75 వేల మంది చిన్నారులను గుర్తిస్తాం
క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్
న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర క్రీడా శాఖ ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీంట్లో భాగంగా ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకం’ను ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా 75 వేల మంది చిన్నారులను గుర్తిస్తామని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు.
‘వ్యక్తిగత క్రీడా విభాగాల్లో భారత్‌కు మంచి పేరే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నాం. 8 నుంచి 12 ఏళ్లలోపు నైపుణ్యం కలిగిన 75 వేల మంది బాలబాలికలను మేం గుర్తించనున్నాం. అలాగే వచ్చే ఐదు, ఏడేళ్లలో ప్రతీ జిల్లా కూడా స్పోర్ట్స్ స్కూల్ కలిగి ఉంటుంది. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్‌పై దృష్టి పెట్టేందుకు ప్రతీ జోన్‌లో విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేస్తాం’ అని మూడు రోజుల పాటు జరిగే భారత అంతర్జాతీయ స్పోర్టింగ్ గూడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సోనోవాల్ తెలిపారు.