ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీబిడ్డలను కౌన్సెలింగ్‌కు తరలిస్తున్న పోలీసులు
పిఠాపురం: వరుసగా ఆడపిల్లలనే కన్నావని అత్తవారు వేధించడంతో ఓ వివాహిత తన పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇద్దరు బిడ్డలతో కలిసి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ట్రాక్‌మన్ అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే స్టేషన్ సమీపాన ఆదివారం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పోతులూరుకు చెందిన శివకు, చేబ్రోలుకు చెందిన వెంకటలక్ష్మిలకు భవ్యశ్రీ, పార్థు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వివాహమై 11 ఏళ్లు అయినా మగ పిల్లవాడు పుట్టలేదని వెంకటలక్ష్మిని భర్త, అత్త కాసులమ్మ వేధించేవారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. గత శుక్రవారం అదనపు కట్నం తేవాలని బాధితురాలిపై దాడి చేయగా పెద్దలు వెళ్లి తగువు తీర్చారు. తన మీదకు పెద్దలను తీసుకువస్తావా అంటూ కోపోద్రిక్తుడైన భర్త శివ ఆమెను కొట్టాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, దుర్గాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
కూతురే కాపాడింది...
అదే సమయంలో విశాఖ– విజయవాడ సూపర్‌ఫాస్ట్ రైలు వస్తోంది. ట్రాక్‌మన్ పిమిడి వెంకటేశ్వరరావు ట్రాక్‌ను పరిశీలిస్తూ 655వ మైలు రాయి వద్ద తిరుగుతున్నాడు. వెంకటలక్ష్మి తన బిడ్డలతో కలిసి రైల్వే ట్రాక్‌పై వెళ్లడాన్ని గమనించి వారిని అడ్డుకున్నాడు. తనకు తెలిసిన వారు కొంత దూరంలో ఉన్నారని, దగ్గర దారి కావడంతో ఇలా వెళుతున్నానని వెంకటలక్ష్మి ట్రాక్‌మన్‌కు చెప్పింది.
ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని, అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని వెంకటలక్ష్మి కుమార్తె భవ్యశ్రీ అతడికి చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్‌పై నుంచి బయటకు తోసేసి వారి ప్రాణాలను కాపాడాడు. అప్పటికే ట్రైన్ అతి సమీపంలోకి రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment