న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), సీనియర్ రెజ్లర్ల మధ్య గొడవలతో తమ భవిష్యత్తు నాశనం అవుతోందని యువ రెజ్లర్లు నిరసనకు దిగారు. ఏడాది కాలంగా డబ్ల్యూఎఫ్‌ఐ వివాదాల్లో కూరుకుపోవడంతో శిబిరాలు, జాతీయ జూనియర్, సబ్–జూనియర్ టోర్నీలు లేక యువ రెజ్లర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీనిపై ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలకు చెందిన సుమారు 300 మంది వర్ధమాన రెజ్లర్లు బస్సుల్లో వచ్చి జంతర్‌మంతర్ వద్ద మూడు గంటల పాటు నిరసన చేపట్టారు.
ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్, కామన్వెల్త్ చాంపియన్ వినేశ్ ఫొగాట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ ముగ్గురి బారి నుంచి మమ్మల్ని కాపాడండి’ అనే బ్యానర్లతో పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. 10 రోజుల్లోగా సమాఖ్యపై నిషేధాన్ని ఎత్తేయాలని, వెంటనే టోర్నీల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా అవార్డుల్ని వెనక్కిస్తామని ప్రకటించారు.
మరో వైపు దీనిపై అడ్‌హక్ కమిటీ అవసరమైన చర్యలు చేపట్టింది. ఆరు వారాల్లోనే అండర్–15, అండర్–20 కేటగిరీలో జాతీయ చాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. రెజ్లర్ల కెరీర్‌కు సంబంధించిన వ్యవహారాలను తీవ్రంగా పరిశిలిస్తామని, ఇకపై సమాఖ్య బాధ్యతల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు.
మరోవైపు జరుగుతున్న పరిణామాలపై రియో ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి స్పందించారు. వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ విధేయుడు సంజయ్ సింగ్‌ను అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తే కొత్త కార్యవర్గంతో తమకు ఏ ఇబ్బందీ లేదని ఆమె ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment