‘‘సెమీ ఫైనల్ తర్వాత తను 2.7 కిలోల అధిక బరువు ఉన్నట్లు తేలింది. గంటా ఇరవై నిమిషాల వ్యాయామం తర్వాత కూడా ఇంకా కిలోన్నర బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేము మరో యాభై నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేయిస్తూనే ఉన్నాం. తన శరీరం నుంచి ఒక్క చెమట చుక్క కూడా బయటకు రాలేదు.
తనను నిర్ణీత బరువుకు రావడమే లక్ష్యంగా అర్ధ రాత్రి నుంచి మొదలు పెడితే తెల్లవారుజామున 5.30 నిమిషాల వరకు తను భిన్న రకాల కార్డియో ఎక్సర్‌సైజులు, రెజ్లింగ్ మూవ్స్ చేస్తూనే ఉంది. గంట గంటకు కేవలం రెండు- మూడు నిమిషాల విశ్రాంతి మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కసరత్తులు మొదలు.
ఫలితంగా కాసేపటి తర్వాత ఆమె కుప్పకూలిపోయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ గంటపాటు వ్యాయామం చేసింది. నేనేదో ఉద్దేశపూర్వకంగా తన కష్టం గురించి చెప్పడానికే ఈ పోస్టు పెట్టడం లేదు. తనను చూస్తే ఆరోజు నిజంగా భయం వేసింది. ఒకానొక దశలో చచ్చిపోతుందేమోనన్న భావన కలిగింది’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు.
గోల్డెన్ బౌట్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఎంతగా శ్రమించిందో తమకు మాత్రమే తెలుసునంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన హర్యానా అథ్లెట్ వినేశ్ ఫొగట్‌పై.. స్వర్ణ పతక రేసుకు ముందు అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండానే ఆమె వెనుదిరగాల్సి వచ్చింది.
నంబర్ వన్‌ను ఓడించాను కదా!
అయితే, తుదిపోరుకు అర్హత సాధించే క్రమంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదు గనుక.. సెమీస్ వరకు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాల్సిందిగా వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేసింది. కానీ.. కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ వినేశ్‌కు అమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. నిజమైన చాంపియన్ నువ్వేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినేశ్ కోచ్ వోలర్ సైతం ఫేస్‌బుక్ వేదికగా పైవిధంగా పోస్ట్ పెట్టాడు. అంతేకాదు.. వినేశ్ వరల్డ్ నంబర్ వన్ యూ సుసాకీ ఓడించినందుకు గర్వంగా ఉందని.. ఈ విషయంలో వినేశ్ సైతం సంతృప్తిగా ఉందని తెలిపాడు. నిర్విరామ కసరత్తుల నేపథ్యంలో ఆస్పత్రి పాలై.. తిరిగి వచ్చిన తర్వాత.. ‘‘మన ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలమని నిరూపించాం. అత్యుత్తమ రెజ్లర్‌ను నేను ఓడించాను. పతకాల కంటే మన ప్రదర్శనే ముఖ్యం’’ అని వినేశ్ తనతో అన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే, కాసేపటికే పోస్ట్ డిలీట్ చేయడం గమనార్హం.
చదవండి: Vinesh Phogat: రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ..
Comments
Please login to add a commentAdd a comment