ప్రతి స్త్రీలో ఒక దుర్గ ఉంటుంది. కాని ఆ దుర్గను అదిమి పెట్టేలా కుటుంబం, సమాజం ఆమెను తీర్చి దిద్దుతాయి. దాంతో తన మీద ఏ అన్యాయం జరిగినా చెప్పలేని స్థితికి చేరుతుంది.
‘నువ్వు దుర్గవి. పోరాడు’ అని చెప్తారు బెంగళూరులోని ‘దుర్గ ఇండియా’ టీమ్ సభ్యులు. ప్రియా వరదరాజన్ అనే యాక్టివిస్ట్ ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ స్త్రీలను కుటుంబ హింస నుంచి... లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పని చేస్తోంది. వారి పోరాటానికి శక్తినిస్తోంది.
‘ప్రతి ఒక్కరూ మార్పు కోసం ఎదురు చూస్తారు. మనమే మార్పు కోసం ప్రయత్నిద్దామని ఎందుకు అనుకోరు... ఎదురు చూస్తూ కూచుంటే మార్పు వస్తుందా?’ అంటారు ప్రియా వరదరాజన్.
బెంగళూరులో ‘దుర్గ ఇండియా’ అనే సంస్థ స్థాపించి స్త్రీల సమస్యలపై పని చేస్తున్న ప్రియ ఇటీవల బెంగళూరు మాల్‌లో ఒక వ్యక్తి స్త్రీలను అసభ్యంగా తాకడం గురించి ప్రస్తావిస్తూ ‘పబ్లిక్ ప్లేసుల్లో– బహిరంగ ప్రదేశాల్లోగాని ఆన్‌లైన్‌లోగాని స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై చర్య తీసుకునేందుకు ఆ బాధిత మహిళకు అండగా నిలవడం మేము చేసే పని. చట్టాలు ఎన్ని ఉన్నా, పోలీసులు, మహిళా పోలీసులు ఎందరు ఉన్నా మహిళలకు సాటి మహిళ అండగా ఉంటే కలిగే ధైర్యం వేరు.
తోటి మహిళలతో వారు చెప్పుకునేవి వేరు. అలాంటి వారికి యోగ్యులైన కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ చేయించి దిలాసా ఇప్పిస్తాము. అంతే కాదు బాధితులను వెంటబెట్టుకొని– ఆ స్టేషన్‌కుపో ఈ స్టేషన్‌కు పో అనే బాధ లేకుండా బెంగళూరులో వన్ స్టాప్ సెంటర్స్‌లో ఫిర్యాదు చేయిస్తాము. తోడుగా మేమొస్తే బాధితులు ఫిర్యాదు చేయడానికి జంకరు. ఎటొచ్చీ వారికి తోడు నిలిచే స్త్రీల బృందాలు అన్నిచోట్లా ఉండాలి’ అంటుంది ప్రియ.
ఐ యామ్ ఎవ్రి ఉమన్
పదేళ్ల క్రితం ప్రియా వరదరాజన్ ‘ఐ యామ్ ఎవ్రి ఉమన్’ పేరుతో ఒక బ్లాగ్ రాయడం మార్పు కోసం ఆమె వేసిన మొదటి అడుగు. ఆ బ్లాగ్‌కు క్రమంగా చాలామంది మహిళా ఫాలోయర్లు వచ్చారు. వారు తమ అనుభవాలను ప్రియతో పంచుకోసాగారు. ‘అందరిదీ ఒకే కథ. అందరూ మరొక స్త్రీ లాంటి వారే అని నాకు అర్థమైంది. స్త్రీల కోసం పని చేయాల్సిన అవసరం తెలియజేసింది. స్త్రీల కోసం పని చేయడం అంటే వారి పట్ల భావజాలాన్ని మార్చడమే’ అంటుంది ప్రియ.
మగాడు ఎందుకు అలా చేస్తాడు?
‘గతంలో సమాజంలో స్త్రీలకు ఏదైనా సమస్య వచ్చి ఆమె బయటకు చెప్పినప్పుడు– ఆమెలో ఏ దోషం ఉందో అన్నట్టుగా నిందను ఆమె మీదే వేసేవారు ఉండేవారు. వారి భావజాలాన్ని మార్చడమే చేయవలసింది. స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ మగాడు ఆమెతో అలా ఎందుకు చేశాడు అని ఆలోచించేలా చేస్తే సగం మార్పు వచ్చినట్టే. ఇంట్లో, వీధిలో, ఆఫీసులో స్త్రీలు ఆత్మాభిమానంతో ఉండాలంటే మగాళ్లు మారాలి. అందుకు ఒకరోజు సరిపోదు. ఒకరు పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం ఏదో ఒక మేరకు పని చేయాల్సిందే’ అంటుంది ప్రియ.
అందరినీ ‘దుర్గ’లుగా మారుస్తూ
అన్యాయం జరిగితే వెరవకుండా ప్రతిఘటించమని ప్రియ ఆధ్వర్యంలో ‘దుర్గల’ బృందం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో తిరుగుతూ స్త్రీలకు తమ హక్కులను, చట్టపరమైన రక్షణను, సహాయం చేసే బృందాలను తెలుపుతుంది. ‘నేను ఒంటరిదాన్ని కాను అని స్త్రీ అనుకుంటే చాలు... ఆమె పోరాడగలదు’ అంటుంది ప్రియ.
ఇంత ప్రయత్నం చేసే ప్రియ లాంటి వారి సంఖ్య ఎంత పెరిగితే దుర్గలకు అంత శక్తి పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment