Psychological distress
-
'మీరు తప్పకుండా మా సలహా పాటించండి'.. స్టార్ హీరో విజ్ఞప్తి!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు. కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు. కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా.. అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు. ’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ► జోక్ చేస్తున్నామా... భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు. ► ప్రమాదకరమే శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం. ► ప్రేమగా అవమానం.. ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి. ► జాప్యమూ లోపమేనా! భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు. ► అరిస్తే వింటారా.. చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ► తామే గొప్పని.. కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు. చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది. మాట్లాడే ముందే ఆలోచన శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి. – ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ – నిర్మలారెడ్డి -
ఆరో అంతస్తునుంచి దూకి ఐఏఎస్ కుమారుడు ఆత్మహత్య
IAS Officer son committed suicide న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు తల్లిదండ్రులులేని సమయంలో 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటీనా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి 8 గంటల 30 నిముషాలకు చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలుడు (15) మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గత సెప్టెంబర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో తల్లిదండ్రులు ఎవ్వరూ ఇంట్లో లేరని, ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందని, ఈ రోజుల్లో ప్రతి చిన్న కారణానికి యువత ప్రాణాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా పోలీసధికారి ఒకరు తెలిపారు. చదవండి: New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది! -
క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!
సాక్షి, సిటీబ్యూరో: మాస్ రియాక్టివ్ డిప్రెషన్ (ఎమ్మార్డీ). మానసిక వైద్య నిపుణులు కొత్తగా చెబుతున్న మాట ఇది. సాధారణంగా వ్యక్తులు కుంగుబాటు బారిన పడతారు. కానీ సమాజంలో ఎక్కువ మంది ఒకేసారి ఒకేవిధమైన ఆందోళన, డిప్రెషన్‌కు గురైతే.. అదే మాస్ రియాక్టివ్ డిప్రెషన్. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ సృష్టించిన షాక్ ఇది. మొదటి దశ కంటే రెండో దశలోనే కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒకవైపు వైరస్ తమను ఏం చేయలేదనే తెగింపు ధోరణి కొంతమంది ఆలోచనా విధానంలో కనిపిస్తోంది. మరోవైపు తొలగిపోయిందనుకున్న మహమ్మారి తిరిగి విజృంభించడంతో నెలకొన్న భయాందోళనల కారణంగా మాస్ డిప్రెషన్ లక్షణాలు పెరుగుతున్నాయని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి.. వంచించి ► గతేడాది మార్చి నుంచి ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన కోవిడ్ సెప్టెంబర్ నాటికి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. నవంబర్ నెలలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. పెళ్లిళ్లు, వేడుకలు, పర్యటనలు, సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం వంటి వాటితో పాటు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు పెరిగాయి. ► సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ తదితర అన్ని వ్యాపార, వినోద కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి. జనంలో చాలా వరకు కోవిడ్ భయాందోళనలు తొలగిపోయాయి. ఒక భరోసా ఏర్పడింది. ఇక కోవిడ్ ముప్పు తొలగినట్లేనని భావించిన జనం మాస్కులు ధరించడం మానేశారు. ► భౌతిక దూరం నిబంధన తొలగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోవిడ్ తిరిగి తన ప్రతాపాన్ని ప్రదర్శించడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరుకున్నాయి. ఇది మాస్ రియాక్టివ్ డిప్రెషన్‌కు దారితీసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ ► సాధారణంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లభిస్తుంది. కానీ మహమ్మారిని ఎదుర్కోవడంలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో ముఖ్యం. ► వైరస్ రెండో దశకు విస్తరించడం ఒకవైపు అయితే, మరోవైపు వైరస్‌పై వివిధ రకాల ప్రచారంతో సైకలాజికల్ ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతోంది. తమకేదైనా అవుతుందేమోననే భయాంతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీనికి కారణం వైరస్ ఎప్పటి వరకు తొలగిపోతుందనే అంశంపై స్పష్టత లేకపోవడమేనని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ సంహిత తెలిపారు. సన్నద్ధతతోనే పరిష్కారం వైరస్ వ్యాప్తి, ఉద్ధృతి, తగ్గుముఖానికి అనుగుణంగా మానసిక సన్నద్ధతను పెంచుకోవడం ఒక్కటే పరిష్కారం. శారీరక వ్యాయామంతో దృఢత్వం పెంచుకొన్నట్లుగానే ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి -
నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు
వట వృక్షానికి గొప్పదనం కృష్ణుడు దాన్ని ఆశ్రయించినందు వల్ల. బోధి వృక్షానికి గొప్పదనం బుద్ధుడు తపస్సుని దాన్ని ఆశ్రయించి చేసినందువల్ల. మద్ది (పాల) చెట్లకి గొప్పదనం రామచంద్రుడు ఆ జాతికి చెందిన 7 చెట్లని వధించి తన శక్తిని నిరూపించుకుని సుగ్రీవునితో సఖ్యాన్నిపొంది రావణవధకి అవకాశాన్ని ఏర్పరచుకున్నందువల్ల. శింశుపావృక్షానికి గొప్పదనం సీతమ్మ ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాదాపు సంవత్సర కాలం ఉన్నందు వల్ల. నైమిశారణ్యానికున్న గొప్పదనం ఇలాంటి అనేక వృక్షాలతో కూడిన ఆ అరణ్యాన్ని ఆశ్రయించుకుని సూతమహర్షి ఉంటూ శౌనకుడూ మొదలైన మహర్షులకి అనేక పురాణేతిహాసాలని బోధించి నందువల్ల. పూవులు చిన్నవి అవుతూనూ, ఆకర్షణ ఏ మాత్రమూ లేకపోతూనూ, వాసన ఏ మాత్రమూ లేకుండానూ, కాండమంతా జిగురు కలిగిన కారణంగా ఏ ఒక్కరికీ ఆశ్రయాన్ని ఈయలేకపోతూనూ, తన ముళ్లు నేల మీద పడుతూ ఉండే కారణంగా ఎవరినీ తన దగ్గరికి రానీయకుండా చేసుకుంటూనూ, ఎలాగో వచ్చినా తన మీద నిరంతరం సంచరిస్తూ ఉండే నల్ల చీమల కారణంగా ఎవరికీ ఆశ్రయాన్నీయలేకపోతూనూ కనిపించే తుమ్మచెట్టుక్కూడా ఉన్న గొప్పదనం – ఎవరికీ ఇష్టం ఉండని భూత ప్రేత పిశాచ సంతతిని తన మీద ఉంచుకుంటూన్నందువల్ల. ఇలా ప్రతి వృక్షానికీ ఓ గొప్పదనం ఉంటూ ఉంటే అలా ఆ వృక్షాన్ని కేవలం ఆశ్రయించి ఉండటమే కాక, దాన్ని తీపిదనం కలదాన్నిగానూ, కోరికల్ని తీర్చే శక్తీ ఉన్నదిగానూ మార్చివేయడం ఎంత ఆశ్చర్యకరం! ఆనందదాయకం!! సాయి ఆ చెట్టుకింద దక్షిణ భాగంలో కూచుండే వాడు. ఆ కారణంగా దక్షిణపు వైపు ఆకులన్నీ తీపిదనంతో ఉంటూ ఉండేవి. ప్రతి వస్తువుకీ సహజలక్షణమంటూ ఒకటుంటుంది. సముద్రానికి కెరటాలతో ఉండటం, నిప్పుకి మండేతనం ఉండటం, వర్షానికి తడిసేలా చేసే గుణం, చలికి వణుకు పుట్టించేతనం ఉండటం ఎలాగో అలా, వేపకి చేదుతనమనేది సహ+జం(తనతో పుట్టిన గుణం) దాన్ని సాయి తాను కూర్చున్న కారణంగా మార్చేసాడనే విషయం లోకానికర్థం కావాలనుకుంటూ ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇంతర్థం వచ్చేలా రాశాడు. కేవలం ఆ చెట్టుని మార్చేసాడనేది దాని భావం కాదు. లోకంలో ఎందరో వేపచెట్లలా ఏ విధమైన ప్రయోజనమూ లేనివాళ్లుగా జీవిస్తూ ఉంటే, ఆ అందరినీ తనని ఆశ్రయిస్తే చాలు ప్రయోజనం కలిగిన వాళ్లుగా చేశాడనేది మరో లో అర్థం. అంతేకాదు. ఎందరో ఎందరో నిరుత్సాహంతో అణగారిన ఆశలతో ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి సాయిని ఆశ్రయించుకున్నారు కూడా కదా! అలా మార్చేసిన లక్షణం కలవాడు సాయి –అనే అర్థం లోకానికి తెలియాలనే ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇలా రాశాడు. లోగడ మనం చదువుకున్న ఘట్టాల్లో అనేక విధాలుగా రక్షింపబడ్డవాళ్లూ, ఆత్మహత్యలని విరమించుకున్నవాళ్లూ, తమ ప్రవర్తనలోని దోషాలని గమనించుకున్నవాళ్లూ.. ఇలా ఎందరెందరు రాలేదు! అదుగో ఆ ఉదాహరణలన్నీ కళ్లకి కట్టినట్టుగా వివరించగల శ్లోకం ఇది! కాబట్టి పాదుకల్ని చూస్తూ చేతిలో స్పృశిస్తూ ఆ పాదుకల మీద అరచేతులతో బలంగా రుద్దేస్తూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ఇంక కొద్ది భక్తులైతే ముద్దులు పెట్టడం వంటి కొన్ని చేష్టల్ని కూడా చేస్తూ కనిపిస్తారు. అది సరికాదు. పాదుకల్ని స్పృశిస్తూ ఆ పాదుకలు తమ శిరసు మీద సాయినాథుడు ఉంచినట్లు భావిస్తూ పైన అనుకున్న శ్లోకాన్నే ధ్యానించుకుంటూ ఆ సాయినాథుని కారణంగా ఆ వేపచెట్టు ఎంత గొప్పది కాగలిగిందో ఆ చరిత్రని తెలుసుకుంటూ ఆ గొప్పదనమే తనకీ కలిగేలా చేయవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అది మాత్రమే పాదుకాదర్శన కాలంలో చేయవలసిన పని. ఇంతటి గొప్పదనం తమలో దాగి ఉన్న ఆ పాదుకల ప్రతిష్ఠ ఎలా అయిందో, పాదుకలకి మాత్రమే ఆ గొప్పదనం ఎందుకుంటుందో ఇక తెలుసుకుందాం!ఎన్నెన్నో దైవక్షేత్రాలున్నాయి లోకంలో. అయితే అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే ఏడింటికే మోక్షాన్నిచ్చే క్షేత్రాలున్న పురాలుగా గుర్తింపు వచ్చింది. ధర్మస్వరూపుడనే పేరు (రామో విగ్రహవాన్ ధర్మః) ఆ రామచంద్రునికి మాత్రమే సొంతమయింది. ఎందరెందరో అవతారమూర్తులున్నారు భక్తి సామ్రాజ్యంలో. అయితే భగవానుడనే మాట (కృష్ణ స్తు భగవాన్ స్వచుమ్) కేవలం కృష్ణునికే వచ్చింది. అదే తీరుగా పర్వతాలెన్ని ఉన్నా హిమాలయానికీ, నదులెన్ని ఉన్నా గంగకీ.. ఇలా కొన్నింటికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి కారణమేమిటని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విశేషాలు గోచరిస్తాయి.లౌకికం – అలౌకికంఏ విధంగానూ లోలోతు పరీక్షలని చేయకుండా కేవలం భౌతిక దృష్టితో చూడటమనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికదర్శనం అంటారు. ఓ చెట్టుని చూస్తే అది ఎంత ఎత్తుంది? ఎంత లావైన కాండాన్ని కలిగి ఉంది? ఎన్నాళ్ల వయసుదానికి?... ఈ తీరు వివరాల సేకరణ లౌకికం. అదే మరి ఆ చెట్టు కింద ఏ యోగి కూర్చుంటూ ఉండేవాడు? పెద్ద గాలివాన వచ్చి అన్ని చెట్లు పడిపోయినా కూడా.. ఆ చెట్టే ఎందుకు పడిపోకుండా నిలవగలిగింది? చెట్టు మొదట్లో ఉన్న పాముపుట్టని ఎందరు దర్శించి పూజిస్తూ ఉండేవాళ్లు! ఆ తీరు అర్చనలు ఎన్నేళ్ల నుండి సాగుతూ వస్తున్నాయంటూ ఆలోచించడం, తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అలౌకిక దర్శనం. భారత దేశానికి అప్రాచ్యుడు (పశ్చిమ దేశాల వాడు) వచ్చాక మనందరికీ వాడు నేర్పింది కేవలం లౌకిక దర్శనాన్ని మాత్రమే. దాంతో అలౌకిక దర్శన దృష్టితో ఎవరు మాట్లాడినా దాన్నంతటనీ – ‘చాదస్తం, మూఢవిశ్వాసం, పిచ్చితనం’ – వంటి మాటలతో మనం కొట్టిపడేసే తీరు అలవాటైపోయింది మనకి. అయితే ఒక్కసారి తలని మరో వైపుకి తిప్పి దృష్టిని మరో తీరుకి మళ్లించి చూస్తే చాలు – అలౌకికదర్శనం మనకి అబ్బి తీరుతుంది. ఇదంతా ఎందుకంటే ఆ తీరు అలౌకిక దృష్టితో చూడలేని పక్షంలో ద్వారకామాయి అనేది ఒక మసీదులాగా, సాయి కేవలం ఒక మహమ్మదీయునిగా, షిర్డీ అనేది ఒక ప్రసిద్ధ ఆలయమున్న ప్రదేశంలాగా, ఆయన్ని సేవించినవారంతా కేవలం భక్తులనే జాతికి చెందిన మనుషులుగా మాత్రమే కనిపిస్తారు. అలా కాక అలౌకిక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ పాదుకలూ – వాటి గొప్పదనమూ మనకి అర్థమవుతుంది. కానీ పక్షంలోనూ అప్రాచ్యదృష్టితోనూ చూస్తే పాదుకలు కేవలం ‘చెప్పులు’గానే కనిపిస్తాయి. కాబట్టి ఆ తీరు అలౌకిక దర్శనానికి కదులుదాం! అక్కల్కోట నుండి షిర్డీకా? అమృతాన్నైనా సరే చిల్లు ఉన్న పాత్రలో పోస్తే.. ఎలా చుక్క చుక్క చొప్పున తరిగిపోతూ కొంతసేపటికి మొత్తం శూన్యమైపోతుందో.. అలాగే తపశ్శక్తిని సాత్త్వికంగా గానీ, రాజసంగా గానీ సంపాదించినా మళ్లీ అసూయ, పగ, ద్వేషం అనే వీటిని ప్రదర్శిస్తే తపశ్శక్తి కాస్తా ఒకనాటికి క్షీణించిపోతుంది. మళ్లీ ఆ శక్తి రావాలంటే... పోయిందాన్ని పూరించాలంటే మళ్లీ తపస్సుని చేసి ఆ లోటుని పూరించాల్సిందే.ఇదంతా ఎందుకంటే, సాయిది ఏనాడూ పగ, ద్వేషం, అసూయ అనేవి ఏ కోశానా లేకుండా సాధించిన తపస్సుతో కూడిన శక్తి మాత్రమే అని చెప్పడం కోసమే.అక్కల్కోటలో మహారాజ్ గారు ఉన్నంతవరకూ ఆ తపశ్శక్తి అనేదాన్ని శూన్యం కాకుండానూ, లేదా తగ్గిపోతూ ఉండకుండానూ ఆయన తపస్సు చేసి నింపుతూ ఉండేవారు. వారి పిమ్మట ఆ శక్తిని నింపగల శక్తి, సమర్థత కలవారు దాదాపుగా లేకపోయారు. ఆ విషయాన్ని గమనించిన అక్కల్కోట(కర్) మహారాజ్ కృష్ణజీ అనే ఆయనకి న్రిత్యం అక్కల్కోటకి అతి భక్తి శ్రద్ధలతో నిర్వా్యజంగా (ఈ పని అయితే ఇక్కడికొస్తాననే తీరు బుద్ధితో కాకుండా) వచ్చి దర్శించే వ్యక్తి కలలో కనపడి – నువ్వు షిర్డీకి వెళ్లు! నేను అక్కడున్నాను’ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నంత పవిత్రతా తపశ్శక్తి స్థితీ ప్రస్తుతం షిర్డీలో కనిపిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమనే దానర్థం. దాంతో కృష్ణజీ షిర్డీకే వచ్చాడు. ఇంతకాలమూ తాను దర్శిస్తూ ఉన్న అక్కల్కోట శక్తి ఇక్కడ షిర్డీలో ఉన్నదీ లే నిదీ గమనిస్తూ.. ప్రతినిత్యం అంతటి శక్తి అనుభవాన్ని పొందుతూ.. ఆనందంగా జీవిస్తూ.. ఒకటి కాదు రెండు కాదు 6 నెలల పాటు షిర్డీలోనే ఉండిపోయాడు. అందుకే అక్కల్కోట నుండి తన రాకపోకలు షిర్డీకే సాగించదలిచాడు ఈ భక్తుడు.మొదట్లో అక్కల్కోట మహారాజ్లోనే స్థిరంగా ఉన్న ఆ తపశ్శక్తీ ఆకర్షణా క్రమంగా వారి పిమ్మట వారి చిత్రపటంలోకీ ఆ పిమ్మట అక్కడున్న మహారాజ్గారి పాదుకలలోకీ ప్రవేశించాయి. ఆ మీదట అక్కడి పాదుకలలోనికి ఆ శక్తిని ఆ స్థాయిలో పూరించగలవారు లేకపోయిన కారణంగా, ఆ స్థాయి శక్తి ఉన్న క్షేత్రంగా అక్కల్కోట మహారాజ్ గారే షిర్డీని నిర్ణయించిన కారణంగా మొత్తం తపశ్శక్తి అంతా షిర్డీకి చేరిపోయిందన్నమాట. ఇది అలౌకిక దృష్టితో ఆలోచించడమంటే. పాదుకలు ఈ స్థితిలో కృష్ణజీ ఆలోచించాడు ఈ షిర్డీ ఇంతటి పవిత్రత కలిగినది కాబట్టీ, ఆ విషయాన్ని అక్కల్కోట మహారాజ్ గారే నిర్ణయించి చెప్పారు కాబట్టీ, ఆ శక్తిని చిరకాలం స్థాపించి ఉంచడం కోసం– పాదుకలని అక్కడ అక్కల్కోటలో స్థాపించిన తీరుగా ప్రతిష్ఠించాలని. ఇదే విషయాన్ని తనతో పాటు సమానస్థాయి కల భక్తి విశ్వాసాలున్న మిత్రులతో సంప్రదించాడు. వాళ్లూ అంగీకరించారు మొదటి మాటతోనే– మొదటి మాటలోనే. ‘ఏకైకస్యాపి నిర్ణయాభ్యుపగమో దోషాయ భవతి’ అని సంస్కృతంలో ఓ మాట. ‘ఎంతగా తానాలోంచినా, ఎంతగా దాన్ని పరిశీలించి తప్పుకాదని అనుకున్నా కూడా, ఏ విషయాన్నీ ఒక్కనిగా ఉంటూ ఓ నిర్ణయాన్ని చేస్తే తప్పక అందులో దోషం ఉండి తీరుతుందని దాని భావం. ఆ కారణంగా కృష్ణజీతో పాటు మిగిలిన అందరూ కలిసి మంత్రోపాసన నిరంతరం చేస్తూ ఉండేవారూ – లౌకిక దృష్టి ఏ మాత్రమూ లేనివారూ అయిన ఉపాసనీ మహారాజ్ (పేరులోనే ఉంది ఆయన మంత్రోపాసనలో ఎంత ప్రసిద్ధిని పొందినవాడో) గారికి ఈ పాదుకా ప్రతిష్ఠ ప్రతి పాదనని తెలియజేస్తూ తమ బుద్ధికి తోచిన విధంగా పాదుకల నమూనాని వారి ముందుంచారు. అంతే! ఆ ఉపాసనీ మహారాజ్ గారు ఆ పాదుకల్లో ఉండబోయే తపశ్శక్తినీ, పాదుకలనీ, రాబోయే ఖ్యాతినీ మానసికంగా తమ బుద్ధితో గ్రహించి– వీటిని ప్రతిష్ఠించడం ఎంతో గొప్పవిషయం, అంతే కాక తగిన విధంగా గౌరవించడమే అని భావించి వెంటనే ఆ పాదుకల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే నాల్గింటినీ కూడా చేర్చారు. శంఖమనేది ధ్వనిని పుట్టించేది కాబట్టి ధ్వనిని పుట్టించగల శక్తి ఆకాశానిది కాబట్టీ (శబ్ధగుణక మాకాశమ్) ఆకాశశక్తి ఈ పాదుకలలో ఉంచదలిచారన్నమాట. దాంతో ఆకాశంలో ఉండే సర్వగ్రహాలూ ఈ శంఖం గుర్తులో ఉన్నాయని పరోక్షంగా తెలియజేయడమన్నమాట. ఆ కారణంగానే పాదుకలని భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తే చాలు గ్రహబాధలు తొలుగుతాయి, తొలుగుతున్నాయి.ఇక చక్రమనేది కాల చక్రానికి (నడుస్తున్న కాలగతి జీవితం) సంకేతం. అందుకే ఈ చక్రం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే చాలు జీవితగమనంలో వచ్చే ఒడిదుడుకులు సర్దుకుంటాయి – సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి – లభిస్తున్నాయి.ఇక గద అనేది శత్రుసంహారానికి సంకేతం. ఈ చిహ్నం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే మనని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉండే ఆ శత్రువులు దూరంగా వెళ్లిపోతారు.నిరంతరం మానసికక్షోభ తొలిగిపోతుంది. తొలిగిపోతుంది కూడా.ఆ మీదట పద్మమనేది ప్రశాంతతకీ బుద్ధి వికాసానికీ సంకేతం. గ్రహబాధలు శంఖం ద్వారా, శత్రుబాధలు గద ద్వారా తొలిగిపోయాక ఇక వ్యక్తికి ఉండేదీ కలిగేదీ మనశ్శాంతే కదా! ఆ మనశ్శాంతికి సంకేతం పద్మం. అలాగే ఇన్ని అనుభవాలు కలిగాక వ్యక్తి ఏవిధంగా జీవించాలో చెప్పగల బుద్ధి వికాసమనేది కూడా పద్మం ద్వారానే కలుగుతుందని చెప్పడం దీని లోభావం(అంతరార్థం).ఇంతటి అర్థవంతమైనవి పాదుకలనే దృష్టితో ఆలోచనతో ఉపాసనీ మహారాజ్ వారు పాదుకలకి ఈ చిహ్నాలని జతచేశారు. ఇంతటి తపశ్శక్తీ ఇన్ని తీరుల ఇబ్బందుల నివారణలూ కలిగేలా పాదుకలని ఏర్పాటు చేసినా కూడా ఆ ఉపాసనీ మహారాజ్ గారికి సంతృప్తి కలగలేదు. ఏదో ఓ లోటు అనిపించనే అనిపించింది. దాంతో సాయికి ఏ అమోఘమైన తపశ్శక్తి అనేది లభించడానికి వేపచెట్టు సాక్షిగా ఉందో, ఆ వేపచెట్టు ఏ ద్వారకామాయికి దక్షిణ ప్రదేశంలో ఉందో, అంతేకాక సాయి నిరంతరం (12 ఏండ్ల పాటు) తపస్సులో గడిపిన గురుస్థానం సమీపంలో ఉందో ఆ విశేషం లోకానికి భక్తజనానికి) తెలియాలనీ తెలియజేయాలనీ భావించిన ఉపాసనీ మహారాజ్ ఆ వేపచెట్టు శక్తినీ, దానికి సాయి కలిగించిన అసాధ్యశక్తినీ (తియ్యదనం కోరికలు తీర్చేతనం..) బహిరంగపరుస్తూ ఓ శ్లోకాన్ని చెక్కించి ఆ ఫలకాన్ని కూడా ఆ పాదుకలవద్దే ఉంచాలని నిర్ణయించారు. నిజానికి ఆ పాదుకలూ వాటిలో ఈ చిహ్నాలు, ఆ శ్లోకమూ గనుక ఉండని పక్షంలో ఇన్ని విశేషాలు లోకానికి తెలిసుండేవా? మహాత్ములది ఎప్పుడూ లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి– దాంతో పాటు ఆ అనుగ్రహం లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి – దాంతో పాటు ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో ఆ ఉపాయాన్ని అందరికీ వివరించి చెప్పాలనే దృష్టీను. ఆ కారణంగా పాదుకలని ఇంతటి లోభావం కల దృష్టితో మనం దర్శించాలన్నమాట. చాలా మంది భక్తులు పాదుకల మీద అరచేతుల్ని పెట్టి అరగదీస్తూ, తలని వాటికి మోదుకుంటూ, ఇంకకొందరైతే చుంబిస్తూ... ఏమేమో చేసేస్తుంటారు. పాదుకా దర్శనం అనుగ్రహాన్ని పొందడమనేది పై తీరు భావనతో కళ్లతో దర్శిస్తే చాలు లభిస్తుంది నిజానికి.వ్యాధితో బాధపడుతున్న రోగికి పైకి కనిపించే రోగం మాత్రమే కాక ఇంకా ఏమైనా కూడా లోపల దాగున్నాయేమోనని గ్రహించి ఆ అన్ని రోగాలూ తొలగిపోయేలానూ, వచ్చి ప్రధానంగా కనిపిస్తున్న ప్రధాన రోగానికి సంబంధించిన మూలకణాల నిర్మూలనానికి ఎలా వైద్యుడు ఆయా ఔషధాలని కలిపి ఓ ఔషధాన్ని సిద్ధం చేస్తాడో అలా ఉపాసనీ మహారాజ్ గారు ఈ పాదుకలని అంతటి శ్రద్ధతోనూ చేసి ఉంచడమే కాక, ఏ ఔషధాన్ని ఎంత చలి లేదా వేడి ప్రదేశంలో ఉంచాలో ఆయనకాయనే మనకి చెప్పినట్టుగా ఈ పాదుకలు ఆ వేప చెట్టు కిందనే ఉండాలని ఓ నిర్ణయాన్ని కూడా చేశారు. దాంతో భక్తులందరికీ పాదుకాప్రతిష్ఠ అనేది ఓ ఆనందదాయకమైన ఉత్సవంగా అనిపించింది. -
మేం పచ్చి అబద్దాలకోరులం..
కశ్మీర్లో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని హిజ్బుల్ ఉగ్రవాదుల కిడ్నాప్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల కుటుంబాలు పడుతున్న మానసిక క్షోభ, కశ్మీర్‌లోయలో పరిస్థితులపై ఓ పోలీస్ అధికారి భార్య, ఉద్యోగిని అయిన ఆరీఫా తౌసిఫ్ ఓ స్థానిక వార్తాపత్రికకు భావోద్వేగ లేఖ రాశారు. శారీరకంగా పక్కనున్నా మానసికంగా విధుల్లోనే ‘ఒంటరిగా ఇంట్లో నిద్రపోవడమన్నది పెద్ద సమస్యేం కాదు. కానీ అర్ధరాత్రి భయంతో ఉలిక్కిపడి లేచిన సందర్భాల్లో పక్కనుండి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తాం. అంతేకాదు భర్తతో కలసి ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి బయటకు వెళ్లాలనుకుని మేం అనుకుంటే అవి ఎప్పుడోకాని జరగవు. అదృష్టంకొద్దీ అది జరిగినా పోలీస్ అధికారులు శారీరకంగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారు. కానీ మానసికంగా, ఫోన్ ద్వారా వాళ్లు అప్పుడు కూడా విధుల్లోనే ఉంటారు. కశ్మీర్లో ఆపరేషన్ల సందర్భంగా ఎక్కడ, ఏ పోలీస్ అధికారి చనిపోయినా మేమంతా తీవ్రమైన భయం, అభద్రతాభావంలోకి జారిపోతున్నాం’ బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది కశ్మీర్లో పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకనే కశ్మీర్లో యువకులు పోలీస్‌శాఖలో చేరుతున్నారు. వారు చదివింది ఒకటి. చేసేది మరోటి. దేశంలో కశ్మీర్లో మాత్రమే రిటైర్డ్ అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)లుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీచేసిన వారు ప్రభుత్వ అధికారులుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంటినుంచి బయటికెళ్లాలంటే భయమేస్తోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగలడంతో నష్టపోయినవారు, ఇతరులు ఆ దురదృష్టకర ఘటనకు మేమే బాధ్యులం అన్నట్లు చూస్తారు. ఏదైనా పోలీస్ అధికారికి ప్రమాదం జరిగితే కనీసం మా పట్ల సానుభూతి చూపేవారు ఒక్కరు కూడా ఉండటం లేదు. ఈ విషయాలను నా పిల్లలు చిన్నతనంలోనే అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నా రాష్ట్రంపై కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోయి సుసంపన్నమైన, శాంతియుత కశ్మీర్‌ను చూడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ తన భావోద్వేగ లేఖను ముగించారు. చిన్నచిన్న కోరికలూ సుదూర స్వప్నాలే.. ‘భర్తతో సరదాగా