సారూ.. ఇది డైనోసారూ... | DinoWorld in Telangana | Sakshi
Sakshi News home page

సారూ.. ఇది డైనోసారూ...

Published Thu, May 23 2019 2:13 AM | Last Updated on Thu, May 23 2019 2:13 AM

DinoWorld in Telangana  - Sakshi

డైనోసార్‌ బొమ్మలను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పెద్దఅంబర్‌పేట: దేశంలోనే మొట్టమొదటి డైనోసార్‌ పార్కుకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బండరావిరాల గ్రామం వేదికైంది. ‘డైనో వరల్డ్‌’పేరుతో వినూత్నంగా వివిధ రకాల డైనోసార్‌ బొమ్మలను ఇక్కడ తీర్చిదిద్దారు. బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్కులోని డైనోసార్‌ బొమ్మలను పరిశీలించి వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన డైనో వరల్డ్‌ ఎంతో బాగుందని కితాబిచ్చారు.

పార్కుకు పర్యాటకశాఖ నుంచి ప్రత్యేక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో పార్కు వివరాలను పొందుపరుస్తామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డైనో పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ నాలుగు ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారని, ఇదే తరహాలోనే మరో పార్కును మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఆసక్తి కనబరిస్తే స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కును కొనసాగించాలని సూచించారు.  

వినోదం, విజ్ఞానం అందించాలనే.. 
చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో వినూత్నంగా పార్కును తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు సుశాంక్, ప్రశాంత్‌ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు పార్కులోకి అనుమతిస్తామని, ప్రవేశ రుసుం రూ. 300 అని చెప్పారు. త్వరలోనే రిసార్ట్స్, మల్టీథీమ్‌ పార్కును ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు క్యామ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement