ఢిల్లీ: అథ్లెట్లకు షాక్ ఇచ్చేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ను తొలగించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. వాళ్లపై పోలీస్ ఫిర్యాదుకు డబ్ల్యూఎఫ్‌ఐ సిద్ధమైంది. అయితే అందుకు ఈ నిరసనలతో సంబంధం లేకపోవడం గమనార్హం!.
ఒక ఈవెంట్‌లో రెజ్లర్లను పాల్గొనకుండా ఆపేందుకు.. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వాళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాకింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన రెజ్లర్‌లకు.. ఆ ఈవెంట్ రద్దు అయ్యిందని నిరసనలో పాల్గొంటున్న కొందరు అథ్లెట్లు చెప్పి మోసం చేశారని, తద్వారా వాళ్లను పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించారని రెజ్లింగ్ ఫెడరేషన్ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్లపై కేసు నమోదు చేయాలని భావిస్తోందట.!
రెజ్లర్ల మీటూ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ.. నాలుగు డిమాండ్లతో ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్‌కు రెజ్లర్లు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలో.. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో భేటీ సాగింది. మరోవైపు ఆరోపణలను ఖండించిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం ఉత్కంఠకు తెర తీసింది. అయితే.. మీడియా ముందుకు రావొద్దని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఫోన్ ద్వారా సూచించినట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. ఇంకోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు మరోసారి మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment