నేను బలంగా నమ్ముతున్నా: నర్సింగ్
న్యూఢిల్లీ: డోపింగ్లో పట్టుబడ్డ భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అంశంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కు తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమైన నర్సింగ్.. తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నాడు.
'డోపింగ్ వివాదంలో నా ప్రమేయం లేదు. కుట్ర పూరితంగానే జరిగిందని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నాడాకు తెలియజేశాం. డోపింగ్ వ్యవహారంలో జరిగిన వాస్తవాన్ని నాడాకు వివరించా. ఇక వారి నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నా. నాకు నమ్మకం ఉంది. ప్యానల్ నుంచి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నా'అని నర్సింగ్ పేర్కొన్నాడు.
గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే నర్సింగ్ యాదవ్ ఏదైతే వాదిస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేదని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ తెలిపారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవైపు నర్సింగ్ తన రియో ఆశలపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనల ప్రకారం ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.