క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్‌లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్‌కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.
ఒలింపిక్స్‌లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్‌కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్‌కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.
2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.
మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్‌లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు.
అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్‌కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది.
చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్‌కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్‌తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.
అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్‌కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్‌కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.
ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.
100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.
వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969
Comments
Please login to add a commentAdd a comment