భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత అంశంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పొప్పులను ఎంచుతూ వినేశ్ అనుకూల, ప్రతికూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత ఒలింపిక్ సంఘం(IOA) వైద్య బృందం తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినేశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వినేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. పార్లమెంటులోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య వినేశ్ అంశమై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో IOA అధ్యక్షురాలు పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైద్య బృందాన్ని సమర్థిస్తూ.. వినేశ్, ఆమె కోచ్‌దే తప్పు అన్నట్లుగా పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు.. ‘‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అంశం అనేది పూర్తిగా సదరు అథ్లెట్, అతడు లేదంటే ఆమె కోచ్ బాధ్యత.
ఈ విషయంలో IOAచే నియమితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దీవాలా, ఆయన బృందానికి ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదు. IOA మెడికల్ టీమ్, డాక్టర్ పార్దీవాలాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా.
వాస్తవాలు తెలుసుకోకుండా IOA వైద్య బృందాన్ని బాధ్యుల్ని చేస్తూ.. వారిని తప్పుబట్టడం సరికాదు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న ప్రతీ భారత అథ్లెట్‌కు వారికంటూ సొంత సహాయక సిబ్బంది ఉంది. ఎన్నో ఏళ్లుగా వారితోనే ఈ అథ్లెట్ ప్రయాణం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే IOA మెడికల్ టీమ్‌ను నియమించాం.
పోటీల సమయంలో ఆటగాళ్లు గనుక గాయపడితే.. వారికి చికిత్స అందించడం మాత్రమే వీరి ప్రాథమిక విధి. తమకంటూ సొంతంగా న్యూట్రీషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్‌లేని అథ్లెట్లకు కూడా వీరు సేవలు అందిస్తారు’’ అని పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినేశ్ ఫొగట్ బరువు విషయంలో వినేశ్‌తో పాటు ఆమె కోచ్‌లదే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో హర్యానా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తద్వారా ఈ క్రీడాంశంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
ఫైనల్‌కు ముందు బరువు తూచగా.. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫలితంగా వినేశ్ ఫొగట్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు అప్పీలు చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు ఆగష్టు 13న వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment