
బూత్‌ల వారీ ఓటింగ్ సరళిని బయటపెట్టరాదు
ఎన్నారైలకు స్థానికంగానే ఓటేసే విధానం రావాలి
ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఈసీపై ఆరోపణలు అన్యాయం
నేడు పదవీ విరమణ చేస్తున్న సీఈసీ రాజీవ్‌కుమార్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పదవీ విరమణ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దీనివల్ల, బూత్‌ల వారీ ఓటింగ్ సరళిని బయటకు తెలియదని చెప్పారు. ప్రవాస భారతీయులు స్థానికంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కమిషన్‌పై తప్పుదోవ పట్టించే ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీఈసీ రాజీవ్ కుమార్ సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికీ పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపమేమంటే..ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతర హింసకు ఇదే కారణంగా మారుతోంది.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీనిని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూ త్‌ల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీ య ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమ ల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంచేందుకు ఇది ఎంతో అవసరమని నమ్ముతున్నా’అని ఆయన అన్నారు.
రిమోట్ ఓటింగ్ విధానం రావాలి
కోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలన్నారు. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారాలను సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిధులు, ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో వెల్లడించే ప్రక్రియ మొదలైందన్నారు. ఆర్థిక పారదర్శకత, విశ్లేషణల కోసం ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచించారు.
ఆరోపణలు ఆందోళనకరం
ఓటర్లు ఉత్సాహంగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు ఈసీ, అధికారులపై సందేహాలను వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయడమే వీటి లక్ష్యం. అయితే, ఎన్నికల సమగ్రతను కాపాడటం, ప్రశాంతంగా ఎన్నికలు జరపడాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పట్టించుకోలేదు’అని అన్నారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే ధోరణులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వారిని ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సంయమనం పాటిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి కొమ్ముకాస్తోందని, ఓటింగ్‌లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణలు లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్‌కుమార్.. ఇవి చేసే నిరాధార, ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment