలో రవీందర్, 130 కేజీలో నవీన్ , రవీందర్ సింగ్ (59కేజీ), సురేశ్ యాదవ్ (66కేజీ) ఏమాత్రం ప్రభావం చూపలేదు. -
భారత్ పసిడి 'పట్టు'
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ప్రత్యేకంగా సోమవారం ముగిసిన రెజ్లింగ్ పోరులో భారత్ ఆరు పతకాలను సాధించి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఇందులో ఐదు స్వర్ణ పతకాలను భారత రెజ్లర్లు సాధించగా, ఒక రజతాన్ని దక్కించుకున్నారు. దీంతో మొత్తంగా రెజ్లింగ్ లో 14 పసిడి పతకాలను, రెండు రజతాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వీటిలో భారత పురుషులు ఆరు స్వర్ణ పతకాలను, రెండు రజత పతకాలను సాధించగా, మహిళా రెజ్లర్లు ఎనిమిది స్వర్ణపతాకాలను కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన రెజ్లింగ్ పోరులో భారత మహిళా రెజ్లర్ షిల్పి షీరాన్ స్వర్ణంతో బోణి చేసింది. 63కేజీల విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారిణి ఫర్జానా షర్మిన్ ను ఓడించి షీరాన్ పసిడిని సాధించింది. అనంతరం రజని(69 కేజీల విభాగం), నిక్కీ(75 కేజీల విభాగం)లు పసిడి పతకాలు సాధించారు. ఆపై పురుషుల పోరులో మౌసమ్ ఖత్రి(97 కేజీల విభాగం), ప్రదీప్(74కేజీల విభాగం)లు పసిడి పట్టు పట్టగా, మన్ దీప్(125 కేజీల విభాగం) రజతంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ 46 స్వర్ణాలు, 17 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 69 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
నిరాశపరిచిన భారత రెజ్లర్లు
ఇంచియాన్:ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్లో మాత్రం నిరాశ పరిచారు. కృష్ణకాంత్ యాదవ్ కాంస్య పతక పోరులో 0-3తో ఇరాన్ రెజ్లర్ సయూద్ చేతిలో ఓడాడు. ఇక రవీందర్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఓడి ఇంటిదారి పట్టారు. ఇదిలా ఉండగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీలు శరత్ కమల్- ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ తమ ప్రత్యర్థులపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో అమల్‌రాజ్-మాధురిక ద్వయుం, జపాన్ జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ లో మైరాజ్ అహ్మద్ ఖాన్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో తను ఐదో స్థానంలో నిలిచాడు.