indian wrestling
-
చెదిరిన స్వప్నం
భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్‌లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్‌పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది. ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్‌లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది. ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది. కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్బ్రాంట్తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం. గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్‌సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్‌లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్‌కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్‌ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్‌కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి. -
'నా ప్రేమకు దక్కింది విషమే'..బ్రిజ్ భూషణ్ జీవిత పాఠాలు..!
ఉత్తరప్రదేశ్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయ జీవితంలో బిజీ అయిపోయారు! ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. 2024లో తాను ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే..ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లే మిగులుతాయి. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే. కొందరు నన్ను తిడుతున్నారు. పొగుడుతున్నారు. నా పేరే నిత్యం పలుకుతున్నారు.'అంటూ సాగిన ఈ కవితను 2024 ఎన్నికల కోసం బీజేపీ నిర్వహించిన మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా వినిపించారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశం కోల్పోయినదంతా ప్రధాని మోదీ తీసుకువస్తున్నారని అన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి:వీడియో, ఆడియో, వాట్సాప్ చాటింగ్ ఆధారాలుంటే చూపించండి... -
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్‌పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్‌భూషణ్‌పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం. ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్‌భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్ ‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్‌భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’. సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్‌భూషణ్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది. -
Wrestlers Protest: మోదీ జీ.. మా ‘మన్‌కీ బాత్’ వినండి..!
న్యూఢిల్లీ: తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో నిరసన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లు ఇప్పుడు ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. తాము విజయం సాధించినప్పుడు ఫోటోలు దిగి ఉత్సాహపరచిన ప్రధాని తమ గోడును పట్టించుకోకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ (మనసులో మాట)ను ఉద్దేశించి రెజ్లర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని బేటీ బచావో, బేటీ పడావో గురించి మాట్లాడుతారు. చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున.. అందరి మనసులో మాటను వింటారు. కానీ మా ‘మన్‌కీ బాత్’ను ఆయన వినలేరా. మేం విజయాలు సాధించినప్పుడు ఇంటికి పిలిచి గౌరవించడంతో పాటు మమ్మల్ని తన బిడ్డలంటూ చెప్పుకున్నారు. ఈ రోజు మా బాధ వినాలని ఆయనను అభ్యర్థిస్తున్నాం’ అని 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ వ్యాఖ్యానించింది. నాలుగు రోజులుగా తాము రోడ్లపై పడుకుంటున్నా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనీసం పట్టించుకోవడం లేదని సాక్షి విమర్శించింది. ‘బహుశా నిజం ఏమిటో ప్రధానికి తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తిగతంగా కలిసి సమస్యను చెప్పాలని కోరుకుంటున్నాం. అయితే ఆయనను కలిసే మార్గం ఏమిటో మాకు తెలియడం లేదు’ అని వినేశ్ ఫొగాట్ చెప్పింది. నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లు బుధవారం రోడ్డు పైనే తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. కోచ్ సుజీత్ మాన్ నేతృత్వంలో అక్కడే సాధన చేసిన వారు... తమకు మరో గత్యంతరం లేదని పేర్కొన్నారు. మరోవైపు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సోషల్ మీడియా ద్వారా రెజ్లర్లకు తన మద్దతు ప్రకటించాడు. దేశానికే ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో కష్టపడే ఆటగాళ్లు ఇలా రోడ్లపై రావాల్సి రావడం చాలా బాధగా ఉందని అతను అన్నాడు. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం -
‘హింద్ కేసరి’ అభిజీత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘హింద్ కేసరి’ జాతీయ సీనియర్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ అభిజీత్ కాట్కే చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్ ఫైనల్లో అభిజీత్ 5–0తో హరియాణాకు చెందిన సోమ్‌వీర్‌పై విజయం సాధించాడు. విజేత అభిజీత్ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు. ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెజ్లింగ్ అకాడమీలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని, కుస్తీ క్రీడకు పూర్వ వైభవం లభించేలా కృషి చేస్తామని తెలిపారు. ‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్ బౌట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు. అనంతరం విజేత పుష్పను కవిత అభినందించారు. మెరిసిన తెలంగాణ రెజ్లర్లు... ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్స్ కాకుండా మిగతా వెయిట్ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్ ఇబ్రహీమ్.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్ అబ్దుల్... 65 కేజీల విభాగంలో విజయ్ కుమార్... 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్... 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్ బిన్ అబ్దుల్లా... 80 కేజీల విభాగంలో సందీప్ యాదవ్ కాంస్య పతకాలు సాధించారు. -
Tokyo Olympics: దహియా ధమాకా...
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ఆమెను ఓడించిన బెలారస్ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది. టోక్యో: గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా... ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి... మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ–రజత ఫైనల్ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగుయెవ్తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే... షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. వెనుకబడినా... నూరిస్లామ్ సనయేవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో రవి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరాడు. తొలి భాగం ముగిశాక రవి 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని సనయేవ్ నాలుగుసార్లు మ్యాట్‌పై అటుఇటు తిప్పేయడంతో అతనికి 2, 2, 2, 2 పాయింట్ల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్లు వచ్చాయి. సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. స్పష్టమైన ఆధిపత్యం... నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి తొలి రౌండ్లో 13–2 పాయింట్ల తేడాతో ఎడువార్డో ఆస్కార్ టిగ్రెరోస్ (కొలంబియా)పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజయం సాధించాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం దక్కిన వెంటనే బౌట్‌ను నిలిపివేసి ఆ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనిని ‘టెక్నికల్ సుపీరియారిటీ’ విజయంగా పరిగణిస్తారు. ఎడువార్డోతో జరిగిన బౌట్లో రవి మూడు నిమిషాల నిడివి గల తొలి భాగంలో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలో రవి ఒక్కసారిగా విజృంభించి ‘టేక్‌డౌన్’ ఎత్తులతో వరుసగా 2, 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో రవి 13–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించినందుకు రవిని విజేతగా ప్రకటించారు. అదే దూకుడు... తొలి రౌండ్లో గెలుపు తర్వాత క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ జియార్జి వలెంటినో వంజెలోవ్తో తలపడ్డ రవి ఇక్కడా వెనక్కి తగ్గలేదు. మరోసారి తన భుజ బలంతోపాటు బుద్ధి బలం ఉపయోగించి తొలి భాగంలో వరుసగా 2, 2, 2 పాయింట్లు స్కోరు చేసి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలో వంజెలోవ్ 2, 2 పాయింట్లు సాధించినా... రవి తానేం తక్కువ కాదన్నట్లు వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. బౌట్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా 14–4తో ఆధిక్యంలోకి వచ్చాడు. రవి ఆధిక్యం పది పాయింట్లకు చేరడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. చేతిని కొరికినా... ‘బై ఫాల్’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. కాంస్యానికి విజయం దూరంలో దీపక్ ... పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీపక్ తొలి రౌండ్లో 12–1తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అగియోమోర్ (నైజీరియా)ను ఓడించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దీపక్ 6–3తో లిన్ జుషెన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. అయితే సెమీఫైనల్లో దీపక్ 0–10తో డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. షబానౌ అలీ (బెలారస్)–నజీమ్ (సాన్మరినో) మధ్య ‘రెపిచేజ్’ బౌట్లో విజేతగా నిలిచిన రెజ్లర్‌తో నేడు జరిగే కాంస్య పతక పోరులో దీపక్ తలపడతాడు. అన్షుకు పతకావకాశం... మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. యూరోపియన్ చాంపియన్ ఇరీనా కురాచ్‌కినా (బెలారస్)తో జరిగిన బౌట్లో అన్షు 2–8తో ఓడిపోయింది. అయితే కురాచ్‌కినా ఫైనల్‌కు చేరడంతో ‘రెపిచేజ్’ పద్ధతిలో అన్షుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఫైనల్ చేరే క్రమంలో కురాచ్‌కినా చేతిలో ఓడిన వారి మధ్య బౌట్లను నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారు కురాచ్‌కినా చేతిలో సెమీఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో కాంస్యం కోసం తలపడతారు. నేడు జరిగే ‘రెపిచేజ్’ తొలి రౌండ్లో కొబ్లోవా (రష్యా)తో అన్షు ఆడుతుంది. ఇందులో గెలిస్తే నికొలోవా (బల్గేరియా)తో అన్షు కాంస్యం కోసం తలపడుతుంది. గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –రవి దహియా -
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
న్యూఢిల్లీ: కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్ కుక్ అమెరికాకు, గ్రీకో రోమన్ కోచ్ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. -
13 మంది రెజ్లర్లపై సస్పెన్షన్
న్యూఢిల్లీ : శిక్షణకు హాజరు కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన 13 మంది రెజ్లర్లపై భారతరెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సస్పెన్షన్ విధించింది. వీరితో పాటు వివిధ కారణాలరీత్యా పురుషుల ఫ్రీస్టయిల్ జాతీయ చీఫ్ కోచ్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కోచ్ రజనీష్, మహిళల కోచ్ రమణి చానులపై కూడా వేటు వేసింది.