బజరంగ్ పూనియా, సంగీత ఫొగాట్, వినేశ్ ఫొగాట్
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో నిరసన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లు ఇప్పుడు ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాము విజయం సాధించినప్పుడు ఫోటోలు దిగి ఉత్సాహపరచిన ప్రధాని తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ (మనసులో మాట)ను ఉద్దేశించి రెజ్లర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడుతారు.
చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున..
అందరి మనసులో మాటను వింటారు. కానీ మా ‘మన్‌కీ బాత్’ను ఆయన వినలేరా. మేం విజయాలు సాధించినప్పుడు ఇంటికి పిలిచి గౌరవించడంతో పాటు మమ్మల్ని తన బిడ్డలంటూ చెప్పుకున్నారు. ఈ రోజు మా బాధ వినాలని ఆయనను అభ్యర్థిస్తున్నాం’ అని 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ వ్యాఖ్యానించింది. నాలుగు రోజులుగా తాము రోడ్లపై పడుకుంటున్నా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనీసం పట్టించుకోవడం లేదని సాక్షి విమర్శించింది. ‘బహుశా నిజం ఏమిటో ప్రధానికి తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తిగతంగా కలిసి సమస్యను చెప్పాలని కోరుకుంటున్నాం.
అయితే ఆయనను కలిసే మార్గం ఏమిటో మాకు తెలియడం లేదు’ అని వినేశ్ ఫొగాట్ చెప్పింది. నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లు బుధవారం రోడ్డు పైనే తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. కోచ్ సుజీత్ మాన్ నేతృత్వంలో అక్కడే సాధన చేసిన వారు... తమకు మరో గత్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సోషల్ మీడియా ద్వారా రెజ్లర్లకు తన మద్దతు ప్రకటించాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో కష్టపడే ఆటగాళ్లు ఇలా రోడ్లపై రావాల్సి రావడం చాలా బాధగా ఉందని అతను అన్నాడు.
చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
Comments
Please login to add a commentAdd a comment