న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని భారత టాప్ రెజ్లర్లంతా పునరుద్ఘాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను తప్పించి ఆటను కాపాడాలంటూ బుధవారం అనూహ్యంగా నిరసనకు దిగిన రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. బజ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తదితరులు ఇప్పటికే నిరసనలో పాల్గొంటుండగా గురువారం ఒలింపిక్ రజత పతక విజేత రవి దహియా, అన్షు మలిక్ కూడా వారికి సంఘీభావం ప్రకటించారు.
రెజ్లర్ల ఆరోపణలకు స్పందిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వారితో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సుమారు గంట పాటు వారితో రెజ్లర్ల భేటీ సాగింది. అయితే దీనిపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నా...వారి స్పందన సంతృప్తికరంగా లేదని, చర్యల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని రెజ్లర్లు చెప్పారు. ‘లైంగిక వేధింపులకు గురైన మరికొందరు బాధితులు ఇవాళ మాతో చేరారు. వారి పేర్లు ప్రస్తుతానికి బహిరంగపర్చదల్చుకోలేదు.
ఏదైనా పరిష్కారం వస్తుందని భావించాం. కానీ ప్రభుత్వ స్పందన చూస్తే అలా అనిపించడం లేదు. ఇక మేం చట్టపరంగా, న్యాయపరంగా తేల్చుకుంటాం. బ్రిజ్‌భూషణ్ రాజీనామా మాత్రమే కాదు... ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపిస్తాం. మేమంతా ఒలింపిక్ విజేతలం, ప్రపంచ విజేతలం. అన్నీ నిజాలే చెబుతున్నాం. తగిన ఆధారాలూ ఉన్నాయి. మా ఆరోపణలపై సందేహాలు వద్దు’ అని వినేశ్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన మరో అగ్రశ్రేణి రెజ్లర్ బబితా ఫొగాట్ కూడా ప్రభుత్వం తరఫున చర్చలకు ముందుకు వచ్చింది.
కేంద్ర మంత్రిని కలిసిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలతో నిరసన తెలుపుతున్న రెజ్లర్లు గురువారం రాత్రి మరో కీలక అడుగు వేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి, రెజ్లర్ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి. చర్చల తుది ఫలితంపై స్పష్టత లేకున్నా... బ్రిజ్‌భూషణ్ రాజీనామాకే ఠాకూర్ కూడా మద్దతు పలికినట్లు తెలిసింది. 24 గంటల్లోగా ఆయన తన రాజీనామాను ప్రకటించాలని, లేదంటే తామే ఆయనను తొలగిస్తామని కూడా స్పష్టం చేసినట్లు రెజ్లింగ్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment