సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్,రాష్ట్ర ఎన్నికల సంఘం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌పై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తర్వుల విషయంలో ఆయన అనుసరించాల్సిన విధానాలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆయన పదవిలో ఉంటే నిష్పక్షపాతంగా విచారణ సాగేందుకు ఆటంకం కలుగుతుందని సస్పెండ్ చేస్తూ..ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు..విచారణ పూర్తిగా ముగిసే దాకా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని జడ్జిని ఆదేశించింది.
2018, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు. నామినేషన్‌తోపాటే అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే తర్వాత ఆ అఫిడవిట్‌ను సవరించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి జయకుమార్..ఎన్నికల అధికారులు, మంత్రి, రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను జూలై 31న ఆదేశించారు.
అయితే కోర్టు ఆదేశించినా పోలీసులు అధికారులు, మంత్రిపై కేసు నమోదు చేయలేయడం లేదని పిటిషనర్ రాఘవేంద్రరాజు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగస్టు 11న విచారణ చేపట్టిన జడ్జి.. సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేసి, రాత పూర్వకంగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. పోలీసులు మంత్రితోపాటు ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల అఫిడవిట్‌లో మార్పులకు సీఈసీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి తన పరిధి దాటి వ్యవహరించారని.. విచారణ జరపాలని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్రశర్మ తెలంగాణ హైకోర్టుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ మొత్తం అంశంపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విచారణ చేపట్టి.. నివేదిక అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ప్రైవేట్ దావా వేసినప్పుడు.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే, పిటిషనర్ వాంగ్మూలం తీసుకోకుండానే, సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు చేయాలని జడ్జి ఆదేశా>లు జారీ చేశారు. విధి నిర్వహణలో లోపాలున్నాయని చెప్పారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ వినతిపత్రం, రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఆధారంగా జడ్జిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. తక్షణం విధుల నుంచి తప్పుకుని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, 15 అదనపు చీఫ్ జడ్జి(సిటీ సివిల్ కోర్టు)కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.
జడ్జి జయకుమార్ సస్పెన్షన్
Published Thu, Aug 24 2023 4:42 AM | Last Updated on Thu, Aug 24 2023 4:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment