భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్‌గా వెలుగొందిన వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే తనతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారని.. నాకేదో అండగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. తన విషయంలో చాలా రాజకీయాలు నడిచాయని.. అందువల్లే తన మనసు విరిగిపోయిందని తెలిపింది.
అనూహ్య రీతిలో అనర్హత వేటు
అందుకే విరక్తిపుట్టి ఇక కుస్తీకి స్వస్తి పలకాలనే కఠిన నిర్ణయానికి వచ్చానంటూ వినేశ్ ఉద్వేగానికి లోనైంది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక బౌట్‌కు ముందు అనూహ్య రీతిలో ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
నో మెడల్
ఫలితంగా.. వినేశ్‌కు స్వర్ణం లేదంటే రజతం ఖాయమనుకున్న భారతీయుల కల చెదిరిపోయింది. అయితే, ఫైనల్ చేరే వరకు తన ప్రయాణం నిబంధనలకు అనుగుణంగానే సాగింది కాబట్టి.. కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. అనేక వాయిదాల అనంతరం వినేశ్ ఫొగట్ అభ్యర్థనను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని.. అలాంటి పరిస్థితిలో పతకం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.
ఆస్పత్రిలో ఉండగా పీటీ పరామర్శ
ఇదిలా ఉంటే.. ఫైనల్‌కు ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన వినేశ్ ఫొగట్ అస్వస్థకు గురై ప్యారిస్ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో భారతీయులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలబడగా.. ఐఏఓ అధ్యక్షురాలు పీటీ ఉష సైతం హాస్పిటల్‌కు వెళ్లి వినేశ్‌ను పరామర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉష నెట్టింట షేర్ చేసింది.
నాడు ఢిల్లీ వీధుల్లో పోరాటం
అయితే, వినేశ్ గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌లో వినేశ్‌పై అనర్హత వేటు పడగానే అటు బీజేపీ పెద్దలు, పీటీ ఉష, కేంద్రం నియమించిన న్యూట్రీషనిస్టులపై ఆమె అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.
వినేశ్‌దే బాధ్యత అన్నట్లుగా
ఈ నేపథ్యంలో ఉష స్పందిస్తూ.. బరువు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు అథ్లెట్లదేనని.. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదంటూ కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాల క్రమంలో రెజ్లింగ్‌కు స్వస్తి పలుకుతున్నాని ప్రకటించిన వినేశ్ ఫొగట్.. ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశించింది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.
అందుకే నా గుండె పగిలింది
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పీటీ ఉష తనకు కష్టసమయంలో ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించింది. ‘‘పీటీ ఉష మేడమ్ ఆస్పత్రిలో నన్ను చూడటానికి వచ్చారు. ఒక ఫొటో తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని మీరు అనవచ్చు. అయితే, ప్యారిస్ క్రీడాగ్రామంలోనూ రాజకీయాలు నడిచాయి.
అందుకే నా గుండె పగిలింది. రెజ్లింగ్ వదలొద్దు అని చాలా మంది నాకు చెబుతూ ఉంటారు. కానీ ఇంకా ఆటలో కొనసాగడం వల్ల నాకేం ఒరుగుతుంది? అక్కడ ప్రతీదీ రాజకీయమే. మనం ఆస్పత్రిలో పడి ఉన్నపుడు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా.
పీటీ ఉషది నాటకం
నా జీవితంలో అత్యంత దుర్భర సమయంలో ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి.. నాకు అండగా ఉన్నానన్న ప్రచారం కోసం దానిని సోషల్ మీడియాలో పెట్టడం సరైందేనా? మద్దతు పలకడం కాదది.. అండగా ఉన్నట్లు నటించడం. నిజానికి మెడల్ కోసం నా తరఫున ఒలింపిక్ సంఘం దేశం పేరుతో పిటిషన్ వేయాలి.
కానీ నాకెవరూ అండగా లేకపోవడంతో నా పేరు మీదనే కేసు ఫైల్ చేశాను’’ అని కాంగ్రెస్ నేత, 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ పీటీ ఉషను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఆమెను ఈ పదవికి నామినేట్ చేసింది.
చదవండి: నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్ ఫోగట్
Comments
Please login to add a commentAdd a comment