వినేశ్‌ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? | Olympics 2024 Why Vinesh Phogat Get Disqualified Explained Whom To Be Blame | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది?

Published Thu, Aug 8 2024 12:01 PM | Last Updated on Thu, Aug 8 2024 1:56 PM

Olympics 2024 Why Vinesh Phogat Get Disqualified Explained Whom To Be Blame

50 కిలోల 100 గ్రాములు... వెయింగ్‌ స్కేల్‌పై వినేశ్‌ ఫొగాట్‌ బరువు కనిపించింది! అంతే... అక్కడే ఆశలు నేలకూలాయి. మరో మాటకు తావు లేకుండా అనర్హత... బంగారు పతకం కోసం కన్న కలలు అక్కడే కల్లలయ్యాయి... ఆ 100 గ్రాములను తగ్గించేందుకు మరికొంత సమయం కావాలంటూ భారత బృందం చేసిన అభ్యర్థనను నిర్వాహకులు లెక్క చేయనేలేదు.

అసాధారణ ఆటతో ఫైనల్‌ వరకు చేరి తన ఒలింపిక్‌ పతక లక్ష్యాన్ని నిజం చేసుకున్న ఫొగాట్‌కు తుది సమరానికి కొన్ని గంటల ముందు ఆ పతకం కూడా దక్కదని తేలిపోయింది. రెజ్లింగ్‌లో భారత మహిళ తొలిసారి ఫైనల్‌కు చేరడంతో పసిడి పతకాన్ని ఆశించిన మన అభిమానులకు కూడా అది దక్కదని అర్థమైపోవడంతో అన్నింటా నిరాశ అలముకుంది. ఆమె మూడు మ్యాచ్‌ల కష్టాన్ని కూడా నిర్వాహకులు లాగేసుకోవడం ఎవరూ ఊహించని విషాదం.

ఒలింపిక్స్‌ మహిళల రెజ్లింగ్‌ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌ చేరిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ బరిలోకి దిగకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌కు కొన్ని గంటల ముందు జరిగే ‘వెయింగ్‌’లో వినేశ్‌ బరువు 50 కిలోల 100 గ్రాములుగా తేలింది. నిబంధనల ప్రకారం అనుమతించిన బరువుకంటే ఏమాత్రం ఎక్కువ బరువు ఉన్నా ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడుతుంది.

ఫైనల్‌ కోసమే కాకుండా ఓవరాల్‌గా ఆమె గెలిచిన మూడు బౌట్‌లను కూడా గుర్తించకుండా వినేశ్‌ను నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. సెమీస్‌లో వినేశ్‌ చేతిలో ఓడిన యుస్నెలిస్‌ గుజ్‌మాన్‌ లోపెజ్‌ (క్యూబా) ఫైనల్‌ చేరింది. దాంతో ఎలాంటి పతకం లేకుండా చివరి స్థానంతో ఫొగాట్‌ నిష్క్రమించింది. వినేశ్‌ అనర్హత నేపథ్యంలో అసలు ఏం జరిగింది... ఎలాంటి పరిణామాలు సంభవించాయో చూస్తే...

కేటగిరీని మార్చుకొని... 
కెరీర్‌ ఆరంభం నుంచి కొన్నాళ్ల క్రితం వరకు కూడా వినేశ్‌ 53 కేజీల విభాగంలో పోటీ పడింది. అయితే ఢిల్లీలో వివాద సమయంలో కొంత కాలం ఆటకు దూరమయ్యాక అందులో మరో ప్లేయర్‌ రావడంతో కేటగిరీ మార్చుకుంటూ 50 కేజీలకు తగ్గింది. ఇందులోనే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.  
తొలి రోజు ఏం జరిగింది...

పోటీలకు ముందు బరువు తూచే సాధారణ ప్రక్రియ ‘వెయింగ్‌’లో వినేశ్‌ బరువు 49.90 కిలోలుగా వచ్చింది. అక్కడే కాస్త ప్రమాదం కనిపించినా, 50కి లోపు ఉండటంతో సమస్య రాలేదు. మూడు బౌట్‌లు ఆడి వరుస విజయాలతో ఫొగాట్‌ ఫైనల్‌ చేరింది.  

ఆ తర్వాత ఏమైంది... 
పోటీ పడే క్రమంలో విరామాల మధ్య ఆహారం, నీళ్లు తీసుకోవడంతో ఆమె సహజంగానే బరువు పెరిగింది. సెమీస్‌ తర్వాత ఇది 52.70 కేజీలుగా ఉంది. బుధవారం ‘వెయింగ్‌’లోగా 2.70 కేజీలు తగ్గించాల్సిన అవసరం వచి్చంది.

ఏం చేశారు...?
వినేశ్‌తో పాటు ఆమె న్యూట్రిషనిస్ట్, భారత చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దిన్షా పర్దివాలా తదితరులు కలిసి రాత్రికి రాత్రే బరువు తగ్గించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆహారం, నీరు ఇవ్వకపోవడంతోపాటు 12 గంటల వ్యవధిలో వివిధ రకాల ఎక్సర్‌సైజ్‌లు, ఆవిరి స్నానాలువంటి వాటితో వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే బరువు తగ్గించాలని చూశారు. 

చెమట రావడం తగ్గిపోవడంతో జుట్టు కూడా కత్తిరించారు. ఒకదశలో రక్తం తగ్గించాలని కూడా భావించారు. అయితే వీటన్నింటి కారణంగా వినేశ్‌ దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినా అన్నింటికీ సిద్ధమైంది.  

అన్నింటికీ సిద్ధపడ్డా... 
సందేహంగానే వినేశ్‌ ‘వెయింగ్‌’కు సిద్ధం కాగా... చివరకు 50 కేజీలకంటే మరో 100 గ్రాములు ఎక్కువగానే వచి్చంది. కొంత సమయం ఉంటే అదీ తగ్గించే వాళ్లమని మెడికల్‌ ఆఫీసర్‌ పర్దివాలా వెల్లడించారు. ఒక్కసారి అనర్హురాలని తేలడంతో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్‌తో ఆమెకు చికిత్సను అందించారు.  

తప్పెవరిది?  
ప్లేయర్‌ సాధారణంగా తన ఆటపైనే దృష్టి పెడతారు. ఆమెతో పని చేసే వైద్యబృందం    ఇలాంటి విషయాలను చూసుకోవాలి. పోటీలు జరిగే సమయంలో జాగ్రత్తగా ఆహారం అందించాలి. ముఖ్యంగా బౌట్‌ల మధ్య ఆమెకు ఇచి్చన ఆహారం విషయంలో బరువు పెరిగే అంశాలను చూసుకోవాల్సింది. 

ఒలింపిక్స్‌లాంటి ఈవెంట్‌లో ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఎంత పెరిగినా సెమీఫైనల్‌ బౌట్‌ తర్వాత చూసుకోవచ్చు... ఎలాగైనా తగ్గించవచ్చనే అతి విశ్వాసమే దెబ్బ కొట్టిందని అర్థమవుతుంది. ఈ విషయంలో వైద్య బృందాన్ని తప్పు పట్టవచ్చు.  

రజతం కూడా ఇవ్వరా! 
2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత రెజ్లింగ్‌ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్‌కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్‌లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్‌ మార్చారు. నిబంధనల ప్రకారం   రెండు రోజులూ బరువు చూస్తారు.

రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్‌ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్‌ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్‌కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు.

కానీ అదీ నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్‌లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్‌ రెండో వెయింగ్‌లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్‌కు ఆ అవకాశమూ లేకపోయింది.

వినేశ్‌ ఊహించలేదా! 
సాధారణంగా ఆటగాళ్లు తమ శరీర బరువుకు దగ్గరలో ఉండే వెయిట్‌ కేటగిరీల్లో పోటీ పడతారు. అలా అయితే సన్నద్ధత సులువవుతుంది. పోటీలు లేని సమయంలో వినేశ్‌ 56–57 కేజీల బరువుంటుంది. ఏదైనా టోర్నీ రాగానే ఆ సమయంలో ఎలాగైనా కష్టపడి తన బరువును తగ్గించుకుంటూ వచ్చి ఆటకు సిద్ధమైపోయేది. ఈసారి కూడా అలాగే ఆశించి ఉండవచ్చు.

కానీ బుధవారం ఉదయం అది సాధ్యం కాలేదు. అంచనాలు తప్పడంతో 100 గ్రాముల తేడా వచ్చేసింది. ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో 2 కిలోల వరకు సడలింపు ఉంది. ఆ టోర్నీల్లో అయితే 52 కేజీలు వచ్చినా సమస్య రాకపోయేది. కానీ ఒలింపిక్స్‌ నిబంధనలు చాలా కఠినంగా ఉండి అలాంటి సడలింపు లేదు.  

భారత్‌లో నిరసన... 
వినేశ్‌ ఉదంతంపై భారత పార్లమెంట్‌లో కూడా తీవ్ర చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిరసనను తెలియజేయాలని, ఆమెకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు వినేశ్‌తో ఉన్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.

పారిస్‌లో పీటీ ఉష నేతృత్వంలో ఐఓఏ అధికారికంగా ఫిర్యాదు చేసినా... అంతర్జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య మాత్రం ‘అన్నీ నిబంధనల ప్రకారమే’ అంటూ అన్నింటినీ కొట్టిపారేసింది. 

మాజీ బాక్సర్, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత విజేందర్‌ సింగ్‌... ఇందులో ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. అసాధారణంగా సాగిన వినేశ్‌ ఎదుగుదలను చూసి ఎవరైనా ఏదైనా చేసి ఉంటారని, 100 గ్రాములు అనే విషయం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement