National Service Scheme
-
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
National Service Scheme 2021: గ్రామాల దత్తత: సేవాధీరలు
ఈ నెల 24వ తేదీ, జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం. మన దేశరాజధాని నగరంలోని రాష్ట్రపతి భవనం 2020–21జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి వేదికైంది. విశిష్ట సేవలందించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆనంద తరుణం. ఆ సంతోషంలో మన తెలుగు మహిళలు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం అమ్మాయి సిరిశ్రీ దేవనపల్లి. మరొకరు తెలంగాణ రాష్ట్రం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి. దేవనపల్లి సిరిశ్రీ సొంతూరు సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) కదిరి. నాన్న పద్మనాభ రెడ్డి ఎల్ఐసీలో హైయ్యర్‌గ్రేడ్ అసిస్టెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ అమరావతి గృహిణి. తమ్ముడు నిఖిల్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిరి శ్రీ విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేది. తాను పొల్గొన్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఎస్ఆర్ఐటీ కళాశాలలో నిత్యం జాతీయ సేవా పథకంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. రక్తదానం, మొక్కలు నాటడం, పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమాలు చాలా నిర్వహించాం. రోటరీపురం వద్ద రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించాం. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి పంపాం. డేటా సేకరించి నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వివరించి వారికి అవగాహన కల్పించాం. కాలేజీలో శారో హుండీ మా ఎస్ఆర్ఐటీ కళాశాలలో ‘శారో (సేవ్ ఏ రూపీ ఆర్గనైజేషన్)’ పేరుతో ప్రతి బ్లాక్‌లోనూ హుండీ ఏర్పాటు చేశారు. విద్యార్థులం స్వచ్ఛందంగా ఇందులోకి నగదు జమ చేసేవాళ్లం. ఆరు నెలలకోసారి ఈ మొత్తంతో అనాథ, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. ఈ విధానం నచ్చడంతో జాతీయ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితమయ్యాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చిన్నపుల్లయ్య సార్ మాకు ఎంతో తోడ్పాటు అందించారు. జాతీయ సేవా పథకంలో పని చేయడం వల్ల సేవాభావం మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా 2019లో గుజరాత్లో జరిగిన ప్రీ–రిపబ్లిక్ పరేడ్ క్యాంప్‌కు ఎంపికయ్యాను. 2020 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడాన్ని జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. ఇంతకు మించి గొప్ప ఘనత నా జీవితంలో ఉండదేమో! మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సిరి శ్రీ దేవనపల్లి. – బడ శ్రీనివాస రెడ్డి, సాక్షి, అనంతపురం లీడర్షిప్ మాత్రమే ‘‘మాది హన్మకొండ. ఇంటర్ హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కాకతీయ యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ చేసి, 2007లో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో అప్పటి ప్రిన్సిపాల్ నన్ను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నియమించారు. నాకు విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్తో పరిచయం లేదు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నా టీమ్‌లోని వాలంటీర్ల సామాజిక సేవాపథం, వారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తీరు నన్ను స్ఫూర్తిమంతం చేశాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కుమ్మరిగూడెంలో ప్రత్యేక శిబిరం పెట్టి మొక్కలు నాటాం. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్య కల్పన కు కృషి చేశాం. అలా 2012వరకు నాలుగేళ్లపాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కొనసాగాను. కో ఆర్డినేటర్‌గా... కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా 2017లో అప్పటి వీసీ ఆచార్య ఆర్ సాయన్న నియమించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా ఒక మహిళకు అవకాశం రావడం అదే తొలిసారి. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు 36 వేలమంది వాలంటీర్లతో పనిచేశాను. హరితహారంలో మొక్కలు నాటాం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాం. రక్తదానం శిబిరాల్లో 25 వేలమంది వాలంటీర్లు, లక్షా 18వేల యూనిట్ల రక్తదానం చేశారు. 975 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాం. గుప్పెడు బియ్యం (కప్ ఆఫ్ రైస్) పేరున ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి, నిరుపేదలకు, అనాథలకు పంపిణీ, జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటì సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం, శ్రమదానం చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు క్యాంపస్‌లో ఉన్న చెక్ డ్యామ్‌లకు మరమ్మతులు కూడా చేశాం. మేడారం జాతరలో భక్తులకు సేవలందించడం, ఎన్నికల సమయాల్లో పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లకు సేవలందించడంలోనూ మా కార్యకర్తలు ముందుండేవాళ్లు. కోవిడ్ సమయంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశాం. ఇన్ని సేవల నేపథ్యంలో అందిన ఈ గౌరవం మధురానుభూతిగా మిగులుతుంది’’ అన్నారు సుంకరి జ్యోతి. – డి. రమేశ్, సాక్షి, హన్మకొండ -
యువత.. సమాజానికి చేయూత
జాతీయ సేవాపథకం పేరుతో గ్రామాల్లో సేవాకార్యక్రమాలు లక్ష్మణచాంద : వారంతా డిగ్రీ విద్యార్థులు నిత్యం పుస్తకాలతో కూస్తీపడుతూ కళాశాలకు వెళ్లడం వారి నిత్య పని.కాని గత మూడు రోజులుగా మండలంలోని చింతల్‌చాంద గ్రామంలో విద్యార్థులు అనేక రకాల పనులు చేస్తూ వీరు విద్యార్థులేనా అనే సందేహం కలిగేలాగా పని చేస్తున్నారు.వారే మండల కేంద్రానికి చెందిన ఎస్వీజీ డిగ్రీ కళాశాలకు చెందిన జాతీయ సేవాపథకం వాలింటీర్లు .మా కోసం కాదు మీ కోసం అనే నినాదంతో నెలకొల్పిన కార్యక్రమం జాతీయ సేవాపథకం. ఇందులో విద్యార్థులకు విధ్యతో పాటుగా సమాజం పట్ల ,ప్రజల పట్ల సమాజసేవ పట్ల విద్యార్థులు భాగస్వాములు చేయాలనే గొప్ప సంకల్పంతో ఆనాటి భారత ప్రధాని జాతీయ సేవా పథకం అనే ఒక కార్యక్రమంను రూపొందించారు. అలా ఏర్పడిన జాతీయ సేవా పథకం భారతదేశంలో అనేక కార్ర్యక్రమాలలో పాలుపంచుకొంటు తమకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది.అందులో భాగంగానే మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతీ సంవత్సరం మండలంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ 7రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతూ గ్రామంలోని పౌరులను చైతన్యం చేయడంతో తమవంతూగా కృషి చేస్తుంది. ఈ సంవత్సరం చింతల్‌చాందలో ప్రతీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం మండలం లోని చింతల్‌చాంద గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. గ్రామంలో ప్రజలను చైతన్యం చేయడం మండలం లోని చింతల్‌చాందలో జాతీయ సేవా పథకం ద్వా రా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంకు అదికారుల వద్దకు తీసుకెళ్లి వాటి పరిష్కారంకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే చింత్‌చాందలో వాలింటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకొని నమోదు చేసుకుంటారు. మూడో రోజు కొనసాగిన కార్యక్రమం మూడో రోజు వాలింటీర్లు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను,గ్రామంలోని మురికి నీటి కాలువలను శుభ్రం చేశారు. -
ఎన్.ఎస్.ఎస్.. నాలోనూ.. సేవా స్ఫూర్తి
మంచిర్యాల టౌన్ : ఎన్ఎస్ఎస్.. నేషనల్ సర్వీస్ స్కీమ్(జాతీయ సేవా సమితి) దీనిని విద్యార్థులు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఁనాలోనూ సేవా స్ఫూర్తి* ఉందంటూ నిరూపిస్తున్నారు. కళాశాలలో అందివచ్చిన ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. సమాజానికి ఉపయోగపడున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. వివిధ స్థానిక సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు. మంచిర్యాలలో.. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభాగం అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును చాటుకుంటుంది. ఎయిడ్స్ డే, పల్స్‌పోలియో, రక్తదాన శిబిరాల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొంటూ తమవంతు పాత్రను పోషిస్తున్నారు. కళాశాలలో 1956లో జాతీయ సేవా సమితి ప్రారంభమైంది. 1980లో రెండు యూనిట్లుగా ఏర్పడి వివిధ కార్యక్రమాలను విస్తృతం చేస్తుంది. సేవా కార్యక్రమాలతో పాటు స్థానిక, జాతీయస్థాయి శిబిరాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. మంచిర్యాలలో ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలతో పాటు 7 ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ కొనసాగుతోంది. నాట్ మీ బట్ యు ‘నాట్ మీ బట్ యు’ అనే నినాదంతో శిబిరాలు నిర్వహిస్తూ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అనే నానుడిని మంచిర్యాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సాకారం చేస్తున్నారు. పల్లెల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తు గ్రామ సమస్యల పై నిర్ధిష్టమైన కార్యచరణతో సేవలందిస్తున్నారు. పథకాల అమలుతీరు, రేషన్‌కార్డుల పంపిణీ, రోడ్ల నిర్మాణం, పచ్చదనం పరిశుభ్రత, అక్షరాస్యత, పల్స్‌పోలియో, ఎయిడ్స్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వీధి నాటకాల ద్వారా గ్రామస్థుల్లో చైతన్యం తీసుకోస్తున్నారు. ఎన్ఎస్ఎస్తో గౌరవం ఎన్ఎస్ఎస్ ద్వారా సేవ చేయడం ఎంతో గౌరవం. కళాశాలలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాలోనూ సేవాభావం ఉందని చాటుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. నేడు విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు సేవా భావాన్ని పెంపొందించడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యార్థుల్లో చైతన్యం నింపాలి.