షికారు, కష్టసుఖాల్లో కలసిఉండటం వంటి చిన్నచిన్న కోరికలు సైతం పోలీస్ అధికారుల భార్యలకు సుదూర స్వప్నాలే. రాత్రి భర్త ఇంటికొస్తే కుటుంబమంతా కలసి భోంచేద్దామని ఎదురుచూస్తాం. కుటుంబంలో వేడుకలు, అంత్యక్రియలకు కలసి వెళ్లాలనుకుంటాం. పిల్లలతో కలసి షికారుకు వెళ్లాలనుకుంటా. కానీ వీటిలో ఏవీ నెరవేరవు. మా పిల్లలను ఒంటరిగా పెంచుతాం. మేం పచ్చి అబద్దాలకోరులం. మాలో చాలా మంది ‘నాన్న శనివారం ఇంటికొస్తారు’ ‘నాన్న పేరెంట్ మీటింగ్‌కు కచ్చితంగా వస్తారు’ ‘మనం ఈవారం నాన్నతో కలసి పిక్నిక్కు పోదాం’, ‘పండుగకు నాన్న ఇంటికొస్తానన్నారు’ అంటూ మా పిల్లలకు అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అనారోగ్యంతో బాధపడే మా అత్తమామలకు ‘మీ అబ్బాయి ఫలానా రోజు వస్తానన్నారు’ అంటూ అబద్ధాలు చెబుతాం. ఇలా అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం’ -
పాపం పండుటాకులు
రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బిల్లులకు బాబు బ్రేక్ సాక్షి, కాకినాడ: ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక బాసటగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిపై వివక్ష చూపుతోంది. గంటకో జీఓ జారీ చేస్తూ వృద్ధాప్యంలో వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చీరాగానే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన టీడీపీ సర్కారు.. రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెలల తరబడి మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక వేలా ది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 3.20 లక్షల మంది వరకూ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులున్నారు. వీరి కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వ్యాధి తీవ్రతను బట్టి రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ మెడికల్ రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కానీ టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చీరాగానే రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరును పూర్తిగా నిలిపివేస్తూ జీఓ 103 జారీ చేసింది. కేవలం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే పాత పద్ధతిలో రీయింబర్స్మెంట్ కొనసాగించాలని, రిటైరైనవారి బిల్లులను సంబంధిత శాఖల హెచ్ఓడీలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. పైగా తాము చెప్పేవరకూ ఎలాంటి రీయింబర్స్మెంట్ బిల్లులూ మంజూరు చేయడానికి వీల్లేదని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి.. ఎన్నికల ముందు పేరుకుపోయిన బకాయిలను కూడా విడుదల చేయకుండా వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ప్రతి జిల్లాలో నెలకు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకూ రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ బిల్లులు నిలిచిపోయాయి. గత ఐదు నెలలుగా రీయింబర్స్మెంట్ బిల్లులు మంజూరు కాక రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.గోపాలకృష్ణ తెలిపారు.