వహ్వా హాకీ.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం | Paris Olympics 2024: India Wins Bronze Medal In Mens Hockey | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: వహ్వా హాకీ.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం

Published Thu, Aug 8 2024 7:22 PM | Last Updated on Fri, Aug 9 2024 6:49 AM

Paris Olympics 2024: India Wins Bronze Medal In Mens Hockey

కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు 

52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు    

ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో 2–1తో స్పెయిన్‌పై గెలుపు

ఘనంగా గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ రిటైర్మెంట్‌ 

పారిస్‌ క్రీడల్లో భారత్‌కు నాలుగో కాంస్యం

టోక్యోలో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత హాకీ జట్టు పారిస్‌ వరకు దానిని  కొనసాగించింది. నాటి విజయం తర్వాత అంచనాలను పెంచిన మన టీమ్‌ ఈసారి కూడా దానికి తగినట్లుగా పతకాన్ని  అందించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తమ సత్తాను చాటింది. 

1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్‌ మెడల్‌ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్‌ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. 

రెండు  సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ చరిత్రలో భారత హాకీకిది 13వ పతకం కావడం విశేషం. 
 
పారిస్‌: మ్యాచ్‌లో 58 నిమిషాలు ముగిసేసరికి 2–1తో ఆధిక్యంలో భారత్‌... మరో రెండు నిమిషాలు బంతిపై పట్టు ఉంచుకుంటే చాలు మ్యాచ్‌ మనదే... అయితే సరిగ్గా 59వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. దాంతో అందరిలో కాస్త ఆందోళన... గతంలో చాలా సందర్భాల్లో భారత జట్టు గెలిచే స్థితిలో ఉండి ఆఖరిలో పెనాల్టీ కార్నర్‌ల ద్వారా గోల్స్‌ ఇచ్చి మ్యాచ్‌ కోల్పోయింది. కాబట్టి కొంత ఉత్కంఠ! అయితే స్పెయిన్‌ ప్లేయర్‌ మిరాల్స్‌ ప్రయత్నాన్ని భారత గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ అడ్డుకున్నాడు. 

ఆ వెంటనే 60వ నిమిషంలో కూడా వారికి మరో పెనాల్టీ కార్నర్‌. ఈసారి కూడా శ్రీజేశ్‌ నిలువరించాడు. దాంతో పాటు చురుగ్గా ఉన్న మన ఆటగాళ్లు బంతిని అందుకొని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. స్పెయిన్‌ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినా మళ్లీ మన సర్కిల్‌లోకి రాలేకపోయారు. అంతే... టీమిండియా బృందంలో సంబరాలు మొదలయ్యాయి. శ్రీజేశ్‌ తన కీపింగ్‌ పోస్ట్‌ వద్ద కుప్పకూలిపోగా... సహచరులంతా చుట్టుముట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. 

సెమీస్‌లో అనూహ్యంగా ఓడినా... చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్‌’ పోరులో భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 2 గోల్స్‌ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా... స్పెయిన్‌ తరఫున మార్క్‌ మిరాల్స్‌ (18వ నిమిషం) ఏకైక గోల్‌ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది. 

సమష్టి ప్రదర్శనతో... 
1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భారత్‌ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో భారతీయుల నమ్మకాన్ని జట్టు వమ్ము చేయలేదు. అటు అటాకింగ్‌లో, ఇటు డిఫెన్స్‌లో కూడా జట్టు ప్రభావం చూపించింది. సస్పెన్షన్‌ కారణంగా గత మ్యాచ్‌ ఆడని డిఫెండర్‌ అమిత్‌ ఈ మ్యాచ్‌లో తిరిగొచ్చి బలంగా నిలబడ్డాడు. 6వ నిమిషంలో సుఖ్‌జీత్‌కు గోల్‌ అవకాశం వచ్చినా అతను పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో గోల్‌ నమోదు కాలేదు. 

అయితే రెండో క్వార్టర్‌లో స్పెయిన్‌ శుభారంభం చేసింది. క్లేప్స్‌ను టాకింగ్‌ చేసే ప్రయత్నంలో ‘డి’లో మన్‌ప్రీత్‌ ఫౌల్‌ చేయడంతో స్పెయిన్‌ పెనాల్టీ స్ట్రోక్‌ లభించగా, దానిని మిరాల్స్‌ సులువుగా గోల్‌గా మలిచాడు. అయితే 21 సెకన్లలో రెండో క్వార్టర్‌ ముగుస్తుందనగా పెనాల్టీతో భారత్‌ స్కోరు సమం చేసింది. మరో మూడు నిమిషాలకే మళ్లీ పెనాల్టీ ద్వారానే హర్మన్‌ స్కోరు చేయడంతో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఆ తర్వాత మన జట్టు దానిని చివరి వరకు నిలబెట్టుకోగా... ఆఖరి మూడు నిమిషాల్లో గోల్‌ కీపర్‌ను తప్పించి స్కోరును సమం చేసేందుకు స్పెయిన్‌ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమకు లభించిన 6 పెనాల్టీ కార్నర్‌లను భారత్‌ 2 గోల్స్‌తో సద్వినియోగం చేసుకోగా... స్పెయిన్‌కు 9 పెనాల్టీలు లభించినా ఆ జట్టు ఒక్కదానినీ గోల్‌గా మలచలేకపోయింది.

‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ భారత్‌’ శ్రీజేశ్‌ అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రీజేశ్‌ ముందే ప్రకటించాడు. అతనికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు జట్టు సభ్యులు వెల్లడించారు. 

ఒక్కొక్కరికీ 15 లక్షలు 
ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా  
పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్‌ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం కావడం విశేషం.  

నెదర్లాండ్స్‌కు స్వర్ణం 
24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్‌ ‘పెనాల్టీ షూటౌట్‌’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్‌ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా... నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి.   

నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించింది.    –పీఆర్‌ శ్రీజేశ్‌  

కాంస్యపతక పోరు మాకూ, మా దేశానికి ఎంతో కీలకం. ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదు. భారత్‌ వరుసగా రెండు సార్లు పతకం సాధించడం గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. పెనాల్టీ కార్నర్‌లను మా బృందం చాలా అద్భుతంగా  నిలువరించగలిగింది. హాకీపై ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా.    –హర్మన్‌ప్రీత్‌ సింగ్, కెప్టెన్

ఎన్నో తరాల పాటు గుర్తుంచుకునే ప్రదర్శన ఇది. భారత హాకీ జట్టు ఒలింపిక్‌ కాంస్యంతో మెరిసింది. ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. ప్రతిభ, పట్టుదలకు తోడు సమష్టి కృషి దీనిని అందించింది. ఆటగాళ్లకు నా అభినందనలు. ప్రతీ భారతీయుడికి మానసికంగా హాకీతో బలమైన బంధం ఉంది. ఈ విజయం వల్ల యువతలో ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుంది.  –నరేంద్ర మోదీ, ప్రధాని   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement