Vinesh Phogat's Love Life: Who Is Somvir Rathee: ‘‘సోమ్‌వీర్.. నా జీవితంలోని ముఖ్యమైన పాత్రలన్నింటినీ అతడే పోషించాడు. ప్రతీ విషయంలోనూ నాకు అండగా నిలిచాడు. కఠినసవాళ్లు ఎదురైన ప్రతిసారీ.. నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నాకు రక్షణగా నిలిచాడు. నా ప్రయాణం సజావుగా సాగేందుకు తను ఎన్నో వదులుకున్నాడు. అత్యంత విశ్వసనీయత, అంకితభావం, నిజాయితీ ఉన్న వ్యక్తి. తను గనుక నాతో లేకుంటే అన్న ఊహే కష్టంగా ఉంటుంది.
తన తోడు లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు. ఎల్లవేళలా నాతో కలిసి అడుగులు వేశాడు. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు.. అవసరమైన వేళ నాకు రక్షణంగా ముందు వరుసలో నిలబడ్డాడు. నా విజయాల్లో మాత్రం వెనకే ఉన్నాడు నా ప్రియమైన స్నేహితుడు’’- భర్త సోమ్‌వీర్ రాఠీ గురించి భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ భావోద్వేగంతో రాసిన వాక్యాలు. తన జీవితంలో తల్లి పాత్ర ఎంత ఉందో జీవన సహచరుడి పాత్ర కూడా అంతకంటే తక్కువేమీ కాదని అతడిపై ఇలా అక్షరాల రూపంలో ప్రేమను వ్యక్తపరిచింది.
తండ్రి ప్రేమ చిన్ననాడే దూరం.. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో
హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ తనకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు తండ్రిని కోల్పోయింది. బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోవడంతో ఆ బాధ్యత భార్యపై పడింది. ముగ్గురు పిల్లల పోషణే గగనమైన సమయంలో క్యాన్సర్ రూపంలో ప్రాణాంతక వ్యాధి బారిన పడిన విషయం ఆమెకు తెలిసింది.
అయినా.. ఆ తల్లి కుంగిపోలేదు. ధైర్యంగా మహ్మమారితో పోరాడి గెలిచింది. తన పిల్లల్లోనూ ధైర్యం నూరిపోసి.. కఠిన సవాళ్లకు ఎదురీదేలా చేసి.. రెజ్లర్లుగా తీర్చిదిద్దింది. అలా తల్లి నుంచి స్ఫూర్తి పొందిన వినేశ్ ఫొగట్.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సోమ్‌వీర్ రాఠీతో 2011లో పరిచయం ఏర్పడింది.
వినేశ్ ప్రేమ కథ అక్కడే మొదలు
అతడు కూడా హర్యానాకు చెందినవాడే. వినేశ్ మాదిరి తనూ రెజ్లరే. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్న సోమ్‌వీర్ రాఠీ కూడా రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. విధి నిర్వహణలో భాగంగా వినేశ్‌తో మాట కలిపిన సోమ్‌వీర్.. అనతికాలంలోనే ఆమెకు మంచి స్నేహితుడయ్యాడు. సంతోషం.. బాధ ఏదైనా ముందుగా తనతోనే పంచుకునేంతగా వినేశ్ మనసుకు చేరువయ్యాడు.
కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో అన్నిరకాలుగా అండగా ఆమెకు నిలిచాడు. కష్టసుఖాల్లో వెంట ఉండే తన ప్రియమైన స్నేహితుడే.. భర్తగా మారితే ఇంకెంత బాగుంటుందోనని భావించిన వినేశ్ కలను నిజం చేస్తూ.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు సోమ్‌వీర్.
ఎనిమిదో అడుగు
2018 నాటి జకార్తా ఆసియా క్రీడల్లో వినేశ్ స్వర్ణం గెలిచి స్వదేశానికి చేరుకున్న శుభముహూర్తాన.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోనే ఆమె వేలికి ఉంగరం తొడిగి.. తన మనసులోని మాటను వెల్లడించాడు. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు నిండు మనసుతో ఆశీర్వదించాయి. అదే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశాయి.
అయితే, ఆ సమయంలో వినేశ్- సోమ్‌వీర్ తమ కుటుంబ సభ్యులకు ఓ షరతు విధించారు. పెళ్లి వేడుకలోని ప్రతీ తంతులో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉపయోగించాలని కోరారు. తద్వారా రెండు మనసుల కలయికను సంప్రదాయబద్దంగా తెలియజేసేందుకు ఆడంబరాలు అవసరం లేదనే సందేశాన్ని యువ జంటలకు ఇచ్చి కపుల్ గోల్స్ సెట్ చేశారు.
అంతేకాదు.. వివాహ సమయంలో ఏడడుగులతో పాటు ఎనిమిదో అడుగు కూడా కలిసి వేశారు వినేశ్- సోమ్‌వీర్. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ పరస్పర అవగాహన, ప్రేమతో ముందుకు సాగుతున్నారు.
వినేశ్ తన ఆరో ప్రాణం
వినేశ్‌కు రెజ్లింగ్ అంటే ప్రాణం. సోమ్‌వీర్‌కు ఆమె ఆరోప్రాణం. అందుకే ఆమె ఆశయం కోసం తన కెరీర్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. అంతేకాదు అన్యాయాన్ని సహించలేని గుణం ఉన్న వినేశ్ తోటి మహిళా రెజ్లర్ల కోసం న్యాయపోరాటానికి దిగినప్పుడూ నా మద్దతు నీకేనంటూ కొండంత భరోసా ఇచ్చాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య నాటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు వెనుక నుంచే ప్రోత్సాహం అందించాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆమె వెంటే ఉన్న సోమ్‌వీర్.. పతకం లేకుండా తన సహచరి స్వదేశానికి తిరిగి రావడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.
మరేం పర్లేదు సోమ్‌వీర్
భార్యకు దక్కిన అపూర్వ స్వాగతానికి, మద్దతుకు సంతోషిస్తూనే.. దేశం మొత్తం ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్దుడవుతూనే... మెడల్ గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరేం పర్లేదు సోమ్‌వీర్.. నీ సహచరి వినేశ్ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే యావత్ భారతావని హృదయాలు గెలిచింది. నీ పట్ల తన ప్రేమను చాటుకుని మీ బంధం ఎంత దృఢమైందో కూడా చెప్పింది!!
అనర్హత వేటు.. పతక నిరాకరణ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సంచలన విజయాలతో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్ అనూహ్య రీతిలో విశ్వ క్రీడల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)పై గెలుపొందిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఓడించింది.
ఈ క్రమంలో సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అయితే, పసిడి పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా ఆమెపై వేటు పడింది. అయితే,సెమీస్ వరకు తన ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్‌ను కోరగా.. వినేశ్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024
Comments
Please login to add a commentAdd a comment