
ప్యారిస్ ఒలింపిక్స్-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్ ఫొగట్ తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.
మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్‌కు చేరిన వినేశ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.
కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు
ఆ తర్వాత స్పోర్ట్స్ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్ ఫొగట్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్ భారతావనికి నిరాశే మిగిలింది.
అయితే, ఫైనల్ వరకు వినేశ్ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్ చేశారు.
కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం
అంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్‌కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.
హామీ మరిచారా?
‘‘వినేశ్ ఫొగట్ మా కూతురు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.
ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్ ఫొగట్ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వినేశ్ ఫొగట్ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్ ఫొగట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.
ఈ మూడింటిలో ఏది కావాలి?
అందుకే కేబినెట్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికారణ్ పథకం కింద ప్లాట్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్ వినేశ్ ఫొగట్‌కు ఆఫర్ ఇచ్చింది.
అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్ ఫొగట్.. తన భర్త, రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.
చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’