భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్‌లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్‌పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.
అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది.
ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్‌లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది.
ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది.
కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్‌బ్రాంట్‌తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం.
గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్‌పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.
వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్‌సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్‌లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్‌కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్‌ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు.
ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్‌కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి.
చెదిరిన స్వప్నం
Published Thu, Aug 8 2024 6:02 AM | Last Updated on Thu, Aug 8 2024 6:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment