మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.
బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు.
అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది.
‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి.
చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం.
వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ.
వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది.
ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు.
అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి.
ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి.
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
Published Fri, Dec 13 2024 12:18 AM | Last Updated on Fri, Dec 13 2024 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment