స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి | Is This Way Of Encouraging Sportspersons: SC Chides Himachal Govt | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి

Published Fri, Nov 29 2024 3:03 PM | Last Updated on Fri, Nov 29 2024 4:00 PM

Is This Way Of Encouraging Sportspersons: SC Chides Himachal Govt

క్రీడాకారులకు మీరిచ్చే ప్రోత్సాహం ఇదేనా? ముఖ్యమంత్రి ప్రకటనలు, హామీలు కాదు... ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఓ చాంపియన్‌ క్రీడాకారిణి పట్ల మీరు వ్యవహరించిన తీరు గర్హనీయం’.. అని సుప్రీం కోర్టు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో (2014)లో స్వర్ణ పతక విజేత పట్ల వ్యవహరించిన తీరు సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కాగా పూజ ఠాకూర్‌ అనే క్రీడాకారిణి ఇంచ్‌వాన్‌ (దక్షిణ కొరియా) ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన భారత కబడ్డీ జట్టు సభ్యురాలు. అయితే స్పోర్ట్స్‌ కోటా కింద గ్రేడ్‌–1 ఉద్యోగానికి అర్హురాలైన ఆమెకు ఎక్సైజ్‌–టాక్సేషన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చిన హిమాచల్‌ ప్రభుత్వం నియామకం మాత్రం జరపలేదు. దీని కోసం ఏళ్ల తరబడి హిమాచల్‌ సీఎం కార్యాలయం చుట్టూ పూజా ఠాకూర్‌ తిరుగుతోంది.

స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి
ఈ నేపథ్యంలో.. జూలై 2015 నుంచి పూజ ఠాకూర్‌ చేస్తున్న పోరాటానికి స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి... ఆమెను ఎక్సైజ్‌–టాక్సేషన్‌ ఆఫీసర్‌గా నియమించాలని తీర్పు ఇచ్చారు. అయినా సరే నియామకం జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. 

ఈ క్రమంలో.. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిలతో కూడిన ద్విసభ్య బెంచ్‌ వెంటనే ఆమెను ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది.

సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి
ఈ సందర్భంగా.. హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును యథాతథంగా అమలు చేయాలని... ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. అదే విధంగా.. ఇన్నేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం పూజ ఠాకూర్‌ నియామకానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

అంతేకాదు.. జూలై 2015 నుంచే సినియారిటీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌కు లోబడి పొందే అన్ని ప్రయోజనాలకు ఆమె అర్హురాలని సుప్రీం బెంచ్‌ తీర్పులో వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement