హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కాయి. అభ్యర్థలు ఎంపిక, ప్రచారాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌తో సహా ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. అధికారమే అవధిగా వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత స్టారల్ రెజర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇరువురు హస్తం కండువా కప్పుకున్నారు. వినేశ్, బజరంగ్ వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికట్లో పోటీ చేయనున్నారు.
అయితే వినేశ్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పునియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.
కాగా గతేడాది భారత రెజ్లింగ్ సమాక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం బ్రిజ్ భూషన్‌కు బీజేపీ కైసర్‌గంజ్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ సింగ్‌కు కేటాయించింది.
కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment