భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో 23 ఏళ్ల రవి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖరారు చేశాడు. పతకం రంగు స్వర్ణమా, రజతమా అనేది నేడు తేలుతుంది. భారత్‌కే చెందిన మరో యువ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మలిక్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా... ఆమెను ఓడించిన బెలారస్ ప్రత్యర్థి ఫైనల్‌కు చేరడంతో రెపిచేజ్ పద్ధతి ప్రకారం అన్షుకు కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం లభించింది.
టోక్యో: గత రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో తాను సాధిస్తున్న పతకాలు గాలివాటంగా రాలేదని భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా నిరూపించాడు. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా... ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి... మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో స్వర్ణ–రజత ఫైనల్ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించాడు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్‌ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జవూర్ ఉగుయెవ్‌తో నేడు జరిగే ఫైనల్లో రవి దహియా గెలిస్తే... షూటర్ అభినవ్ బింద్రా (2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.
వెనుకబడినా...
నూరిస్లామ్ సనయేవ్ (కజకిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో రవి అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరాడు. తొలి భాగం ముగిశాక రవి 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని సనయేవ్ నాలుగుసార్లు మ్యాట్‌పై అటుఇటు తిప్పేయడంతో అతనికి 2, 2, 2, 2 పాయింట్ల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్లు వచ్చాయి. సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు.
తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం.
స్పష్టమైన ఆధిపత్యం...
నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రవి తొలి రౌండ్‌లో 13–2 పాయింట్ల తేడాతో ఎడువార్డో ఆస్కార్ టిగ్రెరోస్ (కొలంబియా)పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజయం సాధించాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం దక్కిన వెంటనే బౌట్‌ను నిలిపివేసి ఆ ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనిని ‘టెక్నికల్ సుపీరియారిటీ’ విజయంగా పరిగణిస్తారు.
ఎడువార్డోతో జరిగిన బౌట్‌లో రవి మూడు నిమిషాల నిడివి గల తొలి భాగంలో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మూడు నిమిషాల నిడివి గల రెండో భాగంలో రవి ఒక్కసారిగా విజృంభించి ‘టేక్‌డౌన్’ ఎత్తులతో వరుసగా 2, 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. దాంతో రవి 13–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించినందుకు రవిని విజేతగా ప్రకటించారు.
అదే దూకుడు...
తొలి రౌండ్‌లో గెలుపు తర్వాత క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ జియార్జి వలెంటినో వంజెలోవ్‌తో తలపడ్డ రవి ఇక్కడా వెనక్కి తగ్గలేదు. మరోసారి తన భుజ బలంతోపాటు బుద్ధి బలం ఉపయోగించి తొలి భాగంలో వరుసగా 2, 2, 2 పాయింట్లు స్కోరు చేసి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
రెండో భాగంలో వంజెలోవ్ 2, 2 పాయింట్లు సాధించినా... రవి తానేం తక్కువ కాదన్నట్లు వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. బౌట్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా 14–4తో ఆధిక్యంలోకి వచ్చాడు. రవి ఆధిక్యం పది పాయింట్లకు చేరడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు.
చేతిని కొరికినా...
‘బై ఫాల్’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్ రెజ్లర్ సనయేవ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్ రవి చేతిని కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు.
కాంస్యానికి విజయం దూరంలో దీపక్ ...
పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీపక్ తొలి రౌండ్‌లో 12–1తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అగియోమోర్ (నైజీరియా)ను ఓడించాడు. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దీపక్ 6–3తో లిన్ జుషెన్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. అయితే సెమీఫైనల్లో దీపక్ 0–10తో డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. షబానౌ అలీ (బెలారస్)–నజీమ్ (సాన్‌మరినో) మధ్య ‘రెపిచేజ్’ బౌట్‌లో విజేతగా నిలిచిన రెజ్లర్‌తో నేడు జరిగే కాంస్య పతక పోరులో దీపక్ తలపడతాడు.
అన్షుకు పతకావకాశం...
మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. యూరోపియన్ చాంపియన్ ఇరీనా కురాచ్‌కినా (బెలారస్)తో జరిగిన బౌట్‌లో అన్షు 2–8తో ఓడిపోయింది. అయితే కురాచ్‌కినా ఫైనల్‌కు చేరడంతో ‘రెపిచేజ్’ పద్ధతిలో అన్షుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఫైనల్ చేరే క్రమంలో కురాచ్‌కినా చేతిలో ఓడిన వారి మధ్య బౌట్‌లను నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన వారు కురాచ్‌కినా చేతిలో సెమీఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో కాంస్యం కోసం తలపడతారు. నేడు జరిగే ‘రెపిచేజ్’ తొలి రౌండ్‌లో కొబ్లోవా (రష్యా)తో అన్షు ఆడుతుంది. ఇందులో గెలిస్తే నికొలోవా (బల్గేరియా)తో అన్షు కాంస్యం కోసం తలపడుతుంది.
గతంలో సనయేవ్‌ను రెండుసార్లు ఓడించాను. దాంతో భారీ ఆధిక్యంతో వెనుకబడినా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నా. సనయేవ్‌కు నేను ఎక్కువ పాయింట్లు ఇవ్వాల్సింది కాదు. ఇంకా నా పని పూర్తి కాలేదు. నేను స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. స్వర్ణం గెలిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది.
–రవి దహియా
Comments
Please login to add a commentAdd a comment