
75 ఏళ్లు దాటినవారు పదవులనుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు
కేంద్రంలో మళ్లీ ఏర్పడేవి సంకీర్ణ ప్రభుత్వాలే.. మనమే కీలకం
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే వరంగల్‌లో భారీసభ
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలం కావడంతోపాటు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారు అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఆ పారీ్టలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయి.
సంకీర్ణ రాజకీయాల్లో మనం కీలకంగా మారుతాం’అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 20 మంది ముఖ్య నేతలతో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపైనా కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు తగినంత సమయం ఇచ్చాం
‘రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు వందశాతం ప్రభుత్వ పనితీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నరగా తగినంత సమయం ఇచ్చాం. ప్రభుత్వాన్ని ఎండగట్టి, హామీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగసభ నిర్వహించడమే సరైన మార్గం.
అందుకే వరంగల్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాలి. తెలంగాణ సోయి మనకు ఉన్నా ఏమరుపాటుతనంతోనే ఓటమి పాలయ్యాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ప్రజలకు చేరువయ్యేందుకు మనం కృషి చేయాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
రజతోత్సవ సభ కేంద్రంగా దిశానిర్దేశం
వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా జనం, వాహనాల సమీకరణపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం.
బుధవారం నుంచి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో బహిరంగసభ సన్నాహాలపై కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షిస్తారు. బుధవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతల సమావేశం జరుగుతుంది. కేసీఆర్ వరుస సమీక్షల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభ సన్నాహక సమావేశాలు రద్దయ్యే అవకాశమున్నట్టు తెలిసింది.
బహిరంగసభ తర్వాతే సంస్థాగత నిర్మాణం
వరంగల్ సభ నిర్వహణ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీనేత గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూలు విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.