రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బిల్లులకు బాబు బ్రేక్
సాక్షి, కాకినాడ: ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక బాసటగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిపై వివక్ష చూపుతోంది. గంటకో జీఓ జారీ చేస్తూ వృద్ధాప్యంలో వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చీరాగానే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన టీడీపీ సర్కారు.. రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెలల తరబడి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక వేలా ది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 3.20 లక్షల మంది వరకూ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులున్నారు. వీరి కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వ్యాధి తీవ్రతను బట్టి రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ మెడికల్ రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. కానీ టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చీరాగానే రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మంజూరును పూర్తిగా నిలిపివేస్తూ జీఓ 103 జారీ చేసింది. కేవలం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే పాత పద్ధతిలో రీయింబర్స్‌మెంట్ కొనసాగించాలని, రిటైరైనవారి బిల్లులను సంబంధిత శాఖల హెచ్‌ఓడీలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
పైగా తాము చెప్పేవరకూ ఎలాంటి రీయింబర్స్‌మెంట్ బిల్లులూ మంజూరు చేయడానికి వీల్లేదని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి.. ఎన్నికల ముందు పేరుకుపోయిన బకాయిలను కూడా విడుదల చేయకుండా వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ప్రతి జిల్లాలో నెలకు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకూ రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ బిల్లులు నిలిచిపోయాయి. గత ఐదు నెలలుగా రీయింబర్స్‌మెంట్ బిల్లులు మంజూరు కాక రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.గోపాలకృష్ణ తెలిపారు.
పాపం పండుటాకులు
Published Wed, Aug 13 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement