న్యాయం కావాలి! | Sakshi Editorial On Wrestling Federation of India Women Harassment | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి!

Published Thu, Apr 27 2023 2:52 AM | Last Updated on Thu, Apr 27 2023 2:59 AM

Sakshi Editorial On Wrestling Federation of India Women Harassment

చట్టం ముందు అందరూ సమానులే అంటాం. కానీ, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువ సమానమని పదేపదే రుజువవుతుంటే ఏమనాలి? వ్యవస్థపై ఇక నమ్మకమేం మిగుల్తుంది? లైంగిక వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డాడంటూ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడూ, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు నెలలుగా మొత్తుకుంటున్నా క్రీడాశాఖకూ, పాలకులకూ పట్టనితనం చూస్తే ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి.

అంతర్జాతీయ పత కాలు తెచ్చిన ఆడపిల్లలు తమ గోడు వెళ్ళబోసుకుంటూ, బ్రిజ్‌ భూషణ్‌పై చర్య తీసుకోవాలంటూ జనవరిలో వీధికెక్కిన దృశ్యాలు దేశమంతా చూసినవే. మూడు నెలలు గడిచినా అతీగతీ లేక చివరకు మళ్ళీ ఆ అగ్రశ్రేణి మహిళా మల్లయోధులు మరోసారి నిరసనకు దిగాల్సి రావడం శోచనీయం. తాజాగా ఏప్రిల్‌ 21న పోలీసులకు ఫిర్యాదు చేసినా, కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు కాని పరిస్థితుల్లో అసహాయులైన అమ్మాయిలు ఆఖరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాల్సి రావడం మనం ఏ కాలంలో, ఎలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామో నగ్నంగా నిరూపిస్తున్నాయి. 

అన్నిటికీ అత్యుత్సాహంతో కేసులు కట్టే పోలీసులు తాజా ఫిర్యాదు తర్వాత 5 రోజులైనా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదు. ఆదివారం నుంచి 4 రోజులుగా జంతర్‌ మంతర్‌ వద్ద రెండోసారి నిరసన దీక్ష కొనసాగిస్తున్నా బాధిత మహిళా రెజ్లర్లను సంబంధిత అధికారులెవరూ పలకరించనైనా లేదు. మహిళా సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకొనే జాతీయ మహిళా కమిషన్‌ సైతం అయిపూ అజా లేదు. ఇక దేశంలో సగటు స్త్రీకి మనం ఏం భరోసా కల్పిస్తున్నట్టు? అసలైతే మహిళలెవరైనా లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే – తక్షణమే కేసు పెట్టి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చట్టం.

ఢిల్లీ పోలీసులు మాత్రం ఏడుగురు మహిళలు లిఖిత పూర్వక ఫిర్యాదులిచ్చినా ప్రాథమిక విచారణ చేశాక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణం. ‘పోక్సో’ చట్టం సైతం వర్తించే మైనర్‌ బాలికపై వేధింపుల తీవ్రాతితీవ్ర అంశమున్నా, సోకాల్డ్‌ విచారణేదో ఇన్నిరోజులుగా పూర్తి కాకపోవడం మరీ విడ్డూరం. పైపెచ్చు, లైంగిక బాధితులమంటూ ఫిర్యాదు చేసిన స్త్రీల పేర్లను పోలీసులే లీకు చేయడం ఘోరం, నేరం. నిందితుడు అధికార పార్టీకీ, అందునా సీట్లు, ఓట్లలో కీలక యూపీకీ చెందిన వ్యక్తి గనక చట్టాలన్నీ చుట్టాలయ్యాయంటే తప్పు పట్టగలమా? 

జనవరిలో బాధితులు నిరసన దీక్షకు దిగినప్పుడే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. వినేశ్‌ ఫోగట్, సాక్షీ మలిక్‌ లాంటి తోటి క్రీడాకారిణులకు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత భజరంగ్‌ పునియా లాంటి పురుషులూ తోడుగా నిలిచి, విషయం మీడియాలో పెద్దదయ్యే సరికి తప్పక క్రీడాశాఖ రంగంలోకి దిగింది. నిందితుడైన బీజేపీ ఎంపీని తాత్కాలికంగా సమాఖ్యకు దూరం జరిపింది. విచారణకు కంటితుడుపు కమిటీ వేసింది.

బాక్సర్‌ మేరీ కోమ్‌ సారథ్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి. ఇప్పటికి 3 నెలలైనా ఆ కమిటీ, దాని నివేదిక అతీగతీ దేవరహస్యమే. నివేదికను బయటపెట్టాలనీ, నిందితుణ్ణి అరెస్ట్‌ చేయాలనీ కోరుతూ రెజ్లర్లు ఇప్పుడు ఢిల్లీ నడిబొడ్డున, నేపథ్యంలో హనుమాన్‌ చాలీసా వినిపిస్తూ, దీక్షకు కూర్చున్నారు. రోడ్ల మీదే రెజ్లింగ్‌ సాధన చేస్తున్నారు. పతకాలు తెచ్చినప్పుడల్లా వారితో ఫోటోలకు పోజులిచ్చి, న్యాయం కోసం రోడ్డెక్కినప్పుడు మౌనం పాటిస్తున్న కమలనాథులకు మాత్రం కనికరం కలగట్లేదు. 

భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ పక్షాన మరో కమిటీ వేస్తున్నట్టు క్రీడా శాఖ ప్రకటించింది కానీ, మరోసారి కమిటీల పేర మోసపోవడానికి రెజ్లర్లు సిద్ధంగా లేరు. బాధిత మహిళలతో పాటు పౌర సమాజం డిమాండ్‌ చేస్తున్నట్టు... ఆరుసార్లు ఎంపీ, ఒకప్పుడు తీవ్రవాద కేసులో నిందితుడూ, స్థానిక డాన్‌గా అపరిమిత పలుకుబడి గల వ్యక్తి అయిన బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలి.

ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు నిరాకరించిన పోలీసులపై కేసు నమోదు చేయాలి. పతకాలు పండిస్తున్న భారత రెజ్లింగ్‌ ఇప్పటికే ఈ వివాదాలతో కుదేలైంది. నిరసనగా గత నెల అంతర్జాతీయ శిక్షణ శిబి రాల నుంచి పునియా, ఫోగట్‌ పక్కకు తప్పుకున్నారు. వచ్చే ఎటి ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో విజయా లకూ ఇది గండి కొట్టే ప్రమాదం ఉంది. సుప్రీంలో కేసు ఈ 28న తదుపరి విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పరువు పోయిన క్రీడాశాఖ కళ్ళకూ, చెవులకూ గంతలు తొలగించుకోవాలి.

నిజానికి, మన క్రీడా వ్యవస్థ అనేక లోపాల పుట్ట. క్రీడాసంస్థలు కొందరి జేబుసంస్థలుగా కొనసాగడం, రాజకీయ ప్రాబల్యానికి అడ్డా కావడం దశాబ్దాలుగా ఉన్నదే. కోరింది ఇస్తేనే ఆటలో అవకాశాలొస్తాయనే వాతావరణం కల్పించడం, అర్హుల కన్నా అయినవాళ్ళను అందలం ఎక్కించడం పదే పదే చూస్తున్నదే. అందుకే, అప్రతిష్ఠ మూటగట్టుకున్న రెజ్లింగ్‌ సమాఖ్య, దాన్ని సొంత జాగీరులా నడుపుతున్న బ్రిజ్‌భూషణ్‌ల వ్యవహారం ఆశ్చర్యం కాకపోవచ్చు కానీ, ఇన్ని ఆరోపణల తర్వాతైనా కళ్ళు తెరిచి, చర్యలు తీసుకోవాల్సిన అంశం.

కేసు ఇప్పుడు సుప్రీం దాకా వచ్చింది గనక బాధితులకు న్యాయం జరగవచ్చు. కానీ దేశప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులు, అందులోనూ ఆడ పిల్లలు ఆరోపణలు చేస్తుంటే అధికార, పాలనా వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోవడమే దుర్మార్గం. ఇకనైనా స్వపర భేదాలు వదిలి, క్రీడా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళించాలి. బ్రిజ్‌ భూషణ్‌ కథ అందుకు నాంది కావాలి. సాధారణ న్యాయం సైతం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేనే సాధ్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే, అది పాలకులకు కాదు... మొత్తం వ్యవస్థకే తలవంపులు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement