ఓ ఖాళీ ఉంచా | PV Sindhu for Padma Bhushan in All Women Sports Ministry List | Sakshi
Sakshi News home page

ఓ ఖాళీ ఉంచా

Published Fri, Sep 13 2019 2:21 AM | Last Updated on Fri, Sep 13 2019 2:21 AM

PV Sindhu for Padma Bhushan in All Women Sports Ministry List - Sakshi

న్యూఢిల్లీ: తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయంతో తనపై ఉన్న సిల్వర్‌ స్టార్‌ (రజత విజేత) ఇమేజ్‌ను చెరిపేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు ఇపుడు ఒలింపిక్‌ స్వర్ణంపై కన్నేసింది. తన పతకాల అల్మారాలో ఓ ఖాళీ ఉంచానని... దాన్ని ఒలింపిక్స్‌ బంగారంతోనే భర్తీ చేస్తానని ధీమాగా చెబుతోంది. 24 ఏళ్ల బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్‌ స్వర్ణంతో ఫైనల్‌ పరాజయాలకు ముగింపు పలికాను. ఇప్పటివరకు క్రీడాభిమానులంతా నా ఫైనల్‌ ఫోబియా గురించే చర్చించుకునేవారు. ఇప్పుడు వారందరికి నా రాకెట్‌తోనే సమాధానమిచ్చా. ఫైనల్‌ ఒత్తిడిని ఎలా అధిగమిస్తానో ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయంతో నిరూపించా. ఇవన్నీ సాధించినప్పటికీ ఒలింపిక్స్‌ అనేది పూర్తిగా భిన్నమైన అనుభూతినిచ్చేది. రియో, ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఈవెంట్లు నాకు విభిన్నమైన మధుర జ్ఞాపకాలిచ్చాయి.

అయితే ఇప్పటికీ ఓ స్వర్ణం వెలితి ఉంది. దీన్ని టోక్యో ఒలింపిక్స్‌లో సాకారం చేసుకుంటా. దీనికోసం కఠోరంగా శ్రమిస్తా’ అని తెలిపింది. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు వస్తే మంచిదేనని... దాంతో టోర్నీ డ్రాలకు మేలవుతుందని చెప్పింది. అయితే టాప్‌ ర్యాంకుమీదే ఎక్కువగా ఆలోచించనని, ప్రస్తుతానికి ఒలింపిక్స్‌ స్వర్ణమే తన లక్ష్యమని తెలిపింది. ఒకదాని తర్వాత ఒకటి సాధించేందుకు, సాకారం చేసుకునేందుకు శ్రమిస్తానని వివరించింది. ‘ఇప్పుడు నేను చైనా ఓపెన్‌పైనే దృష్టి పెట్టాను. ఆ తర్వాత కొరియా ఓపెన్‌లో ఆడతాను’ అని పేర్కొంది. చైనీస్‌ ఈవెంట్‌ ఈ నెల 17 నుంచి మొదలవుతుంది. ఆ వెంటనే 24 నుంచి కొరియా ఓపెన్‌ జరుగుతుంది. సైనా, తన తర్వాత ఈ స్థాయి క్రీడాకారిణి వెలుగులోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆమె విశ్లేషించింది. జూనియర్లు బాగానే ఆడుతున్నప్పటికీ తమలా రాటుదేలడం అంత సులభం కాదని తెలిపింది.

పద్మ భూషణ్‌’కు సింధు!
అంతర్జాతీయ క్రీడల్లో అతివల సత్తాకు ‘పద్మ’లతో పట్టం కట్టేందుకు క్రీడాశాఖ సిద్ధమైంది. పౌరపురస్కారాల కోసం తొమ్మిది మంది క్రీడాకారిణుల పేర్లను కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ జాబితాలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్, తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు కూడా ఉంది. మెగా ఈవెంట్లలో విశేషంగా రాణిస్తున్న స్టార్‌ షట్లర్‌ను భారత మూడో అత్యున్నత  పౌరపురస్కారమైన ‘పద్మ భూషణ్‌’కు సిఫారసు చేసింది. రెండేళ్ల క్రితమే సింధు పేరును ఆ అవార్డు కోసం ప్రతిపాదించినా అప్పుడు దక్కలేదు. ఈసారి ఆ పుర స్కారం అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఆమె ‘పద్మశ్రీ’ (2015) అందుకుంది. మణిపూర్‌ మాణిక్యం, ఆరుసార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ అయిన ఎమ్‌.సి. మేరీకోమ్‌ కీర్తికిరీటంలో మరో అత్యున్నత పురస్కారం చేరే అవకాశాలున్నాయి.

రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’కు మేరీ పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఇదివరకే ఆమె 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డుల్ని అందుకుంది. ఆమె ప్రస్తుతం పార్లమెంట్‌  సభ్యురాలు కూడా. మిగతా ఏడుగురు క్రీడాకారిణులను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేసింది. వీరిలో యువ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనిక బాత్రా, క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్, మాజీ షూటర్‌ సుమా శిరూర్, పర్వతారోహకులైన కవల సోదరిలు తషి, నుంగ్‌షి మలిక్‌ ఉన్నారు. అనంతరం ఈ జాబితాలో ఇద్దరు పురుషులు ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌తో పాటు అలనాటి హాకీ ఆటగాడు గణేశ్‌లను ‘పద్మశ్రీ’ కోసం సిఫార్సు చేశారు. అయితే వీరిద్దరి పేర్లకు క్రీడా శాఖ మంత్రి కిరిణ్‌ రిజిజు ఇంకా ఆమోద ముద్ర వేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement