పీసీఐపై వేటు
సస్పెన్షన్ విధించిన ఐపీసీ
న్యూఢిల్లీ: గజియాబాద్ ఉదంతం నేపథ్యంలో భారత ప్యారా అథ్లెటిక్ కమిటీ (పీసీఐ)పై అంతర్జాతీయ ప్యారా అథ్లెటిక్ కమిటీ (ఐపీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈనెల 15న పీసీఐకి మెయిల్ ద్వారా లేఖను పంపింది.
అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది స్పష్టం చేయలేదు. ‘గత కొన్నేళ్ల నుంచి పీసీఐలో పరిస్థితి అసలు బాగాలేదు. జాతీయ స్థాయిలో వ్యక్తులు, గ్రూప్‌ల మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు’ అని ఐపీసీ సీఈఓ జేవియర్ గోంజాలెజ్ పేర్కొన్నారు. పీసీఐపై సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. ఐపీసీ తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రమైందని పీసీఐ సెక్రటరీ జనరల్ జె.చంద్రశేఖర్ వెల్లడించారు.
నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ సభ్యుడు రాజీవ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. గత నెలలో గజియాబాద్‌లో జరిగిన ప్యారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు కోసం వచ్చిన అథ్లెట్లకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సగం నిర్మాణం పూర్తయిన రెండు బిల్డింగ్‌ల్లో నిర్వాహకులు బస ఏర్పాటు చేయడంతో ప్యారా అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
సరైన టాయిలెట్స్, తాగడానికి మంచి నీటిని కూడా ఏర్పాటు చేయలేదు. సరైన పరుపులు కూడా లేకపోవడంతో చాలా మంది నేలపైనే పడుకున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందడంతో తాజాగా క్రీడాశాఖ చంద్రశేఖర్, తోమర్‌లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.