Vinesh vs Babita?: రాజకీయాల్లోకి వినేశ్‌?.. అక్కతో పోటీకి సై! | Is Vinesh vs Cousin Babita Phogat In Haryana Polls Olympian May Join Politics | Sakshi
Sakshi News home page

Vinesh vs Babita?: రాజకీయాల్లోకి వినేశ్‌?.. అక్కతో పోటీకి సై!

Published Tue, Aug 20 2024 3:39 PM | Last Updated on Tue, Aug 20 2024 5:40 PM

Is Vinesh vs Cousin Babita Phogat In Haryana Polls Olympian May Join Politics

భారత స్టార్‌ రెజ్లర్‌, ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ రాజకీయాల్లో అడుగుపెట్టనుందా?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనుందా?.. అక్కపై పోటీకి సిద్దమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి వినేశ్‌ సన్నిహిత వర్గాలు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఫైనల్‌ చేరి.. వినేశ్‌ ఫొగట్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

పతకం చేజారింది
ఇంతరకు భారత మహిళా రెజ్లర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సాధించింది వినేశ్‌ ఫొగట్‌. అయితే, నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు కనీసం సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌కు అప్పీలు చేయగా.. నిరాశే ఎదురైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వినేశ్‌ ఫొగట్‌కు భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు సోషల్‌ మీడియాను హోరెత్తించారు. ఇక వినేశ్‌ ప్యారిస్‌ నుంచి తిరిగి రాగానే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వినేశ్‌ అడుగుపెట్టగానే.. కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా ఆమె మెడలో మాల వేసి సత్కరించారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం వినేశ్‌కు సాదరస్వాగతం పలికారు.

అక్కపై పోటీకి సై?
ఈ నేపథ్యంలో వినేశ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాను మాత్రం క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టబోవడం లేదని ఆమె స్పష్టతనిచ్చింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. వినేశ్‌ ఫొగట్‌ పొలిటికిల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి వినేశ్‌ కుటుంబ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అవును... అయినా వినేశ్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయకూడదు?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్‌ ఫొగట్‌ వర్సెస్‌ బబితా ఫొగట్‌, బజరంగ్‌ పునియా వర్సెస్‌ యోగేశ్వర్‌ దత్‌.. చూసే అవకాశం లేకపోలేదు. వినేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతోందో చెప్పలేం’’ అని పేర్కొన్నాయి. 

బావ మద్దతు వినేశ్‌కే?
కాగా బబితా ఫొగట్‌ మరెవరో కాదు.. వినేశ్‌ పెదనాన్న, చిన్ననాటి కోచ్‌ మహవీర్‌ ఫొగట్‌ కూతురు. ఆమె బీజేపీ తరఫున ఈ ఏడాది అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బజరంగ్‌ పునియా కూడా మహవీర్‌ అల్లుడే. రెజ్లర్‌ సంగీత ఫొగట్‌ భర్త.. అతడు కూడా రెజ్లరే. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్‌కు మద్దతుదారుడు.

చదవండి: Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement