International Paralympic Committee
-
రికార్డు స్థాయిలో రియో టికెట్ల అమ్మకాలు!
రియో డీ జనీరో: వచ్చే నెలలో రియోలో ఆరంభం కానున్న పారా ఒలింపిక్స్ నేపథ్యంలో అక్కడ అప్పుడే టికెట్ల అమ్మకాల సందడి ఊపందుకుంది. గతవారం ముగిసిన రియో ఒలింపిక్స్ విజయవంతం కావడంతో పారా ఒలింపిక్స్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. పారా ఒలింపిక్స్ టికెట్లు అమ్మకాలు మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల టికెట్లు అమ్మడైపోయాయి. గత మంగళవారం ఒక్క రోజే లక్షా ముప్పై మూడు వేల టికెట్లు అమ్ముకావడంతో సరికొత్త రికార్డు నమోదయ్యింది. రియో ఒలింపిక్స్ లో ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో టికెట్లను విక్రయించడం ఇదే ప్రథమం. 'గడిచిన 48 గంటల్లో టికెట్లు అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఇలా పారా ఒలింపిక్ టికెట్లకు డిమాండ్ పెరగడం గేమ్స్నిర్వహణకు ప్రోత్సాహకంగా ఉంది. తొలి రోజు పదహారు వేల టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు యాభై టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూడు, నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో టికెట్లను విక్రయించాం'అని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోన్జాలెజ్ పేర్కొన్నారు. -
భారత పారాథ్లెట్స్‌కు అవకాశం
న్యూఢిల్లీ : భారత పారాలింపిక్ కమిటీపై నిషేధం ఉన్నప్పటికీ అంతర్జాతీయ పోటీల్లో భారత పారాథ్లెట్స్ పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ప్రకటించింది. భారత క్రీడాకారులు జాతీయ పతాకం బదులుగా ఐపీసీ పతాకం కింద పోటీపడతారని వివరించింది. గత మార్చిలో ఘజియాబాద్‌లో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం... అంతర్గత రాజకీయాల కారణంగా భారత పారాలింపిక్ కమిటీపై ఐపీసీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో పారాలింపిక్ కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం అడ్‌హక్ కమిటీని నియమించాలని నిర్ణయించింది. దీనికి ఐపీసీ నుంచి సానుకూల స్పందన లభించింది. -
పీసీఐపై వేటు
సస్పెన్షన్ విధించిన ఐపీసీ న్యూఢిల్లీ: గజియాబాద్ ఉదంతం నేపథ్యంలో భారత ప్యారా అథ్లెటిక్ కమిటీ (పీసీఐ)పై అంతర్జాతీయ ప్యారా అథ్లెటిక్ కమిటీ (ఐపీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈనెల 15న పీసీఐకి మెయిల్ ద్వారా లేఖను పంపింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది స్పష్టం చేయలేదు. ‘గత కొన్నేళ్ల నుంచి పీసీఐలో పరిస్థితి అసలు బాగాలేదు. జాతీయ స్థాయిలో వ్యక్తులు, గ్రూప్‌ల మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు’ అని ఐపీసీ సీఈఓ జేవియర్ గోంజాలెజ్ పేర్కొన్నారు. పీసీఐపై సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. ఐపీసీ తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రమైందని పీసీఐ సెక్రటరీ జనరల్ జె.చంద్రశేఖర్ వెల్లడించారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ సభ్యుడు రాజీవ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. గత నెలలో గజియాబాద్‌లో జరిగిన ప్యారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు కోసం వచ్చిన అథ్లెట్లకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సగం నిర్మాణం పూర్తయిన రెండు బిల్డింగ్‌ల్లో నిర్వాహకులు బస ఏర్పాటు చేయడంతో ప్యారా అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సరైన టాయిలెట్స్, తాగడానికి మంచి నీటిని కూడా ఏర్పాటు చేయలేదు. సరైన పరుపులు కూడా లేకపోవడంతో చాలా మంది నేలపైనే పడుకున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందడంతో తాజాగా క్రీడాశాఖ చంద్రశేఖర్, తోమర్‌లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.