ఆటల్లో రాష్ట్రం అగ్రస్థానం సాధించాలి | Srinivas Goud Comments That State must play the top in the games | Sakshi
Sakshi News home page

ఆటల్లో రాష్ట్రం అగ్రస్థానం సాధించాలి

Published Tue, May 28 2019 2:38 AM | Last Updated on Tue, May 28 2019 2:38 AM

Srinivas Goud Comments That State must play the top in the games - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా తగిన ప్రణాళికలను రూపొందించాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా, సాహిత్య అకాడమీలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న క్రీడా మైదానాల నిర్మాణ పనులు, ప్రస్తుతం ఉన్న మైదానాల స్థితిగతులు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా క్రీడా శాఖ ప్రణాళికలను రూపొందించాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని కోరారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న పాత క్రీడా మైదానాల స్థితిగతులపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు.  

ఎల్బీస్టేడియంపై నివేదిక సమర్పించండి 
ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్స్‌ టవర్స్‌ యొక్క నాణ్యతపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాలివానకు కూలిపోయిన టవర్, గ్యాలరీ పైకప్పు స్థితిగతులపై సమగ్ర నివేదికను కోరారు. స్టేడియంలో ఉన్న మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్, టూరిజం కమిషనర్‌ దినకర్‌ బాబు, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, టూరిజం కార్యదర్శి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చర్చించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం, సాంస్కతికశాఖ సారథ్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులపాటు కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. జూన్‌ 2న కవి సమ్మేళనం, జూన్‌ 3న సాంస్కృతిక, జూన్‌ 4న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు చెప్పారు. సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరుపై ఆరా తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement