
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం! వివరాల్లోకెళితే... వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్‌లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్‌కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు.
తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్‌లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్‌లో సుశీల్‌తో తలపడక ముందే అతనిపై ‘గౌరవం’తో వాకోవర్ ఇచ్చిన ముగ్గురు రెజ్లర్లలో ప్రవీణ్ రాణా కూడా ఒకడు కావడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment