
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు.
గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు.
పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం
మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment