న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కీలక మలుపు తిరిగింది. ఆదివారం నిరసన దీక్షా శిబిరం వద్దకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్, ఖాప్ మహమ్ 24 నేత మెహర్ సింగ్, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన దేవ్ సింగ్ సిర్సా తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.
‘ఇకపై ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనల్లో పాల్గొంటాం. రెజ్లర్లకు వెలుపలి నుంచి మద్దతు తెలుపుతామన్నారు. వారికేదైనా సమస్య వస్తే తోడుంటాం’అని రైతు సంఘాల నేతలు చెప్పారు. బాధిత రెజ్లర్ల డిమాండ్ల కోసం ఈ నెల 11–18 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి, సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 21న సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి రాజకీయ నిరసనలు కావు..తమది రాజకీయేతర సంస్థ అని చెప్పారు.
ఇలా ఉండగా, తమ నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆదివారం జంతర్‌మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్)ను మోహరించారు. ఇలాఉండగా, నిరసనకు దిగిన రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు తెలపడంపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలని కోరారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానన్నానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆరోపణలు రుజువైతే శిక్ష విధించండి. దోషిగా తేలితే నన్ను కొట్టి చంపండి’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment