2023 మార్చి... సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. పేలవ ఆటతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచిన టీమ్... గతంలో ఏ ఆతిథ్య జట్టూ ఎదుర్కోని అవమానాన్ని భరించాల్సి వచ్చింది. దాంతో మరోసారి భారత హాకీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జట్టు ఇదేనా అనిపించింది.
అప్పుడప్పుడే మళ్లీ ఆటపై ఆసక్తి పెరుగుతున్న దశలో స్వదేశంలో జట్టు ఆట మళ్లీ నిరాశపర్చింది. దాంతో సహజంగానే జరిగిన మార్పుల్లో భాగంగా ముందుగా కోచ్ గ్రాహం రీడ్‌పై వేటు పడింది. కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్ వచ్చాడు. ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉన్న అతను భారత జట్టును మళ్లీ దారిలోకి తీసుకురాగలడని అంతా భావించారు. ఈ నమ్మకాన్ని ఫుల్టన్ నిలబెట్టుకున్నాడు.
తనదైన శైలిలో ఆటగాళ్లను మరింత పదునుగా మార్చే పనిలో పడ్డాడు. అప్పటికే సీనియర్లుగా దేశం తరఫున ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు ఆడిన వారిని కూడా తనకు కావాల్సిన రీతిలో మలచుకున్నాడు. ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌లో వేగం పెంచడం, ఆరంభం నుంచే దూకుడు పెంచి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంవంటి విషయంలో ఆటగాళ్లలో కొత్త తరహా ఆటను తీసుకొచ్చాడు. ముందుగా ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడ్డా మెల్లగా ఇవి మంచి ఫలితాలు అందించాయి.
ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణాలు గెలిచిన భారత్ ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆటగాళ్లందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. వరల్డ్ కప్ వైఫల్యాన్ని దాటి మున్ముందు పెద్ద విజయం సాధించాలనే కసి, పట్టుదల వారిలో పెరిగాయి.
ఒలింపిక్స్‌లో భారత జట్టు ఆట చూస్తే ఫుల్టన్ ప్రణాళికలు ఎంత అద్భుతంగా పని చేశాయో తెలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకే తరహా ఆటతో కాకుండా వేర్వేరు ప్రత్యర్థుల కోసం జట్టు వేర్వేరు వ్యూహాలు పన్నింది. బెల్జియం జట్టు తమ డిఫెన్స్‌ను పటిష్టంగా ఉంచుకుంటూనే దూకుడుగా ఆడింది. అదే ఆ్రస్టేలియాపై వచ్చేసరికి ఆట మారింది. క్షణకాలం డిఫెన్స్‌లో పడినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందని తెలుసు కాబట్టి తొలి నిమిషం నుంచి పూర్తిగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టింది. మళ్లీ బ్రిటన్‌తో మ్యాచ్ వచ్చేసరికి డిఫెన్స్‌కు కట్టుబడింది.
ఒక ఆటగాడు తగ్గినా కీపర్‌తో కలిసి గోల్స్‌ను కాపాడుకోవడంలో జట్టు సఫలమైంది. సెమీస్‌లో జర్మనీతో ఓడినా గతంలో ఎన్నడూ చూడని అటాకింగ్, ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం మన టీమ్ నుంచి కనిపించిందని మాజీ ఆటగాడు వీరేన్ రస్కిన్హా వ్యాఖ్యానించడం విశేషం. క్షణాల వ్యవధిలో వ్యూహాలు మార్చుకోవడం, పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ఆటతీరును మలచుకోవడం గతంలో భారత జట్టు విషయంలో ఎప్పుడూ చూడనిది. భారత జట్టు గెలుపు మరో వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. అతనే ప్యాడీ ఆప్టన్.
స్పోర్ట్స్ సైకాలిజిస్ట్ అయిన ఆప్టన్ భారత హాకీ ఆటగాళ్లను మానసికంగా సంసిద్ధం చేయడంలో, ఒత్తిడిని ఎదుర్కోకుండా బలంగా నిలబడే విషయంలో సరైన దిశలో తీర్చిదిద్దాడు. 2011లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత జట్టు ఇదే ఆప్టన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా వ్యవహరించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కోచ్‌ల వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు ఎక్కడా గతి తప్పలేదు. ఒలింపిక్స్‌తో రిటైర్ అవుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా ప్రత్యర్థులను నిలువరించాడు.
ఎనిమిది మ్యాచ్‌లలో అతను 62 షాట్‌లను ఎదుర్కొంటే 50 షాట్‌లను ఆపడం విశేషం. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీలను గోల్స్‌గా మలచడంలో అద్భుత నైపుణ్యం చూపిస్తూ ఒలింపిక్స్‌లో 10 గోల్స్ నమోదు చేశాడు. డిఫెండర్లు రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌లు అద్భుతంగా ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అత్యంత సీనియర్ అయిన మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో తన పదును చూపించగ, మరో సీనియర్ మన్‌దీప్ ఫార్వర్డ్‌గా జట్టును నడిపించాడు.
అందరి సమష్టి ప్రదర్శన, పోరాటం, పట్టుదల భారత్‌కు వరుసగా రెండో కాంస్యాన్ని అందించాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులోని 11 మంది సభ్యులు ‘పారిస్’లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. –సాక్షి క్రీడా విభాగం
జ్యోతికి మళ్లీ నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.
వెనుకంజలో గోల్ఫర్లు
పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment