సవిత, హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు.. | Harmanpreet, Savita win Men's and Women's Hockey India Player of the Year awards | Sakshi
Sakshi News home page

సవిత, హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు..

Published Sun, Mar 16 2025 10:53 AM | Last Updated on Sun, Mar 16 2025 11:08 AM

Harmanpreet, Savita win Men's and Women's Hockey India Player of the Year awards

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల జట్టు గోల్‌కీపర్‌ సవితా పూనియాకు... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ పురస్కారాలు అందజేస్తోంది.

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో సారి విశ్వ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్‌ప్రీత్‌ సభ్యుడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గానూ సవిత హాకీ ఇండియా బల్జీత్‌ సింగ్‌ ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కూడా దక్కించుకుంది.

‘ఈ పురస్కారాలకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు సభ్యుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు. ఈ అవార్డులు ఆటపై ఏకాగ్రతను మరింత పెంచుతాయి’ అని సవిత పేర్కొంది. ‘ఈ అవార్డు నాకు ప్రేరణ వంటిది. యువ ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా ఇవి తోడ్పాటునిస్తాయి’ అని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచకప్‌ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement