srinivas gowd
-
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
జడ్జి జయకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్,రాష్ట్ర ఎన్నికల సంఘం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌పై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తర్వుల విషయంలో ఆయన అనుసరించాల్సిన విధానాలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆయన పదవిలో ఉంటే నిష్పక్షపాతంగా విచారణ సాగేందుకు ఆటంకం కలుగుతుందని సస్పెండ్ చేస్తూ..ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు..విచారణ పూర్తిగా ముగిసే దాకా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని జడ్జిని ఆదేశించింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు. నామినేషన్తోపాటే అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే తర్వాత ఆ అఫిడవిట్‌ను సవరించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి జయకుమార్..ఎన్నికల అధికారులు, మంత్రి, రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను జూలై 31న ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా పోలీసులు అధికారులు, మంత్రిపై కేసు నమోదు చేయలేయడం లేదని పిటిషనర్ రాఘవేంద్రరాజు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగస్టు 11న విచారణ చేపట్టిన జడ్జి.. సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేసి, రాత పూర్వకంగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. పోలీసులు మంత్రితోపాటు ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో మార్పులకు సీఈసీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి తన పరిధి దాటి వ్యవహరించారని.. విచారణ జరపాలని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్రశర్మ తెలంగాణ హైకోర్టుకు వినతిపత్రం సమర్పించారు. ఈ మొత్తం అంశంపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విచారణ చేపట్టి.. నివేదిక అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ప్రైవేట్ దావా వేసినప్పుడు.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే, పిటిషనర్ వాంగ్మూలం తీసుకోకుండానే, సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు చేయాలని జడ్జి ఆదేశా>లు జారీ చేశారు. విధి నిర్వహణలో లోపాలున్నాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వినతిపత్రం, రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఆధారంగా జడ్జిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. తక్షణం విధుల నుంచి తప్పుకుని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, 15 అదనపు చీఫ్ జడ్జి(సిటీ సివిల్ కోర్టు)కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. -
సర్వాయి పాపన్న పోరాటం గొప్పది
సిరిసిల్ల టౌన్: బీఆర్ఎస్ అన్ని కులాలు, వర్గాల బాధలు ఎరిగి..వారిని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించే పేదల సర్కారు అని మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çఆ రోజుల్లో పాపన్న ఆత్మగౌరవ పోరాటం చేశారని గుర్తు చేశారు. పదిమంది సైన్యంతో మొదలైన పాపన్న పోరాటం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసే వరకు సాగిందన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ పోరాటాన్ని కొద్దిమందితో ప్రారంభించి ఇప్పుడు అదే గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తున్నారని చెప్పారు. ఐఐటీ ముంబై ఆధ్వర్యంలో గౌడ్లకు సేఫ్టీ మోకులు అందిస్తామని తెలిపారు. నీరా సెంటర్లు జిల్లాలు, మండల కేంద్రాల వరకు విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ, పాపికొండలకు దీటుగా సిరిసిల్ల మానేరు పరీవాహక ప్రాంతాలు మారాయన్నారు. సిరిసిల్ల శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో 120 మంది సామర్థ్యం గల బోటును ప్రారంభించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గౌడ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్దన్‌గౌడ్, కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బహుజనులపై జరిగే కుట్రలను తిప్పికొడతాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రంలో కొందరు ప్రతిపక్ష నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బహుజనులను అణచివేసే కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహుజనులు కష్టపడి ఎదిగితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారిపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై రూ. 3 కోట్లతో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ బహుజన మహనీయులపై పరిశోధనలు చేసి వారి చరిత్రను విద్యావంతులు ప్రచారం చేయాలని సూచించారు. అంతకుముందు పాపన్నగౌడ్ జీవితచర్రితపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌడ కార్పొరేషన్ చై ర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, స్పోర్ట్స్ అ థారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ
కుత్బుల్లాపూర్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపగా... తాజాగా పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్‌తో సెల్ఫీ మరో వివాదం అయింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్లీనరీలో రవి పాల్గొనడం.. పోలీసు అధికారులతో సెల్ఫీ దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రజాప్రతినిధులకే ఆహ్వానం ఉండగా మున్నూరు రవి హాజరు కావడంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ దృష్టి పెట్టింది. ఇదే ప్లీనరీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం ఉండడం అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బందో బస్తులో ఉన్న తాను మున్నూరు రవిని గుర్తించి దగ్గరికి వెళ్లి ఎలా వచ్చావు ..అని అడిగే లోపే సెల్ఫీ తీశాడని.. రవి వచ్చిన విషయాన్ని బాలానగర్ డీసీపీ సందీప్ దృష్టికి తీసుకెళ్లానని సీఐ రమేష్ వివరణ ఇచ్చారు. (చదవండి: అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..) -
గ్రేటర్ పోరు: శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. నామినేషన్ తిరస్కరణపై నిన్న గాజుల రామారం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో శనివారం రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాసేపట్లో ఎస్ఈసీతో కూన శ్రీనివాస్‌గౌడ్ భేటీకానున్నారు. -
ఆటల్లో రాష్ట్రం అగ్రస్థానం సాధించాలి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా తగిన ప్రణాళికలను రూపొందించాలని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో సాంస్కృతిక, క్రీడా, సాహిత్య అకాడమీలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న క్రీడా మైదానాల నిర్మాణ పనులు, ప్రస్తుతం ఉన్న మైదానాల స్థితిగతులు, మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా క్రీడా శాఖ ప్రణాళికలను రూపొందించాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని కోరారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న పాత క్రీడా మైదానాల స్థితిగతులపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎల్బీస్టేడియంపై నివేదిక సమర్పించండి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్లైట్స్ టవర్స్ యొక్క నాణ్యతపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాలివానకు కూలిపోయిన టవర్, గ్యాలరీ పైకప్పు స్థితిగతులపై సమగ్ర నివేదికను కోరారు. స్టేడియంలో ఉన్న మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్, టూరిజం కమిషనర్ దినకర్ బాబు, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, టూరిజం కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చ... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్చించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం, సాంస్కతికశాఖ సారథ్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులపాటు కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. జూన్ 2న కవి సమ్మేళనం, జూన్ 3న సాంస్కృతిక, జూన్ 4న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు చెప్పారు. సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరుపై ఆరా తీశారు. -
సారూ.. ఇది డైనోసారూ...
పెద్దఅంబర్‌పేట: దేశంలోనే మొట్టమొదటి డైనోసార్ పార్కుకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామం వేదికైంది. ‘డైనో వరల్డ్’పేరుతో వినూత్నంగా వివిధ రకాల డైనోసార్ బొమ్మలను ఇక్కడ తీర్చిదిద్దారు. బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్కులోని డైనోసార్ బొమ్మలను పరిశీలించి వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన డైనో వరల్డ్ ఎంతో బాగుందని కితాబిచ్చారు. పార్కుకు పర్యాటకశాఖ నుంచి ప్రత్యేక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకశాఖ వెబ్సైట్లో పార్కు వివరాలను పొందుపరుస్తామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డైనో పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ నాలుగు ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారని, ఇదే తరహాలోనే మరో పార్కును మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఆసక్తి కనబరిస్తే స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కును కొనసాగించాలని సూచించారు. వినోదం, విజ్ఞానం అందించాలనే.. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో వినూత్నంగా పార్కును తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు సుశాంక్, ప్రశాంత్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు పార్కులోకి అనుమతిస్తామని, ప్రవేశ రుసుం రూ. 300 అని చెప్పారు. త్వరలోనే రిసార్ట్స్, మల్టీథీమ్ పార్కును ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
50 చారిత్రక ప్రాంతాల అభివృద్ధి
నాగార్జునసాగర్: బౌద్ధమతవ్యాప్తికి తోడ్పడిన తెలంగాణలోని నాగార్జునసాగర్ తీరాన ప్రపంచ బౌద్ధమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుద్ధజయంతిని పురస్కరించుకుని శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలో గల మహాçస్తూప ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల శిక్షణకార్యక్రమం సందర్భంగా శ్రీపర్వతారామాన్ని సందర్శించారని, ఆయన అప్పటికప్పుడు రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం మరో 50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మరో వందకోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చి రాష్ట్రంలోని 50 చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన శ్రీలంకవాసులు ఏర్పాటు చేసిన బుద్ధుని పాదాల చెంత పుష్పగుఛ్చాలు ఉంచారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక పార్లమెంటు సభ్యుడు వెన్.అతురల్యేరతన్‌తెరో, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
సెక్షన్-8 ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
టీజీవో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్-8ని ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అమలు చేయాలని కోరడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడులు సృష్టించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గెజిటెడ్ భవన్లో బుధవారం టీజీవో ఆధ్వర్యంలో సెక్షన్-8 అంశంపై టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హరగోపాల్ ముఖ్యఅతిథి హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అలజడులులేని సమయంలో సెక్షన్-8 అమలేమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్షన్-8 అమలు జరిగితే శాంతియుతంగా ఉద్యమించాలని సూచించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా సెక్షన్-8ను ప్రయోగిస్తే దీటుగా ఎదుర్కొంటామన్నారు. అవసరమైతే ఢిల్లీని ముట్టడించి కేంద్రాన్ని నిలదీస్తామని, బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో సంఘం గౌరవ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకోవడానికి సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలసి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, ఇంజనీర్స్ జేఏసీ నేత వెంకటేశం, పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత భూమన్న, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, హెచ్ఏఎల్ ఉద్యోగుల సంఘం నేత సి.రాందాస్, వీఆర్వోల సంఘం నేత గోల్కొండ సతీష్, టీఆర్టీయూ నేత సర్వోత్తమరెడ్డి, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం నేత దానకర్ణచారి, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, తెలంగాణ నర్సుల అసోసియేషన్ నాయకురాలు సరళ, టీజీవోలు సలీముద్దీన్, డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.