sports department
-
వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్‌రత్న... అర్జున’ వెనక్కి
న్యూఢిల్లీ: ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ వర్గమే గెలిచింది. ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేసింది. -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్‌కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్‌తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్‌లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్‌ల జట్లను ఓడించి రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్‌తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్‌ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్‌కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్‌తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్‌గా అంబటి రాయుడు ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
న్యాయం కావాలి!
చట్టం ముందు అందరూ సమానులే అంటాం. కానీ, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువ సమానమని పదేపదే రుజువవుతుంటే ఏమనాలి? వ్యవస్థపై ఇక నమ్మకమేం మిగుల్తుంది? లైంగిక వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డాడంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడూ, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు నెలలుగా మొత్తుకుంటున్నా క్రీడాశాఖకూ, పాలకులకూ పట్టనితనం చూస్తే ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి. అంతర్జాతీయ పత కాలు తెచ్చిన ఆడపిల్లలు తమ గోడు వెళ్ళబోసుకుంటూ, బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలంటూ జనవరిలో వీధికెక్కిన దృశ్యాలు దేశమంతా చూసినవే. మూడు నెలలు గడిచినా అతీగతీ లేక చివరకు మళ్ళీ ఆ అగ్రశ్రేణి మహిళా మల్లయోధులు మరోసారి నిరసనకు దిగాల్సి రావడం శోచనీయం. తాజాగా ఏప్రిల్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసినా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాని పరిస్థితుల్లో అసహాయులైన అమ్మాయిలు ఆఖరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాల్సి రావడం మనం ఏ కాలంలో, ఎలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామో నగ్నంగా నిరూపిస్తున్నాయి. అన్నిటికీ అత్యుత్సాహంతో కేసులు కట్టే పోలీసులు తాజా ఫిర్యాదు తర్వాత 5 రోజులైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఆదివారం నుంచి 4 రోజులుగా జంతర్ మంతర్ వద్ద రెండోసారి నిరసన దీక్ష కొనసాగిస్తున్నా బాధిత మహిళా రెజ్లర్లను సంబంధిత అధికారులెవరూ పలకరించనైనా లేదు. మహిళా సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకొనే జాతీయ మహిళా కమిషన్ సైతం అయిపూ అజా లేదు. ఇక దేశంలో సగటు స్త్రీకి మనం ఏం భరోసా కల్పిస్తున్నట్టు? అసలైతే మహిళలెవరైనా లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే – తక్షణమే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం. ఢిల్లీ పోలీసులు మాత్రం ఏడుగురు మహిళలు లిఖిత పూర్వక ఫిర్యాదులిచ్చినా ప్రాథమిక విచారణ చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణం. ‘పోక్సో’ చట్టం సైతం వర్తించే మైనర్ బాలికపై వేధింపుల తీవ్రాతితీవ్ర అంశమున్నా, సోకాల్డ్ విచారణేదో ఇన్నిరోజులుగా పూర్తి కాకపోవడం మరీ విడ్డూరం. పైపెచ్చు, లైంగిక బాధితులమంటూ ఫిర్యాదు చేసిన స్త్రీల పేర్లను పోలీసులే లీకు చేయడం ఘోరం, నేరం. నిందితుడు అధికార పార్టీకీ, అందునా సీట్లు, ఓట్లలో కీలక యూపీకీ చెందిన వ్యక్తి గనక చట్టాలన్నీ చుట్టాలయ్యాయంటే తప్పు పట్టగలమా? జనవరిలో బాధితులు నిరసన దీక్షకు దిగినప్పుడే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. వినేశ్ ఫోగట్, సాక్షీ మలిక్ లాంటి తోటి క్రీడాకారిణులకు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియా లాంటి పురుషులూ తోడుగా నిలిచి, విషయం మీడియాలో పెద్దదయ్యే సరికి తప్పక క్రీడాశాఖ రంగంలోకి దిగింది. నిందితుడైన బీజేపీ ఎంపీని తాత్కాలికంగా సమాఖ్యకు దూరం జరిపింది. విచారణకు కంటితుడుపు కమిటీ వేసింది. బాక్సర్ మేరీ కోమ్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి. ఇప్పటికి 3 నెలలైనా ఆ కమిటీ, దాని నివేదిక అతీగతీ దేవరహస్యమే. నివేదికను బయటపెట్టాలనీ, నిందితుణ్ణి అరెస్ట్ చేయాలనీ కోరుతూ రెజ్లర్లు ఇప్పుడు ఢిల్లీ నడిబొడ్డున, నేపథ్యంలో హనుమాన్ చాలీసా వినిపిస్తూ, దీక్షకు కూర్చున్నారు. రోడ్ల మీదే రెజ్లింగ్ సాధన చేస్తున్నారు. పతకాలు తెచ్చినప్పుడల్లా వారితో ఫోటోలకు పోజులిచ్చి, న్యాయం కోసం రోడ్డెక్కినప్పుడు మౌనం పాటిస్తున్న కమలనాథులకు మాత్రం కనికరం కలగట్లేదు. భారత ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన మరో కమిటీ వేస్తున్నట్టు క్రీడా శాఖ ప్రకటించింది కానీ, మరోసారి కమిటీల పేర మోసపోవడానికి రెజ్లర్లు సిద్ధంగా లేరు. బాధిత మహిళలతో పాటు పౌర సమాజం డిమాండ్ చేస్తున్నట్టు... ఆరుసార్లు ఎంపీ, ఒకప్పుడు తీవ్రవాద కేసులో నిందితుడూ, స్థానిక డాన్‌గా అపరిమిత పలుకుబడి గల వ్యక్తి అయిన బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ దాఖలుకు నిరాకరించిన పోలీసులపై కేసు నమోదు చేయాలి. పతకాలు పండిస్తున్న భారత రెజ్లింగ్ ఇప్పటికే ఈ వివాదాలతో కుదేలైంది. నిరసనగా గత నెల అంతర్జాతీయ శిక్షణ శిబి రాల నుంచి పునియా, ఫోగట్ పక్కకు తప్పుకున్నారు. వచ్చే ఎటి ప్యారిస్ ఒలింపిక్స్‌లో విజయా లకూ ఇది గండి కొట్టే ప్రమాదం ఉంది. సుప్రీంలో కేసు ఈ 28న తదుపరి విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పరువు పోయిన క్రీడాశాఖ కళ్ళకూ, చెవులకూ గంతలు తొలగించుకోవాలి. నిజానికి, మన క్రీడా వ్యవస్థ అనేక లోపాల పుట్ట. క్రీడాసంస్థలు కొందరి జేబుసంస్థలుగా కొనసాగడం, రాజకీయ ప్రాబల్యానికి అడ్డా కావడం దశాబ్దాలుగా ఉన్నదే. కోరింది ఇస్తేనే ఆటలో అవకాశాలొస్తాయనే వాతావరణం కల్పించడం, అర్హుల కన్నా అయినవాళ్ళను అందలం ఎక్కించడం పదే పదే చూస్తున్నదే. అందుకే, అప్రతిష్ఠ మూటగట్టుకున్న రెజ్లింగ్ సమాఖ్య, దాన్ని సొంత జాగీరులా నడుపుతున్న బ్రిజ్భూషణ్ల వ్యవహారం ఆశ్చర్యం కాకపోవచ్చు కానీ, ఇన్ని ఆరోపణల తర్వాతైనా కళ్ళు తెరిచి, చర్యలు తీసుకోవాల్సిన అంశం. కేసు ఇప్పుడు సుప్రీం దాకా వచ్చింది గనక బాధితులకు న్యాయం జరగవచ్చు. కానీ దేశప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులు, అందులోనూ ఆడ పిల్లలు ఆరోపణలు చేస్తుంటే అధికార, పాలనా వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోవడమే దుర్మార్గం. ఇకనైనా స్వపర భేదాలు వదిలి, క్రీడా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళించాలి. బ్రిజ్ భూషణ్ కథ అందుకు నాంది కావాలి. సాధారణ న్యాయం సైతం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేనే సాధ్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే, అది పాలకులకు కాదు... మొత్తం వ్యవస్థకే తలవంపులు. -
19 నుంచి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు
తిరుపతి అర్బన్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి వారితో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నట్లు మంత్రి ఆర్కే రోజా చెప్పారు. సంబరాల్లో భాగంగా క్రీడల పోటీలను జోనల్, రాష్ట్ర స్థాయిల్లో జరపబోతున్నట్లు చెప్పారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఆదివారం ఆమె సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు. తిరుపతి జోన్ కళాకారులకు మహతి కళాక్షేత్రంలో నవంబర్ 19, 20, 21 తేదీల్లో, గుంటూరు జోన్ వారికి 24, 25, 26 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమండ్రి జోన్ వారికి 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో శ్రీవేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. విశాఖ జోన్ వారికి డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 19, 20 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామని తెలిపారు. కూచిపూడి, ఆంధ్ర నాట్యం, భరత నాట్యం, జానపద కళారూపాలు తదితర కళా రంగాల్లో జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని, ప్రతి విభాగంలో జోనల్ స్థాయి విజేతల గ్రూప్‌నకు రూ.25 వేలు, సోలో కి రూ.10 వేలు, రాష్ట్ర స్థాయి విజేతలకు గ్రూప్‌నకు రూ.లక్ష, సోలోకి రూ.50 వేలను సీఎం జన్మదినం రోజున అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు https://culture.ap.gov.in/ వెబ్సైట్లో పేర్లను ఈ నెల 15 లోపు నమోదు చేసుకోవాలని కోరారు. -
క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్పోర్ట్స్ క్లబ్‌లు
తిరుపతి కల్చరల్: ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గ్రామీణ స్థాయి స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుపై గురువారం తిరుపతిలో మంత్రి రోజా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం వల్ల వెనకబడిపోతున్న క్రీడాకారులకు అండగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా క్రీడా క్లబ్‌లకు తగిన సహకారం అందించాలని కోరారు. క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్పోర్ట్స్ క్లబ్‌లు, పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ పాలనలో క్రీడా రంగానికి మంచి గుర్తింపు లభించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచిన వారికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేసిందని గుర్తుచేశారు. ఉద్యోగాలు, అకాడమీలకు భూములు కూడా కేటాయించి ప్రోత్సహిస్తోందని వివరించారు. క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, శాప్ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు విద్యా శాఖతో కలిసి సంయుక్తంగా స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో శాప్ అధికారులు, కోచ్‌లు, కళాశాలల పీడీలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఓ ఖాళీ ఉంచా
న్యూఢిల్లీ: తాజా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయంతో తనపై ఉన్న సిల్వర్ స్టార్ (రజత విజేత) ఇమేజ్ను చెరిపేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు ఇపుడు ఒలింపిక్ స్వర్ణంపై కన్నేసింది. తన పతకాల అల్మారాలో ఓ ఖాళీ ఉంచానని... దాన్ని ఒలింపిక్స్ బంగారంతోనే భర్తీ చేస్తానని ధీమాగా చెబుతోంది. 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్ స్వర్ణంతో ఫైనల్ పరాజయాలకు ముగింపు పలికాను. ఇప్పటివరకు క్రీడాభిమానులంతా నా ఫైనల్ ఫోబియా గురించే చర్చించుకునేవారు. ఇప్పుడు వారందరికి నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా. ఫైనల్ ఒత్తిడిని ఎలా అధిగమిస్తానో ప్రపంచ చాంపియన్‌షిప్ విజయంతో నిరూపించా. ఇవన్నీ సాధించినప్పటికీ ఒలింపిక్స్ అనేది పూర్తిగా భిన్నమైన అనుభూతినిచ్చేది. రియో, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు నాకు విభిన్నమైన మధుర జ్ఞాపకాలిచ్చాయి. అయితే ఇప్పటికీ ఓ స్వర్ణం వెలితి ఉంది. దీన్ని టోక్యో ఒలింపిక్స్‌లో సాకారం చేసుకుంటా. దీనికోసం కఠోరంగా శ్రమిస్తా’ అని తెలిపింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు వస్తే మంచిదేనని... దాంతో టోర్నీ డ్రాలకు మేలవుతుందని చెప్పింది. అయితే టాప్ ర్యాంకుమీదే ఎక్కువగా ఆలోచించనని, ప్రస్తుతానికి ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యమని తెలిపింది. ఒకదాని తర్వాత ఒకటి సాధించేందుకు, సాకారం చేసుకునేందుకు శ్రమిస్తానని వివరించింది. ‘ఇప్పుడు నేను చైనా ఓపెన్‌పైనే దృష్టి పెట్టాను. ఆ తర్వాత కొరియా ఓపెన్‌లో ఆడతాను’ అని పేర్కొంది. చైనీస్ ఈవెంట్ ఈ నెల 17 నుంచి మొదలవుతుంది. ఆ వెంటనే 24 నుంచి కొరియా ఓపెన్ జరుగుతుంది. సైనా, తన తర్వాత ఈ స్థాయి క్రీడాకారిణి వెలుగులోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆమె విశ్లేషించింది. జూనియర్లు బాగానే ఆడుతున్నప్పటికీ తమలా రాటుదేలడం అంత సులభం కాదని తెలిపింది. పద్మ భూషణ్’కు సింధు! అంతర్జాతీయ క్రీడల్లో అతివల సత్తాకు ‘పద్మ’లతో పట్టం కట్టేందుకు క్రీడాశాఖ సిద్ధమైంది. పౌరపురస్కారాల కోసం తొమ్మిది మంది క్రీడాకారిణుల పేర్లను కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ జాబితాలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్, తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు కూడా ఉంది. మెగా ఈవెంట్లలో విశేషంగా రాణిస్తున్న స్టార్ షట్లర్‌ను భారత మూడో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మ భూషణ్’కు సిఫారసు చేసింది. రెండేళ్ల క్రితమే సింధు పేరును ఆ అవార్డు కోసం ప్రతిపాదించినా అప్పుడు దక్కలేదు. ఈసారి ఆ పుర స్కారం అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఆమె ‘పద్మశ్రీ’ (2015) అందుకుంది. మణిపూర్ మాణిక్యం, ఆరుసార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ అయిన ఎమ్.సి. మేరీకోమ్ కీర్తికిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరే అవకాశాలున్నాయి. రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’కు మేరీ పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఇదివరకే ఆమె 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డుల్ని అందుకుంది. ఆమె ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు కూడా. మిగతా ఏడుగురు క్రీడాకారిణులను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేసింది. వీరిలో యువ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా శిరూర్, పర్వతారోహకులైన కవల సోదరిలు తషి, నుంగ్షి మలిక్ ఉన్నారు. అనంతరం ఈ జాబితాలో ఇద్దరు పురుషులు ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌తో పాటు అలనాటి హాకీ ఆటగాడు గణేశ్‌లను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేశారు. అయితే వీరిద్దరి పేర్లకు క్రీడా శాఖ మంత్రి కిరిణ్ రిజిజు ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. -
ఆటల్లో రాష్ట్రం అగ్రస్థానం సాధించాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా తగిన ప్రణాళికలను రూపొందించాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా, సాహిత్య అకాడమీలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న క్రీడా మైదానాల నిర్మాణ పనులు, ప్రస్తుతం ఉన్న మైదానాల స్థితిగతులు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా క్రీడా శాఖ ప్రణాళికలను రూపొందించాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని కోరారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న పాత క్రీడా మైదానాల స్థితిగతులపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎల్బీస్టేడియంపై నివేదిక సమర్పించండి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్లైట్స్ టవర్స్ యొక్క నాణ్యతపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాలివానకు కూలిపోయిన టవర్, గ్యాలరీ పైకప్పు స్థితిగతులపై సమగ్ర నివేదికను కోరారు. స్టేడియంలో ఉన్న మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్, టూరిజం కమిషనర్ దినకర్ బాబు, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, టూరిజం కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చ... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్చించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం, సాంస్కతికశాఖ సారథ్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులపాటు కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. జూన్ 2న కవి సమ్మేళనం, జూన్ 3న సాంస్కృతిక, జూన్ 4న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు చెప్పారు. సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరుపై ఆరా తీశారు. -
ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్ రాథోడ్
క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు అందించడంతో పాటు వారికి తగిన గౌరవం కూడా దక్కేలా చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని కేంద్ర క్రీడల కొత్త మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేవారి కోసం ‘సమ్మాన్ అవుర్ సువిధా’ అనే మంత్రంతో తాము పని చేస్తామని ఆయన చెప్పారు. ఒకప్పుడు తాను ఇదే క్రీడా శాఖ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు అనుమతుల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని... భవిష్యత్తులో ఆటగాళ్లకు అలాంటి సమస్య ఎప్పటికీ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా రాథోడ్ స్పష్టం చేశారు. -
పీసీఐపై వేటు
సస్పెన్షన్ విధించిన ఐపీసీ న్యూఢిల్లీ: గజియాబాద్ ఉదంతం నేపథ్యంలో భారత ప్యారా అథ్లెటిక్ కమిటీ (పీసీఐ)పై అంతర్జాతీయ ప్యారా అథ్లెటిక్ కమిటీ (ఐపీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈనెల 15న పీసీఐకి మెయిల్ ద్వారా లేఖను పంపింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది స్పష్టం చేయలేదు. ‘గత కొన్నేళ్ల నుంచి పీసీఐలో పరిస్థితి అసలు బాగాలేదు. జాతీయ స్థాయిలో వ్యక్తులు, గ్రూప్‌ల మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు’ అని ఐపీసీ సీఈఓ జేవియర్ గోంజాలెజ్ పేర్కొన్నారు. పీసీఐపై సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. ఐపీసీ తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రమైందని పీసీఐ సెక్రటరీ జనరల్ జె.చంద్రశేఖర్ వెల్లడించారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ సభ్యుడు రాజీవ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. గత నెలలో గజియాబాద్‌లో జరిగిన ప్యారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు కోసం వచ్చిన అథ్లెట్లకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సగం నిర్మాణం పూర్తయిన రెండు బిల్డింగ్‌ల్లో నిర్వాహకులు బస ఏర్పాటు చేయడంతో ప్యారా అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సరైన టాయిలెట్స్, తాగడానికి మంచి నీటిని కూడా ఏర్పాటు చేయలేదు. సరైన పరుపులు కూడా లేకపోవడంతో చాలా మంది నేలపైనే పడుకున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందడంతో తాజాగా క్రీడాశాఖ చంద్రశేఖర్, తోమర్‌లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. -
75 వేల మంది చిన్నారులను గుర్తిస్తాం
క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర క్రీడా శాఖ ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీంట్లో భాగంగా ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకం’ను ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా 75 వేల మంది చిన్నారులను గుర్తిస్తామని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. ‘వ్యక్తిగత క్రీడా విభాగాల్లో భారత్‌కు మంచి పేరే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నాం. 8 నుంచి 12 ఏళ్లలోపు నైపుణ్యం కలిగిన 75 వేల మంది బాలబాలికలను మేం గుర్తించనున్నాం. అలాగే వచ్చే ఐదు, ఏడేళ్లలో ప్రతీ జిల్లా కూడా స్పోర్ట్స్ స్కూల్ కలిగి ఉంటుంది. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్‌పై దృష్టి పెట్టేందుకు ప్రతీ జోన్లో విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేస్తాం’ అని మూడు రోజుల పాటు జరిగే భారత అంతర్జాతీయ స్పోర్టింగ్ గూడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సోనోవాల్ తెలిపారు.